తెలుగు చలన చిత్ర రంగంలో ఎస్వీఆర్, కైకాల సత్యనారాయణ వంటి వారి తరువాత అంతటి విలక్షణ నటనా శీలత కలిగిన నటుడు ఎవరూ అంటే చాలామందికి గుర్తొచ్చే పేరు ‘కోట శ్రీనివాసరావు’. రంగులు దిద్దుకొని సినిమా సాంకేతికంగా ఎదుగుతున్న తరుణంలో తెలుగు తెరపై విలక్షణ పాత్రలకు పెట్టింది పేరని కీర్తించబడ్డ నటుడు కోటా శ్రీనివాసరావు. ఆ గొప్ప నటుడి సినీ జీవితం ఎలా సాగింది, ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు ఏంటన్నవి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం.
కోట శ్రీనివాసరావు గారు 1945, జూలై 10న ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిలాల్లోని కంకిపాడు అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి గారి పేరు సీతారామాంజనేయులు, ఆయన ఒక డాక్టర్. కోటా శ్రీనివాసరావు గారికి నరసింహరావు గారు అనే అన్నయ్య, శంకరరరావు అనే ఒక తమ్ముడు ఉన్నారు. అలానే ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. అన్నయ్య నరసింహారావుని చూసే శ్రీనివాసరావు గారికి నటన మీద స్వతహాగా ఉన్న ఆసక్తి మరింత పెరిగి, ముందు నాటకాలల వైపు, తరువాత సినిమాల వైపు నడిచేలా చేసింది. ఇక తమ్ముడు కోటా శంకరరావు కూడా నటుడు కాగా, సినిమాల్లోనూ, తెలుగు సీరియల్స్ లోనూ నటించారు.
కోటా గారు ముందు డాక్టర్ అవుదాం అనుకున్నారు, కానీ తరువాత నటన మీద మక్కువ ఎక్కువ అవడం వలన యాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన విద్యాభ్యాసం కంకిపాడు, విజయవాడలో జరిగింది. ఆయన బీఎస్సీ పూర్తి చేసారు. కాలేజీ చదివే రోజుల్లో స్టేజ్ నాటకాల్లో నటించేవారు. అయితే ఆయన సినిమాల్లోకి రావడానికి ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ గా పనిచేసేవారు.
ఆయన దాంపత్య జీవితానికొస్తే, ఆయన భార్య పేరు రుక్మిణి. వీరికి ముగ్గురు పిల్లలు. పల్లవి, పావని అనే ఇద్దరు కూతుళ్లు ఉండగా, కొడుకు ఆంజనేయ ప్రసాద్. అయితే అంజనేయ ప్రసాద్ గారు 2010 లో హైదరాబాద్ లో కార్ యాక్సిడెంట్ లో మరణించారు. ఆయన చనిపోయేముందు సిద్ధం, గాయం-2 సినిమాల్లో నటించారు.
ఇక కోటా శ్రీనివాసరావు గారి నట ప్రస్థానానికొస్తే, ఆయన సినిమాలలోకి రాక ముందు నటన మీద మమకారంతో స్టేజ్ డ్రామాలు వేసేవారు, ఆ క్రమంలోనే ఆయనకు 1978 లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో మొదటిసారి వెండి తెర మీద కనిపించే అవకాశం వచ్చింది. విశేషమేంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఇదే మొదటి సినిమా. అయితే 1979 లో ‘మా ఊరి దేవత’ సినిమా తరువాత కోటా గారు 4 ఏళ్ళ పాటు గ్యాప్ ఇచ్చి, ఒక పక్క నాటకాలు వేసుకుంటూనే మరో పక్క బ్యాంక్లో జాబ్ చేసేవాళ్ళు. అయితే 1983 లో ‘మూడు ముళ్ళు’ సినిమాతో మళ్ళీ వచ్చి మూడేళ్ళ పాటు ఏడాదికో సినిమాలో నటించారు. కానీ, 1986 లో ‘ప్రతిఘటన’ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక 1987 లో వచ్చిన ‘అహ నా పెళ్ళంట’ సినిమా ఆయన సినీ చక్రాన్ని తిప్పేసింది. పినాసి లక్ష్మీపతిగా ఆయన నటన అందరినీ అలరించింది, మొత్తం తెలుగు వారందిరికీ కోటా గారు పూర్తి సుపరిచిత నటుడిని చేసేసింది ఆ పాత్ర. అయితే ఎన్టీఆర్ వివాదం చేతనో, మరే కారణం వలనో ఆ సినిమా నిర్మాత రామానాయుడు గారు మొదట ఆ పాత్రకి కోటా గారిని వద్దని, రావుగోపాల్ రావు గారిని పెట్టుకుందామని అన్నారు. కానీ, ఆ సినిమా దర్శకుడు జంధ్యాల గారు మాత్రం కోటా గారైతేనే సరిగ్గా సరిపోతారని పట్టుబట్టి, ఒప్పించి కోటా గారితో చేసారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ కోటా శ్రీనివాసరావు పినాసి లక్ష్మీపతిగా జీవించేశారు. ఇక ఆ సినిమా తరువాత అటు కామెడీ పాత్రలు, ఇటు విలన్ పాత్రల్లో వైవిధ్యాన్ని కనబరుస్తూ తెలుగు అభిమాన నటుడిగా, విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ‘ఆమె’ సినిమాలో పాత్ర నీచత్వానికి మారు పేరు అనిపించుకున్నా, ‘గణేష్’ సినిమాలో అవినీతి భూతం అన్నా, అవన్నీ ఆయన నటనకు దక్కిన ప్రసంశలే. అలానే జంబలకిడిపంబ లాంటి కామెడీతో కవ్వించారు, ‘బొమ్మరిల్లు’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి సినిమాల్లో తండ్రి పాత్రల్లో మెప్పించారు. సినిమాల్లో పై హీరోహీరోయిన్, డైరక్టర్-హీరో కాంబినేషన్స్ మీద హైప్ ఉండడం సహజం, కానీ తెలుగు తెర పై కోటా శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. వారిద్దరూ ఏకంగా 60 కి పైగా సినిమాలలో కలిసి నటించారు. వాటిలో దాదాపు సినిమాలన్నీ హిట్ గానే నిలిచాయి. అయితే, వారిద్దరీ కాంబినేషన్ కోసం ప్రత్యేకంగా పాత్రలు రాసేవారంటే వారి జోడీ అప్పట్లో ఎంత హైలెట్ అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి, ఇవివి సత్యనారాయణ గార్ల సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. వారిద్దరూ బయట కూడా చాలా మంచి స్నేహితులుగా ఉన్నారు. అదేవిధంగా కామెడీలో బ్రహ్మానందం, అలీ వంటి వారితో, విలనిజంలో రావుగోపాల్, మారుతీరావు వంటి వారితో సీన్స్ పండించేవారు. ఆ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ, తెలుగుతో సహా తమిళ్ లో 34, హిందీలో 10, కన్నడలో 3, మలయాళంలో 1, డెక్కనిలో 1, మొత్తంగా 750 కి పైగా సినిమాల్లో నటించారు. అలానే అత్యధికంగా 1994 లో 16 సినిమాలలో, 2001 లో 19 సినిమాల్లోనూ నటించారు. అంతేకాకుండా 2012 లో రిలీజ్ అయిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘మందుబాబులం’ అనే పాత కూడా పాడారు. అలానే తమిళ్ నుండి తెలుగులోకి డబ్ అయిన సినిమాల్లో గౌండమణి, మణివణ్ణన్ అనే నటులకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు, అదేవిధంగా కొల్లం తులసి అనే నటుడికి తమిళ్ లో డబ్బింగ్ చెప్పారు. 78 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఆయన సినిమాల్లో నటిస్తూ ఉండడం, ఆయనకి సినిమా మీద, నటన మీద ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది.
ఆయనకు ఇండియన్ సినిమాకు నటుడిగా అందించిన సేవలను గుర్తించి భారత కేంద్ర ప్రభుత్వం 2015 లో ‘పద్మశ్రీ’ ఇచ్చి గౌరవించింది. అలానే ఆయనకు అల్లురామలింగయ్య పురస్కారం కూడా లభించింది. అదేవిధంగా 1985 లో ప్రతిఘటన, 1993 లో గాయం, 1994 లో తీర్పు, 1996 లో లిటిల్ సోల్జర్స్, 1998 లో గణేష్, 2000 లో చిన్న, 2002 లో పృథ్వీనారాయణ, 2004 లో ఆ నలుగురు, 2006 లో పెళ్ళైన కొత్తలో సినిమాలకు గాను వివిధ పాత్రలకు 9 నంది అవార్డులు లభించాయి. అంతేకాకుండా 2012 లో కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాకి గాను సైమా అవార్డు లభించింది.
కోటా గారి జీవితంలో ఏర్పడ్డ అతి పెద్ద వివాదం, ‘మండలాదీశుడు’ అనే సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారి పేరడీ పాత్ర భీమారావు పాత్ర పోషించడం. ఆ సినిమా ఎన్టీఆర్ గారు సీఎం అయిన తరువాత 1987 లో తీశారు. అది హీరో కృష్ణ గారు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ, ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఈ సినిమా తీశారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో పెద్ద నటులు ఎవరూ ముందు రాకపోవడం, కోటా శ్రీనివాసరావు గారు ముందుకి రావడంతో, ఆయన్ను విజయవాడ రైల్వే స్టేషన్ కి ఎవరినో ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళినప్పుడు, అక్కడి తెలుగు దేశమా కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ను వెంటపడి కొట్టారు. అలానే 90 లలో ఒక షూటింగ్ సమయంలో బాలకృష్ణ ఆయన ముఖం పై ఉమ్మి వేశారు. కానీ కోటా గారు బాలకృష్ణ గారిని సపోర్ట్ చేస్తూ, అంత పెద్ద నటుడి కొడుకు, తన తండ్రిని హేళన చేస్తూ సినిమా తీస్తే ఊరుకుంటాడా, తప్పేం లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ వివాదం సమయంలో ఒక ఈవెంట్ లో కోటా గారు, ఎన్టీఆర్ గారిని కలిశారు. అయితే ఎన్టీఆర్ గారు కోటా గారిని బాగా నటిస్తున్నావ్ అని మెచ్చుకోవడం, తరువాత ఆశీర్వదించడంతో అప్పటి నుండి ఇంకెవరూ కోటా గారిని ఏమీ అనలేదు.
అలానే దర్శకుడు కృష్ణవంశీ గారితో కొన్ని సృజనాత్మక విబేధాలు కూడా ఉండేవి. తెలుగులో మంచి నటులు లేరు అని కృష్ణవంశీ గారు ఏదో అన్నారని, దానితో వారిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. అయితే కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించిన సినిమాల్లో 2006 లో వచ్చిన ఒక్క ‘రాఖీ’ సినిమాలో మాత్రమే కోటా శ్రీనివాసరావు గారు నటించారు.
ఇక ఇటీవల కాలంలో తెలుగు నటులకు అవకాశం ఇవ్వండి, ప్రోత్సహించండి అని పలు సందర్భాల్లో ఆయన అంటూ వచ్చారు. కొందరు ఆయనతో ఏకీభవించగా, ఇంకొంతమంది ఆయనను తప్పుబట్టారు.
కోటా శ్రీనివాసరావు గారు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన, 1999 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పశ్చిమ విజయవాడ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. ఆ విధంగా 1999 నుండి 2004 వరకు ఆయన పశ్చిమ విజయవాడ ఎమ్మెల్యేగా సేవలందించారు.
ఆ విధంగా తన సినిమాలలోని విలక్షణ పాత్రలతో సినీ అభిమానులను అలరించి, ఇప్పటికీ తెర మీద ఆయన ఉనికిని చాటుతున్న కోటా శ్రీనివాసరావు గారు, మరింతకాలం ఆరోగ్యంగా ఉంటూ, మరిన్ని పాత్రలతో మనందరికీ వినోదం పంచాలని కోరుకుందాం.