వైకాపా ఎంపీ మార్గని భరత్ బయోగ్రఫి
రాజమండ్రి వైకాపా ఎంపీగా గెలుపొందక ముందు మార్గని భరత్ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తూర్పు గోదావరి జిల్లాలో కూడా పెద్దగా ఎవరికి తెలియదు. జగన్ రాజమండ్రి పార్లమెంట్ సీటును మార్గాని భరత్ అనే వ్యక్తికి ఇస్తున్నట్లుగా ప్రకటించిన సమయంలో అతడు ఎవరు అనేది వైకాపా నాయకులకు కూడా సరిగ్గా తెలియదు. అప్పటికే హీరోగా ఒక సినిమా చేసినా కూడా భరత్ కు గుర్తింపు లేదు. ఎప్పుడైతే రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందాడో అప్పటి నుండి భరత్ పేరు మారు మ్రోగిపోయింది. హీరోగా రాని గుర్తింపు ఎంపీగా గెలుపొందిన తర్వాత భరత్ కు దక్కింది. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. వైకాపా అధినేత వైఎస్ జగన్ తో పరిచయం తో మార్గాని భరత్ కు కలిసి వచ్చింది. జగన్ పాద యాత్ర సమయంలో భరత్ క్రియాశీలకంగా వ్యవహరించారు. అధికారంలోకి రావడం కోసం యువకులతో ఒక టీమ్ ను జగన్ తయారు చేసుకున్నారు. ఆ టీమ్ లో భరత్ కు చోటు కల్పించడం జరిగింది. ఉన్నత విద్యావంతుడు అవ్వడంతో పాటు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండి.. మంచి వ్యాపారవేత్తగా ఆర్థికంగా పుష్కలంగా ఉన్న వ్యక్తి అవ్వడం వల్ల భరత్ కు ఏ బాధ్యత అప్పగించినా కూడా చక్కబెడుతూ జగన్ కు మరింత సన్నిహితుడు అయ్యాడు. అందుకే పార్లమెంట్ ఎన్నికల సమయంలో హేమా హేమీలు ఉన్నా కూడా అవతల వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి అయినా కూడా భరత్ పై నమ్మకం తో జగన్ రాజమండ్రి ఎంపీ స్థానంను మార్గాని భరత్ కు ఇవ్వడం జరిగింది. జగన్ తనపై పెట్టుకున్న నమ్మకంను నిలబెట్టుకుని రాజమండ్రి పార్లమెంటు స్థానంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న భరత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. జగన్ కు మరింత దగ్గర అవుతూ పార్టీ మరింత బలోపేతం అవ్వడం కోసం చర్యలు తీసుకుంటూ జగన్ వద్ద మంచి పేరును తెచ్చుకున్న మార్గని భరత్ గురించిన జీవిత విశేషాలు.. ఆయన విద్యాభ్యాసం.. సినీ కెరీర్.. రాజకీయ ఎంట్రీ ఇలాంటి విషయాలన్నింటిని ఈ వీడియోలో చూద్దాం.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బలమైన బీసీ సంఘ నాయకుడు అయిన మార్గాని నాగేశ్వరరావు, ప్రసూనల తనయుడు భరత్. చిత్తూరు జిల్లా తిరుపతిలో 1982 మే 12న భరత్ జన్మించారు. భరత్ ఓనమాలు నేర్చింది రాజమండ్రిలోనే.. అయినా ఎక్కువగా ఊటిలోని షఫర్డ్ కాన్వెంట్ స్కూల్ లో చదువుకున్నాడు. పదవ తరగతి వరకు ఊటిలోనే ఉన్న భరత్ ఇంటర్మీడియట్ కోసం భరత్ మళ్లీ రాజమండ్రి కాలేజ్ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్ చేరుకున్నాడు. డిగ్రీ తర్వాత ఎంబీఏ కోసం భరత్ అమెరికా వెళ్లారు. అక్కడ బిజినెస్ లో మెలకువలు నేర్చుకోవడంతో పాటు సినిమా రంగంపై అభిరుచితో అక్కడ యాక్టింగ్ వర్క్ షాప్ లకు హాజరు అయ్యేవాడు. అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత భరత్ వారసత్వ వ్యాపారంను చూసుకోవడం మొదలు పెట్టాడు. కెమికల్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు పలు వ్యాపారాలను మార్గాని ఫ్యామిలీ నడిపించేది. ఆ మొత్తం వ్యాపారాలను తండ్రితో కలిసి భరత్ చూసుకునే వారు.
ఇక 2013 డిసెంబర్ 12న మోన తో వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహంగా స్థానికులు చెబుతూ ఉంటారు. ఇద్దరు సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారనే ప్రచారం ఉంది. అయితే ఆ విషయంను ఇప్పటి వరకు మార్గాని ఫ్యామిలీ మెంబర్స్ దృవీకరించలేదు. భరత్, మోనాలకు ఇద్దరు కూతుర్లు. ఫ్యామిలీ, వ్యాపారంతో బిజీగా ఉన్న ఆ సమయంలోనే భరత్ తన యాక్టింగ్ ఇంట్రెస్ట్ ను బయట పెట్టాడు. చూడ్డానికి హ్యాండ్సమ్ గా తెలుగు హీరో ఫీచర్స్ పుష్కలంగా ఉండటంతో స్నేహితులు మరియు సన్నిహితులు హీరోగా ఎంట్రీ ఇవ్వమని సలహా ఇచ్చారు. తనకు కూడా సినిమాలపై చాలా ఆసక్తి ఉన్న కారణంగా హీరో అవ్వాలనే ఆశ భరత్ లో ఎక్కువ అయ్యింది. అలా పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ వచ్చాడు. సినిమాలపై ఉన్న ఆసక్తి మరింత పెరగడంతో ఒక వైపు వ్యాపారాలను చూసుకుంటూ మరో వైపు వైజాగ్ సత్యానంద్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ పొందాడు. వైజాగ్ లో నిర్వహించే ఫ్యాషన్ వీక్స్ లో మోడల్ గా పాల్గొనడంతో పాటు ఎన్నో అందాల పోటీలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ ఉండేవాడు భరత్. ఆ సమయంలో భరత్ కు ఇండస్ట్రీ వారితో పరిచయాలు పెరిగాయి. నిర్మాత వంశీ కృష్ణ శ్రీనివాస్ తో ఏర్పడిన పరిచయంతో భరత్ సినీ రంగ ప్రవేశం జరిగింది. ఓయ్ నిన్నే అంటూ సత్యం చల్లకోటి దర్శకత్వంలో భరత్ సినిమా చేశాడు. ఆ సినిమా అంతగా భరత్ కు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అయినా కూడా సినిమాల్లో ప్రయత్నాలు కొనసాగించాలని పలువురు భరత్ కు సూచించారు.
ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి స్టార్ గా గుర్తింపు దక్కించుకునే ఫీచర్స్ నీలో ఉన్నాయంటూ భరత్ ను పలువురు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ప్రోత్సహించారు. మొదటి సినిమా నిరాశ పర్చినా కూడా నిరుత్సాహం చెందకుండా భరత్ రెండవ సినిమాకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ సమయంలోనే రాజకీయాల్లోకి ఆకర్షితుడు అయ్యాడు. తండ్రి మార్గాని నాగేశ్వరరావు పార్టీ మారడం.. ఆ తర్వాత రాజకీయాలకు దూరం అవ్వడంతో ఆ స్థానంను తాను భర్తీ చేయాల్సి వచ్చింది. భరత్ మొదట్లో చాలా సీరియస్ గా రాజకీయాల్లోకి ఏమీ రాలేదు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా రాణించాలని ఆశించాడు. కాని ఎప్పుడైతే రాజకీయాల్లో భరత్ ప్రాముక్యత పెరిగిందో.. ఏ సమయంలో అయితే జగన్ కు సన్నిహితుడిగా మారిపోయాడో అప్పుడు సినిమాలపై ఆసక్తి వదిలేశాడు. సినిమాల కంటే రాజకీయాల్లోనే తనకు భవిష్యత్తు ఉంది.. తన అవసరం రాజకీయాల్లోనే ఉందనే విషయాన్ని భరత్ తెలుసుకున్నాడు. అంతే రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఇమిడి పోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర చేయడంతో ఆయనకు చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. పాదయాత్ర ప్లాన్ లో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ మనుగడకు ఆర్థికంగా చాలా ఖర్చు చేశారనే వాదన కూడా ఉంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డ భరత్ కు అనూహ్యంగా రాజమండ్రి ఎంపీ సీటు దక్కింది.
ఆ సమయంలో సన్నిహితులు కూడా రాజమండ్రిలో మురళి మోహన్ వంటి సీనియర్ పై గెలవడం భరత్ కు సాధ్యమా అనుకున్నారు. ఆరు పదుల వయసు అనుభవం ముందు మూడు పదుల వయసు అనుభవం ఎక్కడ నిలుస్తుందనే కామెంట్స్ వచ్చాయి. భరత్ ను రాజమండ్రి అభ్యర్థిగా ప్రకటించిన సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన వారు ఉన్నారు.. ఆయన నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన వారు ఉన్నారు. జగన్ నిర్ణయం కరెక్ట్ అని నిరూపించేందుకు భరత్ తీవ్రంగా కష్టపడ్డాడు. రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గంలో భాగం అయిన అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఇంటింటికి వెళ్లి జగన్ అవసరం ను ప్రజలకు తెలియజేసి అద్బుత విజయాన్ని మార్గాని భరత్ సొంతం చేసుకున్నారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకోలేదు. పార్లమెంట్ లో పలు సమస్యలపై గళం ఎత్తడంతో పాటు తోటి సీనియర్ ఎంపీలతో సమానంగా తన నియోజక వర్గ అభివృద్దికి నిధులు సమీకరించడం.. ప్రాజెక్ట్ లను తీసుకు రావడం చేస్తున్నాడు. యువ పారిశ్రామిక వేత్త గా కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. ఒక వైపు రాజకీయాలు మరో వైపు బిజినెస్ వ్యవహారాలతో మార్గాని భరత్ దూసుకు పోతూ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా గుర్తింపు దక్కుతుంది అనేందుకు భరత్ సాక్ష్యంగా వైకాపా నాయకులు చెబుతూ ఉంటారు. అధినేత మార్గంలో నడుస్తూ ఆయనకు సన్నిహితుడిగా ఉంటే తక్కువ సమయంలోనే అందలం ఎక్కవచ్చు అనేది కూడా భరత్ రాజకీయ ప్రస్థానంను బట్టి అర్థం చేసుకోవచ్చు.