భానుమతి రియల్ లైఫ్ స్టోరీ | Actress Bhanumathi Biography

116
0
భానుమతి రియల్ లైఫ్ స్టోరీ | Actress Bhanumathi Biography | Actress Bhanumathi Life Story
భానుమతి రియల్ లైఫ్ స్టోరీ | Actress Bhanumathi Biography | Actress Bhanumathi Life Story

ఆమె నటి, రచయిత్రి, దర్శకురాలు, నిర్మాత, గాయని, సంగీత దర్శకురాలు, స్టూడియో ఓనర్. ఆమెను నటనకు వ్యాకరణ అని అంటారు. తెలుగు సినిమా తెర మీద మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్… భానుమతి రామకృష్ణ. ఎందరో సినీ తారలకు సైతం ఆదర్శంగా నిలిచిన ఆమె సినీ ప్రస్థానం తెలుసుకోదగ్గది. ఆమె జీవితపు ఆసక్తికర విషయాలు, సినీ జీవితంలోని విజయాలు, ఇతర విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం.

భానుమతి గారు 1925, సెప్టెంబర్ 7వ తేదీన బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, సరస్వతమ్మ దంపతులకు ప్రకాశం జిల్లాలోని దొడ్డవరం అనే గ్రామంలో జన్మించారు. వెంకట సుబ్బయ్య గారికి శాస్త్రీయ సంగీతం మీద మక్కువ ఎక్కువ, ఆలయం స్టేజి ప్రదర్శనలు చూస్తూనే భానుమతి గారు పెరిగారు. ఆయన కూతురుకి చిన్న వయసులోనే సంగీతం నేర్పించారు. ఆ విధంగా భానుమతి గారికి కర్నాటిక్, హిందుస్తానీ సంగీతం మీద మంచి పట్టు లభించింది.

ఆమె వివాహ జీవితానికి వస్తే, ఆమె సినిమాల్లో నటించే సమయంలో పీఎస్ రామకృష్ణ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ని కలిశారు. ఆమె ఆయన్ను ప్రేమించి ప్రపోజ్ చేయగా, అప్పుడు అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్న రామకృష్ణ గారు ముందు ఒప్పుకోకపోయినా, తరువాత ఒప్పుకున్నారు. అయితే భానుమతి గారి తండ్రి గారు, అమ్మాయి స్థాయి కన్నా తక్కువ వాడితో పెళ్లి ఏంటని ఒప్పుకోకపోవడంతో, వాళ్ళు పారిపోయి పెళ్లిచేసుకున్నారు, 1943, ఆగష్టు 8న వారు దంపతులయ్యారు. అయితే ఆమె పెళ్లి తరువాత సినిమాలు ఆపేద్దాం అనుకున్నారు, కానీ ప్రముఖ దర్శకుడు బీఎన్ రెడ్డి గారు ఆమెను త్రిగి సినిమాల్లో నటించమని అడగగా, ఆమె ఒప్పుకొని నటించారు. రామకృష్ణ గారు దర్శకుడు, నిర్మాత, ఎడిటర్. ఆయన ఎన్నో సినిమాలు తీశారు, భానుమతి గారు హీరోయిన్ గా ఉన్న సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. ఈ దంపతులకు భరణి అనే ఒక కొడుకు ఉన్నారు. ఆ కొడుకు పేరు మీదే ‘భరణి పిక్చర్స్’ అనే ఒక ప్రొడక్షన్ బ్యానర్ ని స్థాపించారు.

ఇక భానుమతి గారి సినీ ప్రస్థానం గురించి చెప్పాలంటే, ఆమెను కేవలం నటి అని మాత్రమే అనలేము, సకల కళా కోవిదురాలు అనేది ఆమెకు సరైన పేరు. అందుకే ఆమెను ‘అష్టవధాని’ అనే పిలిచేవారు. ఎందుకంటే, ఆమె నటి, రచయిత్రి, గాయని, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, నిర్మాత, స్టూడియో ఓనర్, ఎడిటర్. సినిమా నుండి బయటకి వస్తే, జ్యోతిష్యం, వేదాంతం మీద కూడా ఆమెకు మంచి పట్టు ఉంది. ఆమెకు చిన్నప్పటి నుండి కళల మీద ఇష్టం, వాటిలో ప్రతిభ ఉండటంతో చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టారు. 1939 లో ఆమె 14 ఏళ్ళ వయసులోనే ‘వర విక్రయం’ అనే తెలుగు సినిమాలో మొట్టమొదటిగా నటించారు. అదే ఏడాదిలో ‘శాంతన్ దేవన్’ అనే తమిళ్ సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాలోనే ఆమె మొట్టమొదటి సారి గాయనిగా రెండు పాటలు కూడా పాడారు. ఇక 1941 లో మొదటిసారి రెండు భాషలు తెలుగు, తమిళ్ లో ధర్మపత్ని అనే సినిమా చేశారు, అలానే ఆ సినిమా ద్వారా తెలుగులో మొదటిసారి గాయనిగా మారారు. ఆమె ఒక పక్క నటిగా కొనసాగుతూనే, మరోపక్క గాయిగా పాటలు కూడా పడుతూ ఉండేవారు.

1943 లో రిలీజ్ అయిన ‘కృష్ణలీల’ ఆమె సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు రాగా, 1945 లో వచ్చిన ‘స్వర్గసీమ’ సినిమాతో ఆమెకు మంచి పాపులారిటీ లభించింది. ఆ సినిమాలో ఆమె ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్ర పోషించారు. ఆ సినిమాతో ఆమెకి వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి. అందులో ఆమె పాడిన ‘ఓహో ఓహో పావురమా’ పాత సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి స్టార్ హీరో శివాజీ గణేశన్ ఒక ఇంటర్వ్యూలో, ఆ ఒక్క పాట కోసమే సినిమాను 30 సార్లుకు పైగా చూశానని చెప్పుకొచ్చారు. ఆ సినిమా తరువాత ఆమె పారితోషకం రూ.25000, అంటే ఒక సినిమా బడ్జెట్ లో సగం, ఆలా ఓవర్ నైట్ స్టార్ అయిపోయారని చెప్పవచ్చు. 1949 లో ‘అపూర్వ సహోదరులు’ అనే సినిమాతో తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లోనూ హీరోయిన్ గా నటించారు, పైగా అదే ఆమె మొదటి హిందీ సినిమా. తెలుగు, తమిళ్ లోనే కాకుండా హిందీ భాషలో కూడా ఆమె నటిగా మంచి పేరు సంపాదించారు. ఆమె విభిన్న రకాలైన పాత్రలు పోషించి ఎంతోమంది అభిమానులను సంపాదించారు. ఆ విధంగా ఆమె కథానాయకిగా, ప్రతినాయకిగా, సహాయ నటిగా ఇలా ఎలాంటి పాత్రలైనా అవలీలగా చేసే నటిగా పేరొందారు. 1964 లో వచ్చిన అంతస్తులు అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి చెల్లిగా నటించే పాత్ర వస్తే, ఆమె హీరోయిన్ గా పీక్ స్టేజిలో ఉన్నా కూడా కథ నచ్చటంతో ఆ సినిమా చేసారు. లైలా మజ్ను, చక్రపాణి, విప్రనారాయణ, మల్లీశ్వరి, అంతస్తులు, బాటసారి, చండీరాణి, తాతమ్మకల, మోడరన్ సినిమాలు మంగమ్మ వారి మనవడు, బామ్మ మాట బంగారు బాట లాంటి ఎన్నో సినిమాలు ఆమె నటనలోని వైవిధ్యతను చాటాయి.

ఒకపక్క గడుసైన ఆడపిల్ల పాత్రలు, మరోపక్క మృదువైన ప్రియురాలి పాత్రలు, ఇంకోపక్క భిన్నమైన పాత్రలు పోషించి సినిమా అభిమానులను ఆకట్టుకున్నారు. ‘రంగూన్ రాధ’ అనే సినిమాలో ఆమె నటనకు ముగ్ధుడైన అప్పటి మద్రాస్ స్టేట్ చివరి సీఎం, తమిళనాడు మొదటి సీఎం ‘సీఎన్ అన్నాదురై’ గారు ఆమెను ‘నటన యొక్క వ్యాకరణ’ అదే ‘గ్రామర్ ఆఫ్ యాక్టింగ్’ అని అభివర్ణించారు. అంతేకాదు, మన మొదటి ఉపరాష్ట్రపతి, విద్యకోవిదుడు అయినటువంటి ‘సర్వేపల్లి రాధాకృష్ణ’ గారు ఆమెకు వీరాభిమాని. ఆమె నటనకు సినీ తారలు సైతం అభిమానులు. ఎంతో ఖ్యాతిని సంపాదించిన అప్పటి టాప్ హీరోయిన్లు సావిత్రి గారు, జమున గారి లాంటివారు, వారు సినిమాల్లోకి రావడానికి భానుమతి గారు ఒక ఆదర్శం అని చెప్పడం అంటే ఆమె స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆమె తెలుగు తెర మీద మొదటి లేడీ సూపర్ స్టార్ అయ్యారు. అలానే కొత్తవారిని కూడా ఆమె బాగా ప్రోత్సహించేవారు. 1955 లో వచ్చిన ‘మిస్సమ్మ’ సినిమాలో ఆమె మొదట సావిత్రి గారి పాత్రలో కొన్ని సీన్స్ చేసి, చక్రపాణి గారితో గొడవ కారణంగా ఆ సినిమా నుండి తప్పుకున్నారు. ఐతే సినిమా చూసిన తరువాత మంచి పాత్ర మిస్ చేసుకున్నందుకు బాధపడినా, ‘పోనీలే, సావిత్రి లాంటి మంచి నటి ఇండస్ట్రీకి దొరికింది’ అని అన్నారంటే ఆమె ఆలోచనా దృక్పథం ఎంత గొప్పదో తెలుస్తుంది.

భానుమతి గారు ఎంతో నిరాడంబరంగా ఉంటారు. అందుకు ఉదాహరణగా ఒక విషయం చెప్పాలి. ‘అంతస్తులు’ సినిమా షూటింగ్ సమయంలో సినీ బృందం అంతటికీ హైదరాబాద్ లోని ‘రిట్జ్ కార్ల్టన్’లో రూమ్ బుక్ చేస్తే, డబ్బులు వృథా కాకూడదు అని సారథి స్టూడియోలో ఉంటా అని ఉన్నారు. అయితే అక్కడ ఎక్కువ చదును ప్రదేశం, పాములు కూడా తిరుగుతూ ఉండేవట. అయితే ఉదయం లేచేసరికి ఆమె గోరులను ఎలుకలు కొట్టేశాయి. దానితో ఆ సినిమా నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్, ఆ రోజు షూటింగ్ ని ఆపేద్దామని చెప్పి, ఆమెను చూడటానికి వెళ్తే, ఆమె గోరులకు ఏదో రాసుకుంటూ షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. అప్పుడు ఆమె, “ఇలాంటి చిన్న చిన్న విషయాలకు షూటింగ్ ఆపేస్తే, నేను భానుమతిని ఎలా అవుతాను” అని అన్నారట, దీనితో ఆమెఆడంబరాలకు ఎంత దూరంగా ఉంటారో, పని పట్ల ఎంత నిబద్ధతతో ఉంటారో అర్థమవుతుంది.

ఇక భానుమతి గారు తెలుగు, తమిళ్ భాషల్లో అప్పట్లోని ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, ఎంజీఆర్ వంటి అగ్రకథానాయకులు అందరితోనూ నటించారు. ఆమె ఎన్టీఆర్ గారితో ఎక్కువ సినిమాల్లో కలిసి నటించారు.అంతేకాకుండా ఆమె, ఎన్టీఆర్ గారు హీరోగా కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. దర్శకురాలిగా ఆమె మొదటి సినిమా ‘చండీరాణి’లో హీరో కూడా ఎన్టీఆర్ గారే. అంతకన్నా గొప్ప విషయం, ఆమె ఆ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లోనూ ఏకకాలంలో తీశారు. పైగా హిందీలో అప్పటి సూపర్ స్టార్ దిలీప్ కుమార్ ని హీరోగా కూడా డైరెక్ట్ చేశారు. ఒక లేడీ డైరెక్టర్ మూడు భాషల్లో ఏకకాలంలో సినిమా తీసి, 1953, ఆగష్టు 28న తేదీనే ఒకేసారి రిలీజ్ చేయడం 2013 వరకు భారతీయ సినీ చరిత్రలోనే మొదటిసారి. అందులోనూ అది దర్శకురాలిగా ఆమె యొక్క మొదటి సినిమా.

ఆమె నటనా జీవితంతో పాటే మిగిలిన క్రాఫ్ట్స్ లో కూడా ఆమె పట్టు సంపాదించారు. సంగీతంలో పూర్తి ప్రావీణ్యం ఉన్న ఆమె కెరీర్ మొదటి నుండే పాటలు పాడటం మొదలుపెట్టారు. ఘంటసాల, వాణీ జయరాం గారి లాంటి పెద్ద పెద్ద సింగర్స్ తో కలిసి ఆమె పాటలు పాడేవారు. అంతేకాకుండా 1954 లో ‘చక్రపాణి’ అనే సినిమాతో సంగీత దర్శకురాలిగా కూడా మారారు. ఇక తమ సొంత బ్యానర్ ‘భరణి పిక్చర్స్’ మీద కూడా చాలా సినిమాలు చేశారు. ఆ విధంగా భానుమతి గారు, అన్ని భాషల్లో కలిపి 100 సినిమాల వరకు నటించారు, ఆమె చివరి చిత్రం ‘పెళ్లి కానుక.’ ఇక గాయనిగా ఒక్క తెలుగులోనే 41 పాటలు పాడారు, తమిళ్ లో కూడా అదే స్థాయిలో పాడటం జరిగింది. అలానే సంగీత దర్శకురాలిగా 4 సినిమాలు చేశారు. నిర్మాతగా 18 సినిమాలు నిర్మించారు, దర్శకురాలిగా 15 సినిమాలకు దర్శకత్వం వహించారు.

ఆమె జీవితంలో పెద్ద వివాదాలేమీ లేవు గానీ, ఆమె కొంత పొగరుగా ఉండేవారని అంటారు. అయితే మగవాళ్ల ఆధిక్యత ఉన్న ఇండస్ట్రీలో ధైర్యంగా నిలదొక్కుకోవడానికే అలా ఉన్నానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ప్రముఖ నిర్మాత ఆలూరి చక్రపాణి గారితో ఆమెకు ఏదో గొడవ అయ్యింది. దానితో ఆమె ‘మిస్సమ్మ’ సినిమా కూడా వదులుకున్నారు. ఆయన మీద వ్యంగ్యంగా ‘చక్రపాణి’ అనే సినిమా కూడా నిర్మించారు. దానికి ఆమె స్వయంగా సంగీతం కూడా ఇవ్వడం జరిగింది. అయితే తరువాతి కాలంలో వారి మధ్య గొడవ సమసిపోయి మళ్ళీ స్నేహితులుగా ఉన్నారు. ఒకసారి ఒక విలేఖరి, టాప్ స్టార్స్ తో నటిస్తున్నారని అనగా, వాళ్ళే నాతో నటిస్తున్నారు, అది వాళ్ళని అడుగు అని ధీటుగా జవాబిచ్చారు. ఇంకోసారి, మరో విలేఖరి, మీ తరువాత వచ్చే హీరోయిన్లలో మీ స్థానానికి రాగాల నటి ఎవరు అని అడగ్గా, భానుమతిలా మరెవరూ ఉండరు, రారు అని అదిరిపోయేలా చెప్పారు.

భానుమతి గారు కెరీర్ లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు, అలానే ఎన్నో ప్రఖ్యాతలు కూడా ఉన్నాయి. సినిమాలే కాకుండా భానుమతి గారి రచయిత్రిగా ఎన్నో చిన్న హాస్య కథలు కూడా రాశారు. ‘అత్తగారి కథలు’ అనే చిరు కథలకు ఆమెకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుండి ‘బెస్ట్ షార్ట్ స్టోరీ రైటర్’ అవార్డు కూడా లభించింది. అలానే తెలుగులో ‘నాలో నేను’ అనే ఆటోబయోగ్రఫీ కూడా రాశారు, అది తరువాత ఇంగ్లీష్ లో ‘మ్యుసింగ్స్’ పేరుతో వెలువడింది. దానికి ఆమెకు 1994 లో ఉత్తమ పుస్తక రచయిత్రిగా ప్రభుత్వ నేషనల్ అవార్డు దక్కింది. లలిత కళా అకాడమీలో 5 ఏళ్ళు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 10 ఏళ్ల పాటు మెంబర్ గా ఉన్నారు. ఆమె తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలకు డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ గా కూడా వ్యవహరించారు. భానుమతి గారు స్టేట్ ఫిలిం అవార్డ్స్ కమిటీకి 2 ఏళ్ళు మెంబెర్ గా వ్యవహరించారు. అదేవిధంగా, 1965 నుండి 1970 వరకు చిల్డ్రన్ ఫిలిం సొసైటీకి మెంబర్ గా ఉన్నారు. అలానే, ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ కి ఒక ఏడాది పాటు విజిటింగ్ ప్రొఫెసర్ గా వ్యవహరించారు. 30వ ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ ఈవెంట్ లో ‘విమెన్ ఇన్ సినిమా’లో భాగంగా భానుమతి గారిని కూడా సత్కరించారు. అలానే ప్రపంచ మహిళా దినోత్సవం నాడు సాక్షి సండే మ్యాగజైన్ లో అన్ని ఇండస్ట్రీల నుండి ఎంతో ప్రఖ్యాతిగాంచిన మహిళల్లో భానుమతి గారు ఒకరు.

భానుమతి గారు దక్షిణ భారతదేశంలో పద్మ పురస్కారానికి ఎంపికైన మొట్టమొదటి నటీమణి. భారత ప్రభుత్వ సినీ ఇండస్ట్రీలో ఆమె అందించిన సేవలకు గాను, ఆమెను 1966 లోనే పద్మశ్రీతో, 2001 లో పద్మభూషణ్ తోనూ గౌరవించింది. తనకంటూ సొంత ఫిలిం స్టూడియో ఉన్న భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళగా ఆమె పేరుగాంచారు. నేషనల్ అవార్డ్స్ మొదలు కాకముందు చివరి రాష్ట్రపతి అవార్డు తీసుకున్న నటి కూడా భానుమతి గారే. ఆమెకు 1962 లో ‘అన్నై’, 1965 లో ‘అంతస్తులు’, 1966 లో ‘పల్నాటి యుద్ధం’ సినిమాలకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. 2013 లో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆమె పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు. ఆమెను 1987 లో సౌత్ ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్మెంట్ అవార్డుతో సన్మానించారు. 1985 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుండి అతిపెద్ద తెలుగు సినిమా అవార్డు అయిన ‘రఘుపతి వెంకయ్య’ అందుకున్నారు. 2000 లో ఆంధ్ర ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం 1992 లో ప్రతిష్టాత్మక సినీ అవార్డు అయిన ‘అరిగ్నార్ అన్న అవార్డు’తో, అలానే, 1983 లో ‘కలైమామణి’ పురస్కారంతో ఆమెను సత్కరించారు. 1975 లో ఆంధ్ర యూనివర్సిటీ ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో గౌరవించగా, 1984 లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సన్మానించారు. చెన్నైలోని శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ నుండి రాజా లక్ష్మి అవార్డు అందుకున్నార. ఇక 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రభుత్వం చేత సన్మానింపబడ్డ ప్రముఖులలో భానుమతి గారు కూడా ఒకరు.

భానుమతి గారు సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఎందరినో ఆదరించేవారు. ఎన్నో సేవాసంస్థలతో కలిసి చురుకుగా పనిచేసేవారు. అలానే ‘అల్టరుస ఇంటర్నేషనల్ ఇన్ కార్పొరేషన్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించిన మెంబర్స్ లో భానుమతి గారు కూడా ఒకరు మరియు కోశాధికారి, అలా 1963 నుండి చనిపోయే వరకు ఆ సంస్థలో ఉన్నారు. అలానే రెడ్ క్రాస్ సొసైటీలో ఆమె జీవితకాల సభ్యురాలు. అదేవిధంగా, చెన్నైలో పెద్ద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడానికి ‘డా.భానుమతి రామకృష్ణ మెట్రిక్యూలేషన్ స్కూల్’ అనే విద్యాసంస్థను కూడా స్థాపించారు. ఆ విధంగా ఎంతో ఖ్యాతి గడించిన భానుమతి గారు, 2005, డిసెంబర్ 24న స్వర్గస్థులయ్యారు. 

ఈ రకంగా భానుమతి గారు అన్ని విషయాల్లోనూ శ్రేష్టురాలిగా చరిత్రలో నిలిచిపోయారు. తెలుగు సినీ తెర మీద ఆమె అందుకున్న స్థాయిని అందుకోవడం ఎవరి వలనా కాదని ఎంతోమంది విశ్వసించే విషయం. ఒకటి మాత్రం నిజం, భానుమతి గారు ఒక్కరే, ఆమె అన్నట్టు ఆమె స్థానాన్ని భర్తీ చేసేవారు లేరు, రారు. సెలవు.

Leave your vote

More

Previous articleకోట శ్రీనివాసరావు బయోగ్రఫీ | Kota Srinivasa Rao Biography in Telugu
Next articleMP రామ్మోహన్ నాయుడు బయోగ్రఫీ | MP Rammohan Naidu Biography

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here