ప్రియా ఆంటీ బయోగ్రఫీ
బుల్లి తెర.. వెండి తెరపై తనదైన ముద్రను వేసిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రియా. ఈమె కెరీర్ ఆరంభంలో దాదాపు అందరు స్టార్ హీరోయిన్స్ కు స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోలకు తల్లిగా అక్కగా నటించి మెప్పించింది. బుల్లి తెరపై ఈమె నటించిన సీరియల్స్ జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. ఇటీవల ఈమె వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. బిగ్ బాస్ లోకి చాలా పాజిటివిటీతో వెళ్లిన ప్రియా బయటకు వచ్చే సమయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంది. ప్రియా కెరీర్ ఎలా సాగింది.. ఆమె బాల్యంకు సంబంధించిన విషయాలన్నింటిని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం.
ప్రియా పూర్తి పేరు మామిళ్ల శైలజ ప్రియా. గుంటూరు జిల్లా బాపట్లలో మామిళ్ల వెంకటేశ్వర్ రావు, మామిళ్ల కుసుమ కుమారి దంపతులకు 1978 మే 20న ఈమె జన్మించారు. ప్రియాకు ముందు వారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అంటే ప్రియా వారికి మూడవ సంతానం. కుటుంబంలో చిన్నపిల్ల అవ్వడం వల్ల ప్రియా చిన్నప్పటి నుండి గారాబంగానే పెరిగారు. ఇద్దరు అక్కలు మరియు అమ్మానాన్న అంతా కూడా ఆమెను గారాబం చేస్తూ ఉండేవారు. 1980ల్లోనే ప్రియా కుటుంబం హైదరాబాద్ కు షిప్ట్ అయ్యింది. ఈమె చదువు ఎక్కువగా హైదరాబాద్ లోనే సాగింది. 10వ తరగతి తర్వాత చదువు మానేసిన ప్రియా మళ్లీ కొన్నాళ్లకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కాలేజ్ కు వెళ్లింది. కాలేజ్ రోజుల్లో ఆమె అందంకు ఎంతో మంది ఫిదా అయ్యి ఆమె వెంట పడే వారు. ఆమెను అప్పట్లోనే ఎంతో మంది ఆరాధించే వారు. కాలేజ్ అందాల పోటీల్లో ప్రియా మిస్ కాలేజ్ గా నిలిచింది. అలా ప్రియాకు మోడలింగ్ మరియు సినిమాలపై ఆసక్తి పెరిగింది.
ప్రియా అందం గురించి ఆ నోట ఈనోట పడి సినిమా ఇండస్ట్రీ వరకు వెళ్లింది. ఆమెకు కూడా సినిమాలపై ఆసక్తి ఉండటంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. అయితే ప్రియా హీరోయిన్ గా నటించి ఉంటే మంచి స్టార్ డమ్ ను దక్కించుకునేది కాని కెరీర్ ఆరంభంలో ఎంచుకున్న సినిమాలో లేదా మరేంటో కాని ఆమె కెరీర్ మొత్తం కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చింది. ప్రియాకు మొదటగా దొంగాట సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 1997 లో విడుదల అయిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో హీరోయిన్ సౌందర్యకు స్నేహితురాలి పాత్రలో నటించింది. ఆ సమయంలో సౌందర్య నిజ జీవితంలో కూడా ప్రియా స్నేహితురాలు అయ్యింది. అలా చాలా సినిమాల్లో సౌందర్య తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. దొంగాట సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత సినిమాలో ఈమెకు అవకాశం దక్కింది. ఆ సినిమాలో కూడా హీరోయిన్ కు సోదరి పాత్రలోనే నటించింది. అలా మాస్టర్, మావిడాకులు, శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, చంద్రలేఖ, సూర్యుడు వంటి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ ల స్థాయి అందం ఉండటంతో పాటు మంచి నటిగా కూడా ప్రూవ్ చేసుకుంటుంది కనుక వరుసగా ఆఫర్లు వచ్చాయి.
కొన్ని సినిమాల్లో హీరోయిన్ ను డామినేట్ చేసేంత అందంగా ఉందని కూడా అప్పట్లో టాక్ వచ్చింది. 1997 మొదలుకుని దాదాపుగా అయిదు సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా సినిమాల్లో నటించింది. అప్పటికి వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తూనే ఉన్న సమయంలో ఎంవీఎస్ కిషోర్ తో ప్రేమలో పడింది. 24 ఏళ్ల వయసులో ఉండగా అంటే 2002 సంవత్సరంలో ఆయన్ను ప్రియా పెళ్లి చేసుకుంది. రెండు మూడు ఏళ్ల ప్రేమ వ్యవహారం సాగించి ఇరు కుటుంబాల అంగీకారంతో ఈమె పెళ్లికి సిద్దం అయ్యింట. పెళ్లి తర్వాత దాదాపుగా పదేళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఆ సమయంలో ఒక బాబు మరియు పాపకు జన్మనిచ్చింది. ప్రియా బాబు పేరు నిశ్చయ్ కాగా పాప అనారోగ్య సమస్యలతో చిన్నతనంలోనే మృతి చెందింది. కుటుంబ సమస్యలు మరియు ఇతర విషయాల కారణంగా కొన్నాళ్ల క్రితం భర్త నుండి దూరం అయ్యింది. ఇప్పటికి అతడి నుండి ప్రియా అధికారికంగా విడాకులు అయితే తీసుకోలేదు కాని వేరుగా ఉంటుంది. ప్రస్తుతం తన 18 ఏళ్ల కొడుకుతో సింగిల్ మదర్ గా జీవనం సాగిస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రియా మళ్లీ సినిమాల్లో నటించాలని భావించింది. చిన్నా చితకా ఆఫర్లు వచ్చాయి.
2010 లో కత్తి కాంతారావు సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ సినిమా తో ప్రియాకు మంచి కమ్ బ్యాక్ లభించింది. అప్పటి నుండి మళ్లీ ప్రియా బిజీ అయ్యారు. 2012 సంవత్సరంలో వచ్చిన నాగార్జున ఢమరుకం సినిమాలో ప్రియా హీరో తల్లి పాత్ర పోషించింది. నాగార్జున కంటే 20 ఏళ్లు వయసులో చిన్న అయిన ప్రియా ఆయనకు తల్లి పాత్రలో నటించి మెప్పించారు. ఆ సమయంలోనే ఆమెకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలా అక్క.. ఫ్రెండ్ పాత్రల నుండి అమ్మ పాత్రలకు షిప్ట్ అయ్యింది. ఎప్పుడైతే ప్రియా అమ్మ పాత్రల్లో నటించడం మొదలు పెట్టిందే అప్పటి నుండి కంటిన్యూస్ గా ఆమెకు అవే పాత్రలు వచ్చాయి. హీరో లేదా హీరోయిన్ కు అమ్మగా లేదా ఆంటీగా పాత్రలు చేస్తూ ప్రియా కాస్త ప్రియా ఆంటీగా మారిపోయింది. ఢమరుకం తర్వాత మిర్చిలో హీరోయిన్ కు తల్లి పాత్రలో నటించింది, ఇద్దరమ్మాయిలు సినిమాలో కూడా హీరోయిన్ కు తల్లి పాత్రలో నటించింది. ప్రముఖ హీరోల సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయిన ప్రియా మరో వైపు సీరియల్స్ లో కూడా సరికొత్తగా నటిస్తూ వచ్చింది. ఒక వైపు సినిమాలు మరో వైపు సీరియల్స్ లో కూడా చేసిన ఘనత ప్రియా కే దక్కింది అనడంలో సందేహం లేదు.
సీరియల్స్ లో కూడా మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువ పాత్రల్లో కనిపించింది. కొన్ని సీరియల్స్ లో మాత్రం లీడ్ రోల్ లో కనిపించారు. ప్రియాకు ఉషా కిరణ్ వారు నిర్మించిన పలు సీరియల్స్ లో అవకాశాలు దక్కాయి. ప్రియా నటించిన సీరియల్స్ విషయానికి వస్తే మొదటగా జెమిని టీవీలో ఈమె ప్రియ సఖి అనే సీరియల్ లో నటించింది. ఆ తర్వాత ప్రియ నిన్ను చూడలేక, ప్రియా ఓ ప్రియా, ఈటీవీలో ప్రసారం అయిన లేడీ డిటెక్టివ్, సంఘర్షణ, పెళ్లి చేసుకుందాం, జ్వాలా సీరియల్స్ లో నటించింది. ఇక జెమిని టీవీలో ప్రసారం అయిన డైరీ ఆఫ్ మిసెస్ శారద, కొత్త బంగారం లో నటించింది. ఈమద్య కాలంలో జీ తెలుగు లో నెం. 1 కోడలు, చిన్న కోడలు సీరియల్స్ చేసింది. ఇక మా టీవీలో ఈమె నటించిన శశిరేఖ పరిణయం, మానస సీరియల్స్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సినిమాల ద్వారా కంటే సీరియల్స్ ద్వారా ప్రియా కు మంచి గుర్తింపు లభించింది. సినిమాలు మరియు సీరియల్స్ లో సమాంతరంగా నటించిన ఏకైక తెలుగు నటి ప్రియా అనడంలో సందేహం లేదు. తెలుగు లోనే కాకుండా తమిళం మరియు హిందీలో కూడా ఈమె నటించారు. బుల్లి తెరపై ఈమె సీరియల్స్ మాత్రమే చేయడం కాకుండా షో లు కూడా చేశారు.
ఇటీవల ఈమె బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్నారు. మొదటి నెల రోజుల పాటు చాలా పద్దతిగా హుందాగా ప్రియా కనిపించారు. కాని సన్నీతో ఒకానొక సమయంలో గొడవ తీవ్రతరం అయ్యి ఆమె తన శాంత స్వభావంను కోల్పోయింది. సన్నీని టార్గెట్ చేయడంతో పాటు అతడి చెంప పగులకొడతానంటూ పదే పదే అనడంతో ప్రేక్షకులు ఆమెను పక్కకు పెట్టినట్లుగా ఓట్లు వేయలేదు. దాంతో ఆమె కనీసం పది వారాలు ఉంటుంది అనుకుంటే ముందుగానే బయటకు వచ్చేసింది. అయితే ప్రియా పై ఉన్న ఇంతకు ముందు అభిప్రాయం మాత్రం అందరిలో అలాగే కొనసాగుతుంది. ఇంకా ఆమెను నటిగా చూడాలని కోరుకునే వారు ఎక్కువ మంది అయ్యారు కాని తక్కువ కాలేదు. ఇండస్ట్రీలో ఆమె సుదీర్ఘ అనుభవం ఉంది కనుక ఆమెకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం. ప్రస్తుతం కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పిన ప్రియా తాను సింగిల్ ఉమెనా లేదంటే మ్యారీడ్ ఉమెనా అనే విషయం నాకే తెలియడం లేదు అంటూ బిగ్ బాస్ లో ఉన్న సమయంలో వ్యాఖ్యలు చేసింది. దాంతో ఆమె కుటుంబం పరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రియా కు మంచి ఫాలోయింగ్ ఉంది. కనుక ఈ అవకాశంను ఆమె సద్వినియోగం చేసుకుని మరిన్ని సినిమాలు చేస్తూ నటిగా మరింత కాలం కొనసాగాలంటూ అభిమానులు ఆశిస్తున్నారు.