కైకాల సత్యనారాయణ బయోగ్రఫీ
తెలుగు సినీ ప్రియులకు కైకాల సత్యనారాయణ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నవరస నటసార్వభౌమ గా పేరు దక్కించుకున్న కైకాల తెలుగు సినిమాకు ఒక ఆణిముత్యం. సుమారు 50 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా సినిమాలు చేసిన ఘనత ఆయనది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయంను లిఖించుకున్న కైకాల సత్యనారాయణ సొంత ఊరు కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరు మండలం కౌతరం గ్రామం. 1935 జులై 25న కైకాల లక్ష్మి నారాయణ కు మన కైకాల సత్యనారాయణ జన్మించారు. గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. అప్పట్లోనే మన కైకాల గారు గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేయడం జరిగింది. తన 25 ఏళ్ల వయసులో నాగేశ్వరమ్మతో కైకాల వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. ఇద్దరు కొడుకులు సంతానం. ఉన్నత చదువులు చదివినా కూడా సినిమాలపై అభిరుచితో ఎన్నో నాటకాలు వేశాడు. నాటకాల్లో మంచి పేరు తెచ్చుకున్న కైకాల సినిమా ఆఫర్ల కోసం మద్రాసు చేరుకున్నారు. మంచి ఫిజిక్ తో పాటు గంభీర్యమైన కంఠం మంచి నటన ప్రతిభ ఉన్న కైకాలకు డి యల్ నారాయణ మొదటి అవకాశంను ఇచ్చారు.
1959 లో సిపాయి కూతురు అనే సినిమాలో కైకాలకు మొదటి అవకాశం ను ఆయన ఇచ్చారు. ఆ సినిమా ను చంగయ్యా అనే దర్శకుడు తెరకెక్కించాడు. సిపాయి కూతురు మరీ దారుణమైన పరాజయం చవి చూసింది. మొదటి సినిమా నే ఇంతలా ప్లాప్ అయ్యిందేంటి అనుకుని వెను దిరగకుండా కైకాలా ప్రయత్నాలు చేయడం మళ్లీ కొనసాగించాడు. సిపాయి కూతురు సినిమా ప్లాప్ అయినా కూడా అందులో కైకాల వారి నటనకు మంచి మార్కులు పడ్డాయి. చాలా మంది ఈ కొత్త నటుడు ఎవరు భలే ఉన్నాడే అనుకుంటూ చిత్ర దర్శకుడు చంగయ్య మరియు డి యల్ నారాయణ ను సంప్రదించారట. ఎన్టీఆర్ ఫిజిక్ కు కాస్త దగ్గరగా ఉన్నాడు కనుక డూప్ గా బాగా పనికి వస్తాడని అప్పుడు చాలా మంది అభిప్రాయ పడ్డారు. అలా ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాల్లో డూప్ గా చేశాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేసిన సినిమాల్లో కైకాల వారు ఎక్కువగా నటించారు. అందులో కైకాల ఫేస్ కనిపించదు కాని సైడ్ నుండి వెనుక నుండి ఇద్దరు ఎన్టీఆర్ లు ఒకే సారి ఉన్న సన్నివేశాల్లో ఉంటారు.
ఎన్టీఆర్ కు డూప్ లా నటిస్తున్న సమయంలోనే నటుడిగా ఆఫర్లు రావడం మొదలు అయ్యింది. ఎన్టీఆర్ వారి సినిమా లోనే కైకాలకు మంచి పాత్రలు వచ్చాయి. డూప్ కాస్త పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టుగా లేదా విలన్ గా నటించేలా ఎన్టీఆర్ అవకాశాలు ఇవ్వడం జరిగింది. అలా మొదలైన కైకాల వారి ప్రస్థానం ఒక అద్బుతం అన్నట్లుగా సాగింది. 1960 సంవత్సరంలో సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే సినిమా లో యువ రాజు పాత్ర ను వేశాడు. ఆ సినిమాలోని పాత్రకు కూడా మంచి పేరును దక్కించుకున్న కైకాల ఆ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకోవడం మొదలు పెట్టారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కాకుండా కైకాల లో ఒక మంచి విలన్ దాగి ఉన్నాడు అనే విషయాన్ని విఠలాచార్య వారు గుర్తించారు. కనకదుర్గ పూజా మహిమ అనే సినిమాలో విలన్ పాత్రను కైకాలతో విఠలాచార్య చేయించారు. ఆ సినిమాలో విలన్ పాత్రకు మంచి పేరు వచ్చింది. అలా కైకాల వారు విలన్ పాత్రలకు ఫిక్స్ అయ్యి పోయారు. వరుసగా విలన్ పాత్రలు చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు చేయస్తూ వచ్చిన కైకాల ఒక సంపూర్ణ నటుడు అనే పేరును దక్కించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన యమగోల సినిమా లో కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో నటించారు.
నిజంగా యముడు ఇలాగే ఉంటాడేమో అంటూ అంతా అనుకునేలా కైకాల వారు నటించారు. కేవలం నటుడిగానే కాకుండా యముడి గెటప్ అద్బుతంగా ఆయనకు సూట్ అయ్యింది. అప్పటి నుండి యముడి పాత్ర ఏ సినిమాలో అవసరం వచ్చినా కూడా కైకాల వారిని సంప్రదించే వారు. యముడి పాత్రకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా సత్యనారాయణ నిలిచారు. అప్పట్లో రాముడు, కృష్ణుడు పాత్రలు అనగానే ఎన్టీఆర్ గుర్తుకు వచ్చే వారు. అలా యముడి పాత్ర అనగానే సత్యనారాయణ గుర్తుకు వచ్చే వారు. పౌరాణిక పాత్రలు అయిన రావణుడు, దుర్యోదనుడు, ఘటోత్కచుడు, యముడి పాత్రలు పోషించి మెప్పించాడు. తెలుగు సినిమాకు ఎస్వీ రంగారావు లేని లోటును కైకాల వారు తీర్చగలరు అనే నమ్మకం చాలా మందికి కలిగింది. ఎస్వీఆర్ కోసం అనుకున్న పాత్రలు చాలా వరకు కైకాల వారి వద్దకు వచ్చాయి. అప్పట్లో కైకాల సత్య నారాయణ డేట్ల కోసం స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా వేయడం.. షెడ్యూల్ మార్చడం వంటివి జరిగేవి. రోజులో రెండు మూడు షిప్ట్ ల్లో ఒకే రోజు రెండు మూడు సినిమాల్లో నటించిన ఘనత కైకాల వారికి దక్కతుంది. అప్పట్లో అంతగా నటించారు కనుకే ఆయన కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు 777 సినిమాలను చేశారు.
తెలుగు సినిమా రెండవ తరం హీరోలతో మొదలుకుని నిన్నటి తరం హీరోలు అయిన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి స్టార్స్ సినిమాల్లో కూడా కైకాల వారు నటించారు. సుదీర్ఘ మైన కెరీర్ లో ఎన్నో ఘన విజయాలను దక్కించుకున్నారు.. అలాగే పరాజయాలను మూట కట్టుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తెలుగు సినిమాకు కైకాల వారు సేవలు అందించారు. రమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ ను ప్రారంభించి ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి సినిమాలను నిర్మించారు. అన్నగారు తెలుగు దేశం పార్టీని ప్రారంభించిన సమయంలో ఆయన వెంట రాజకీయాల్లో నడిచారు. 1996 లో రాజకీయాల్లో అడుగు పెట్టిన కైకాల వారు మచిలీపట్నం పార్లమెంటు నియోజక వర్గం నుండి తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసి 11 వ లోక్ సభ లో సభ్యుడిగా అడుగు పెట్టారు. కొన్ని కారణాల వల్ల రాజకీయాల నుండి కొద్ది కాలంకే ఆయన తప్పుకున్నా కూడా తాను చేయాలనుకున్న సేవా కార్యక్రమాలు మాత్రం ఛారిటీ ద్వారా కొనసాగించారు.
కైకాల వారు ఎంపీగా ఉన్న సమయంలో చాలా అభివృద్ది పనులు చేశారు. కైకాల వారి వారు తన వారసులను ఎవరిని కూడా ఇండస్ట్రీకి తీసుకు వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. వారు వారి వారి రంగాల్లో సెటిల్ అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చిన సమయంలో మద్రాస్ నుండి కైకాల వారు కూడా హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే నివాసం ఏర్పర్చుకున్నారు. 2019 లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘ఎన్టీఆర్ కథా నాయకుడు’ మరియు మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాల్లో ఈయన నటించారు. ఆ సినిమా ల తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. వృధ్యాప్యం మీద పడ్డ నేపథ్యంలో ఆయన సినిమాల్లో నటించలేక పోతున్నారు. ఇటీవల అనారోగ్య పరిస్థితులు ఎక్కువ అవ్వడంతో పాటు చిన్న పాటి ప్రమాదాలకు కూడా గురి అవ్వడం వల్ల ఆయన మరింతగా అవస్థలు ఎదుర్కొంటున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు.
కైకాల వారి సినీ జీవితానికి సంబంధించిన మరి కొన్ని విషయాల విషయానికి వస్తే.. మొత్తం నటించిన సినిమా లు 777 అందులో 28 పౌరాణిక సినిమాలు కాగా 51 జానపద చిత్రాలు మరియు 9 చారిత్రాత్మక చిత్రాలు. కైకాల వారు మొత్తంగా 200 మంది దర్శకులతో కలిసి పని చేశారు. ఆయన నటించిన 223 సినిమాలు 100 రోజులు అంతకు మించి ఆడాయి. కైకాల వారు నటించిన 10 సినిమాలు ఏడాదికి మించి థియేటర్లలో ప్రదర్శితం అయ్యి రికార్డులను సృష్టించాయి. తెలుగు సినిమా చరిత్రలో కైకాల సత్యనారాయణకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం నిలిచి ఉంటారు. అంతటి గొప్ప వ్యక్తి కనుకే కన్నడ సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ ను ఆయన సమర్పణలో విడుదల చేయడం జరిగింది. అది కైకాల వారికి కేజీఎఫ్ టీమ్ ఇచ్చిన ఘనత. కైకాల వారి ఘనత లాగే కేజీఎఫ్ సినిమా కూడా అంతటి విజయాన్ని సొంతం చేసుకుంది.