తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్. ఒకే వ్యక్తి మీద రెండు బయోపిక్ లు రెడీ అవుతున్నాయి. 1991 లో చిరంజీవి గారు ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’, భానుచందర్ గారు ‘స్టువర్టుపురం దొంగలు’ సినిమాలు తీశారు, ఐతే అప్పుడు కూడా ఈ రెండు సినిమాలు ఒకే ఏడాది, 1991 లోనే రిలీజ్ అయ్యాయి. అయితే ఇంతకీ అసలు ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరు? గరిక నాగేశ్వరరావు అనే వ్యక్తి టైగర్ నాగేశ్వరరావు ఎలా అయ్యాడు? పోలీసులు, ప్రభుత్వాలు అతన్ని గజదొంగ అని అంటే, కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం అతన్ని దేవుడు అని ఎందుకు అంటున్నారు? అసలు ఒక దొంగ మీద బయోపిక్ తీయడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం.
అందరూ ఆయన్ను ఆంధ్ర రాబిన్ హుడ్ అంటారు. అసలు పేరు గరిక నాగేశ్వరరావు, అతని ఊరి పేరు స్టువర్టుపురం. ఆయన గురించి తెలుసుకోవాలంటే ముందుగా స్టువర్టుపురం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. స్టువర్టుపురం ఊరి గురించి తెలియని తెలుగువాడు ఉండి ఉండడు, ఆ పేరు చెప్తే అందరికీ దొంగలు, దొంగతనాలు, దోపిడీలే గుర్తుకురావచ్చు. కానీ అదంతా ఇప్పుడు లేదు, ఇప్పుడు అన్ని ప్రాంతాల్లానే స్టువర్టుపురం కూడా. కానీ, స్టువర్టుపురంకి అలాంటి మచ్చ ఎందుకు వచ్చింది? అది తెలుసుకోవాలంటే, 1913 లో మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన మార్పుల గురించి తెలుసుకోవాలి.
దక్షిణ భారతదేశంలోని ఏరుకుల జాతి వారు గాడిదలు, ఎడ్లబళ్ళ సహాయంతో చెన్నై నుండి కోస్తా ప్రాంతానికి నిత్యావసర సరుకులు, ధాన్యం రవాణా చేస్తూ గౌరవంగా బ్రతికేవారు. అయితే 1850లలో బ్రిటిష్ వారు రోడ్, రైలు రవాణా మార్గాలను అనుసరించడంతో ఆ తెగ వారికి పని లేకుండా పోయింది. అడవిలో బ్రతికే వారికి వ్యవసాయం తెలిసినా, బ్రిటిష్ వారు అడవీ చట్టాల వలన ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. దానితో వారు బుట్టలు, చాపలు అల్లడం వంటి పనులు చేసుకుంటూ బ్రతికేవారు. అయితే వారి మీద పాత ఆరోపణలు, అనుమానాల చేత వారిని ‘భారతదేశ నేరాల తెగ’గా ముద్ర వేశారు. తప్పు చేయకపోయినా ఆ తెగలో పుట్టినందుకు దొంగలని ముద్ర మోసిన వాళ్ళ సంఖ్యే ఎక్కువ.
ఇక్కడే మొదలయింది అసలు విషయం. దశాబ్దాలు గడిచాయి, దొంగతనాలు పెరిగిపోవడం వలన, ఇక భరించలేక 1913 లో మద్రాస్ గవర్నమెంట్ హోమ్ మెంబెర్ అయిన ‘హెరాల్డ్ స్టువర్ట్’ వీరందరినీ మార్చాలని అనుకున్నారు. అందుకోసం సాల్వేషన్ ఆర్మీ సహాయం తీసుకున్నారు. వివిధ నేరాల్లో నిందితలైన వారందరికీ పనులు ఇప్పించి, వారికి నివాసాలు కల్పించడం వలన వారిలో నేరప్రవృత్తి మారే అవకాశం ఉంటుందని నమ్మారు. అందులో భాగంగానే 1913 లో విజయవాడలోని పాత రైల్వే కాలొనీ దగ్గర గల సీతానగరంలో వారికి నివాసాలు కల్పించి, కాలనీలు ఏర్పాటు చేశారు. అదే ఏడాది బేతపూడి అనే ప్రాంతంలో 1500 ఎకరాలతో చిత్తడి నేలతో పాటు, మరో 500 ఎకరాల నివాసయోగ్యమైన భూమిని ఇచ్చి మరికొంతమందికి నివాసాలు కల్పించి, అక్కడ కూడా కాలనీలు ఏర్పాటు చేశారు. అహెడ్ హెరాల్డ్ స్టువర్ట్ పేరు మీదుగా ‘స్టువర్టుపురం’గా మారింది. అక్కడే వారు వ్యవసాయం చేసుకునేవారు. 6000 ఎరుకలు అక్కడికి వచ్చి నివసించడం మొదలుపెట్టారు. చాలామంది గుంటూరు అంతకుముందు నుండే ఉన్న ‘ఇండియన్ లీఫ్ టొబాకో కంపెనీ’లో కూలీలుగా పనిచేసేవారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన చేదు నిజం ఒకటి ఉంది. దొంగలు కాకపోయిన, నేర చరిత్ర లేకపోయినప్పటికీ ఎంతోమంది ఎరుకల ఇక్కద్ధికి బలవంతంగా తరలించబడ్డారు.
కానీ, అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. వర్షాలు, నీళ్లు లేక పంటలు పండలేదు, పరిస్థితులు మారాయి. అంతా మళ్ళీ తిరగబడింది. దొంగతనాలు మళ్ళీ మొదలయ్యాయి. చిన్న చిన్న దొంగతనాలతో మొదలై, పెద్ద దోపిడీలుగా మారాయి. స్టువర్టుపురం దొంగల అడ్డా అని చరిత్ర లిఖించింది. ఆ ప్రాంతం నుండి వచ్చిన వారిని చిన్నచూపు చూసేవారు, హేళన చేసేవారు, దొంగలని ముద్ర వేశారు. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా పోలీసుల మొదటి అడుగు స్టువర్టుపురంలోనే. దొంగలను విచారణ చేసినట్టే అమాయకులను కూడా విచారణ చేసేవారు. ఆ అనుమానాలు, అవమానాలు, ఆక్రందనల నడుమ జ్వలించినవాడే టైగర్ నాగేశ్వరరావు.
ఏ దొంగనీ తమ వాడని ఎవ్వరూ చెప్పుకోరు, కానీ గజదొంగ అని ముద్ర పడినా స్టువర్టుపురం మొత్తం మా వాడే అని చెప్పుకునే వ్యక్తి టైగర్ నాగేశ్వరరావు. జేబుకి తెలియకుండా పర్సు లేపేసిన చిల్లర దొంగల గురించి విని ఉంటారు, తాళాలు వేసిన ఇంటిని కూడా దోచేసిన ఇంటి దొంగల గురించి వినే ఉంటారు. కానీ ఇతను వారందరికీ ఇంద్రుడు, దొంగలని కూడా దోపిడీ చేయగల కిలాడీ, పోలీస్ లను సైతం వణికించిన గజదొంగ, పట్టుబడకుండా పారిపోవడం, పట్టుబడినా తప్పించుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అని అతని సన్నిహితులు చెబుతారు. అతన్ని పోలీసులు పట్టుకోలేకపోయేవారు, పట్టుకున్నా భయపడేవారు, ప్రయోజనం లేదనుకునేవారు, ఆ స్థాయిలో నాగేశ్వరరావు చర్యలు ఉండేవి. చెన్నై, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి ఇలా పలు ప్రాంతాల్లో అతను దొంగతనాలు చేసేవాడు. అయితే పట్టుకొని ఏ జైల్లో పెట్టిన ఇట్టే తప్పించుకునేవాడు.
అతను చేసిన దొంగతనాల్లో సింహాచలం గుడిలో చేసిన దొంగతనం చేసాడని, పోలీసుల పట్టుకునేలోపే ఆ డబ్బునంతటినీ అతను జనాలకి పంచేసాడని అప్ప్పటి వారు చెబుతారు. ఇక 1974 లో కర్నూల్ జిల్లాలోని బనగానేపల్లెలో అతను, అతని సోదరుడు ప్రభాకర్, మరో ఎనిమిది మంది గుంపుతో చేసిన చోరీ ఇప్పటికీ సంచలనమే, అప్పట్లో భారీ దొంగతనం అది. 35 లక్షల రూపాయల దోపిడీ, పైగా బ్యాంక్ లో, అందులోనూ పోలీస్ ఎదురుగా ఉన్న బ్యాంక్. ఆ దొంగతనానికి మూలకారకుడు, దానికి ప్లాన్ వేసిన ప్రభాకర్, ఆ దోపిడీ గురించి మీడియాతో కూడా చెప్పారు. ఎదురు పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా తగ్గలేదు. నాగేశ్వరరావు నాయకత్వంలో వారు బ్యాంక్ వెనుక వైపు, తుప్పల్లో నుండి వెళ్లి మరీ ఒక చిన్న కిటికీ ద్వారా బ్యాంక్ లోకి చొరబడ్డారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో, అరగంట సమయంలోనే, లోపలికి వెళ్లి, లాకర్ కొల్లగొట్టి, 14 కిలోల బంగారం, రూ.50 వేల నగదును మాయం చేసేసారు. ఆ తరువాత అక్కడ నుండి ఒక స్మశానవాటికకి వెళ్లి అందరి వాటాలు పంచుకోబోయారు. అయితే దొంగతనం సమాచారం తెలుసుకున్న పోలీసులు, బ్యాంకు దగ్గర వాళ్ళు కాల్చిన ఒక చిన్న బీడీ ముక్కను ఆధారంగా చేసుకొని, వాళ్ళే అని తెలుసుకొని, వాళ్ళున్న మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టేయడంతో ‘లవణం’ అనే వ్యక్తి ద్వారా సంధి చేసుకొని, పోలీసులకు పట్టుబడ్డారు. అయితే వాళ్ళు 2 నెలల ముందే బ్యాంకు పక్కన ఇల్లు తీసుకొని, అందులో నుండి బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ లోకి సొరంగం తవ్వారని, అలా దొంగతనం చేశారని చెప్తారు. దాని తరువాత ఒక కేసులో నాగేశ్వరరావుని చెన్నై సెంట్రల్ జైలులో వేయగా, అక్కడ నుండి కూడా చాకచక్యంగా తప్పించుకొని పారిపోయాడు. అత్యంత భద్రత, క్లిష్టతరమైన ఆ జైలుకే గరిక నాగేశ్వరరావుగా వెళ్లి, టైగర్ నాగేశ్వరరావుగా బయటికి వచ్చాడు. 1970-80ల మధ్యలో ఆయన పేరు మారుమోగిపోయేది.
ఇక ఎక్కడ పెట్టినా తప్పించుకుంటున్నాడని పోలీసులు విసిగిపోయారు. ఇక లాభం లేదని, 1987 లో చీరాలలోని బోడిపాలెం నాగేశ్వరరావుకి తెలిసిన ఒక అమ్మాయిని అడ్డుపెట్టుకొని స్కెచ్ వేసి, పోలీసులు నాగేశ్వరరావుని ఫేక్ ఎన్కౌంటర్ చేసి చంపేశారని పలు వార్తల్లో చెప్పుకొచ్చారు. అలానే అతని అంతిమసంస్కారానికి వేలల్లో జనాలు వచ్చారని, వారికిని కంట్రోల్ చేయడానికి మూడు రోజులు పట్టిందని కూడా కొందరు చెప్తారు. అయితే అతను చనిపోయాక స్టువర్టుపురంలోని అందరూ వారి ఇళ్ల ముందు అతని ఫోటోను వేలాడదీశారు.
అతనిది ఒకటే పాలసీ, ఉన్నోడిని దోచేయడం, లేనోడికి పెట్టేయడం. అందుకే అతని జనాలందరూ అతన్ని రాబిన్ హుడ్ అంటారు, దేవుడిగా చూసేవారు. ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టాడు, ఎందరో పిల్లలకి నాణ్యమైన చదువుని అందేలా చేసాడు. తను దోచుకున్న దాంట్లో 10% మాత్రం తాను తీసుకొని మిగతాదంతా పేదలకు పనిచేసేవాడట. అతను చేసే దొంగతనాలు కూడా అక్రంగా సంపాదించిన భూస్వాములు, అధికారుల నుండే అని చెబుతుంటారు. అందుకే ఆ చుట్టుపక్కల చీరాల, బాపట్ల లాంటి ప్రాంతాలలోని అతని కాలం నాటి కొంతమంది టైగర్ నాగేశ్వరరావు దొంగే కావచ్చు గానే మంచి దొంగ అని, మంచి మనిషని తరువాత తరాలకు చెప్తుంటారు. అందుకే అతని మీద ఇప్పుడు ఈ సినిమాలు.