తెలుగు సినిమా చరిత్రలో ఆమె లిఖించిన పేజీలు ఎన్నో. సౌమ్య అంటే ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ తెలుగు సినీ ప్రేక్షకుల అభిమాన నటి, దక్షిణ చలనచిత్ర రంగాన్ని దశాబ్దం పాటు ఏలిన హీరోయిన్, ‘సావిత్రి ఆఫ్ మోడరన్ తెలుగు సినిమా’ అని పిలవబడిన తార అంటే అందరికీ తెలుసు. ఇప్పటికీ 90లలో నచ్చిన నటి ఎవరు అంటే, ఎక్కువ మంది నోటి నుండి వినిపించే పేరు ‘సౌందర్య’. ఆ మహానటి సౌందర్య గారి జీవిత, సినీ ప్రస్థానం, ఇతర ఆసక్తికర విషయాల గురించే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం.
సౌందర్య గారు 1972 లో జులై 18న, కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. కానీ, కొన్ని పత్రికల ప్రకారం, ఆమె చివరి ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుంటే ఆమె జూలై 18న, 1976 లో జన్మించారని తెలుస్తుంది. ఆమె తల్లి గారి పేరు మంజుల, తండ్రి గారి పేరు కె.ఎస్.సత్యనారాయణ. ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో రైటర్, ప్రొడ్యూసర్ గా సినిమాలు చేశారు. సౌందర్య గారికి ఒక అన్నయ్య ఉన్నారు, ఆయన పేరు అమరనాథ్.
సౌందర్య గారు చదువు అంతా బెంగళూరులోనే జరిగింది. ఆమె చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలని అనుకునేవారు. అనుకున్నట్టే ఆమె మెడిసిన్ చదవాలని అనుకున్నారు, మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యారు. అయితే ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఆమెకు కన్నడ సినిమాల్లో అవకాశాలు రావడంతో, చదువుతూనే షూటింగ్స్ కి వెళ్తూ ఉండేవారు. కానీ, తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన తరువాత, ఇక నటననే పూర్తి కెరియర్ గా మార్చుకొని, చదవడం ఆపేసారు. కానీ ఆమెకు డాక్టర్ అవ్వాలని ఉండేదని, యాక్టర్ అవుతానని అనుకోలేదని, కానీ డాక్టర్ అవకుండా యాక్టర్ అయినందుకు ఎప్పుడూ బాధపడింది లేదని ఆమె చివర ఇంటర్వ్యూలో చెప్పారు.
సౌందర్య గారికి నటన మీద పెద్ద ఆసక్తి లేకపోయినా, నాన్న గారితో కలిసి షూటింగ్స్, రీ-రికార్డింగ్స్ స్టూడియోస్ కి వెళ్తూ ఉండేవారు. అయితే టెన్త్ అయిన తరువాత, కాలేజీలో జాయిన్ అవడానికి ముందు వేసవి సెలవల్లో ఆమె వారి నాన్న గారితో పాటు ఏదో స్టూడియోకి వెళ్తే, అక్కడ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ గారు ఆమెను చూసి, ఒక రోల్ ఉంది, సౌందర్య నటిస్తే బాగుంటుందని అనడంతో, ఆమె ఆలోచించి సరే అని చెప్పారు. అలా ఆమె మొట్టమొదటిసారిగా ‘గంధర్వ’ అనే కన్నడ సినిమా కన్నడలో నటించారు. దాని తరువాత కొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. దాని తర్వాత ‘మనవరాలి పెళ్లి’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాలతో తెలుగులో అడుగుపెట్టారు. అయితే తెలుగులో వరుసపెట్టి ఆఫర్స్ వస్తుండటంతో, ఎంబీబీఎస్ జాయిన్ అయిన 9 నెలలకి మానేసి, సినిమాల మీద దృష్టి పెట్టారు. అక్కడ నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ ఇండస్ట్రీలలో టాప్ హీరోలకు జంటగా నటించారు. అప్పట్లో ఆమె సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్ లలో ఒకరిగా నిలిచారు. తెలుగులో వెంకటేష్-సౌందర్య గారిది హిట్ పెయిర్, వారిద్దరూ కలిసి 8 సినిమాల్లో కలిసి నటించారు.
12 ఏళ్ళ సినీ ప్రస్థానంలో సౌందర్య గారు అన్ని భాషల్లో కలిపి 100 కి పైగా సినిమాల్లో నటించగా, ఒక్క 1995 లోనే తెలుగులో 12, కన్నడలో రెండు సినిమాలు చేశారు. ఆమె నటించడంతో పాటు 1998 లో ‘గృహబంగా’ అనే కన్నడ సీరియల్ ని కూడా ప్రొడ్యూస్ చేశారు. అదేవిధంగా 2002 లో ‘ద్వీప’ అనే కన్నడ సినిమాని ప్రొడ్యూస్ చేసి అందులో నటించారు. ఆ సినిమాకి ఆ ఏడాది ఇండియాలోనే బెస్ట్ ఫీచర్ ఫిలింగా నేషనల్ అవార్డు దక్కింది, అలానే కన్నడలో ఆ సినిమా బెస్ట్ మూవీగా ఫిలింఫేర్ లభించింది, అంతేకాకుండా బెస్ట్ ఫిలింగా కన్నడ స్టేట్ అవార్డు కూడా వచ్చింది.
ఇక నటనకు గాను, సౌందర్య గారికి ‘అమ్మోరు’ సినిమాకి 1995 లో మొట్టమొదటి ఫిలింఫేర్ అవార్డు రాగా, 1998 లో ‘అంతఃపురం’, 1999 లో ‘రాజా’, 2002 లో ‘ద్వీప’ అనే కన్నడ సినిమాకి, 2004 లో ఆమె చనిపోయిన తరువాత ‘ఆప్తమిత్ర’ అనే కన్నడ సినిమాకి, ఇలా 5 ఫిలింఫేర్ అవార్డులు ఆమె నటనకు లభించాయి. ఇక తెలుగులోనే 1996 లో ‘పవిత్రబంధం’, 1998 లో ‘అంతఃపురం’ సినిమాలకి నంది అవార్డులు గెలుచుకున్నారు. అలానే కన్నడలో 1998 లో ‘ధోని సాగలి’ అనే సినిమాకు కన్నడ స్టేట్ అవార్డు లభించింది.
సౌందర్య గారు నటనతోనే కాకుండా, ఆమె మనసు, అముఞ్చి పనులతో కూడా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె బెంగళూరులో ఆమె నాన్న గారి జ్ఞాపకార్థంగా అనాథ పిల్లల చదువు కోసం 3 స్కూల్స్ పెట్టారు. అయితే సౌందర్య గారు చనిపోయిన తరువాత, వారి అమ్మ మంజుల గారు, వారి పిల్లల జ్ఞాపకార్థంగా ‘అమర్ సౌందర్య విద్యాలయాస్’ పేరుతో ఎన్నో స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, అనాథశరణాలయాలు స్టార్ట్ చేసారు.
సౌందర్య గారు 2004, ఏప్రిల్ 17న హెలికాప్టర్ ప్రమాదంలో స్వర్గస్థులయ్యారు. సౌందర్య గారు చనిపోయే ముందు రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరగా, ఎన్నికల సమయంలో కరీంనగర్ లో వారి తరఫున ప్రచారం చేయడానికి బెంగళూరు దగ్గర జక్కూరు ఎయిర్ ఫీల్డ్ నుండి ఆమె, తన సోదరుడు అమరనాథ్, బీజేపీ నాయకుడు రమేష్ కదంతో ఆ హెలికాప్టర్ లో ఉదయం 11 గంటల సమయంలో బయలుదేరారు. అయితే కొంచెంసేపటికే ఆ హెలికాప్టర్, గాంధీ క్రిషి విజ్ఞాన్ కేంద్ర ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ప్రాంతంలో క్రాష్ అయ్యింది. ఆ ప్రమాదంలో సౌందర్య గారితో పాటు హెలికాప్టర్ ఉన్న మిగతా ముగ్గురూ కూడా చనిపోయారు.
ఇప్పటికీ ఎంతోమంది కొన్ని సినిమాలు చూస్తూ, ఇప్పుడు సౌందర్య గారు ఉంటె బాగుండేది, ఆ రోల్ కి ఆమె అయితే సరిపోయేవారు అని అంటూ ఉంటారంటే, అందం, అభినయంతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో వేసిన ముద్ర అలాంటిది. సౌందర్య గారు భౌతికంగా మనల్ని వదిలి వెళ్లినా, కోట్ల మంది అభిమానుల గుండెల్లో ఎప్పటికీ సజీవమే, ఆమె సినిమాలు, పాత్రల ద్వారా ఆమె ఎన్నటికీ అమరురాలే.