తెలంగాణ చరిత్రలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకొని, భువనగిరి ప్రజల మనస్సులో ఆశాజ్యోతై వెలిగి, టీడీపీలో ఎన్టీఆర్, చంద్రబాబు తరువాత అంతటి స్థానాన్ని సంపాదించిన నేత, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ధైర్యవంతుడైన హోంమంత్రిగా పేరొందిన వ్యక్తి ఎలిమినేటి మాధవరెడ్డి. ఇప్పటి వారికి ఆయన గురించి తెలియకపోయినా ఆంధ్ర రాజకీయాల పై అనుభవం ఉన్నవాళ్ళకి, ఆనాటి ప్రజలకు ఆయన సుపరిచితమే. అయితే గత కొన్ని రోజులుగా మళ్ళీ ఆయన పేరు ఆంధ్రాలో గట్టిగా వినిపిస్తుంది. ఇంతకీ ఈ మాధవ రెడ్డి ఎవరు? ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి? ఆయన ఎలా చనిపోయారు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
ఎలిమినేటి మాధవరెడ్డి గారు 1949 లో కార్మికుల దినోత్సవం మే 1న, తెలంగాణలోని భువనగిరిలో వడపర్తి అనే ప్రాంతంలో నరసారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1974 లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎలక్ట్రిక్ ఇంజనీర్ విద్యలో పట్టభద్రులయ్యారు. అయితే ఇంజనీర్ చదువుతున్న రోజుల్లోనే, 1970 లో ఆయనకు, ఉమా దేవి గారికి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న ఉమాదేవి గారు, ఇంజనీరింగ్ చదువుతున్న మాధవ రెడ్డి గారు, ఇద్దరూ వారి వారి చదువులను పూర్తి చేశారు. ఇక ఈ దంపతులకు సృజన, శ్వేతా అనే ఇద్దరు కుమార్తెలు, సందీప్ అనే ఒక కుమారుడు ఉన్నారు. అయితే సందీప్ రెడ్డి గారు, తల్లి ఉమాదేవి గారితో పాటు ప్రస్తుతం తెరాసా పార్టీలో ఉన్నారు.
ఇక మాధవ రెడ్డి గారి రాజకీయ జీవితానికి ముందు వ్యాపారం చేసేవారు. 1975 లో బ్యాంకులో లోన్ తీసుకొని ‘జై కిసాన్ ఆగ్రో సర్వీసెస్’ పేరుతో ఒక ఎరువుల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. దాని తర్వాత, భువనగిరిలో టైల్స్ బిజినెస్ కూడా చేసేవారు.
ఇక ఆయన రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే, 1977 లో నల్గొండ జిల్లాలో ప్రజల నీటి కష్టాలకు చలించిపోయిన మాధవరెడ్డి గారు, నల్గొండ జిల్లాలో మొట్టమొదటి ‘బోర్ వెల్ రెగ్యులర్’ ని ప్రవేశపెట్టారు. దీనితో ఆయనకి ప్రజల్లో మంచి పేరు వచ్చింది. ఇక 1981 లో తన సొంత గ్రామం అయిన వడపర్తి గ్రామ ప్రజలు, విద్యావంతుడు, మంచి మనిషి అని ఆయన్ను మే 5న సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇది ఆయన రాజకీయ చరిత్రలో తొలిమెట్టు. అయితే కొన్ని రోజులకే 200 గ్రామ పంచాయతీల సమితికి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యిన తీరు ఆయన ఉనికిని జిల్లావ్యాప్తంగా చాటింది. అలా ఆయన ఆ పదవిలో 4 ఏళ్ళ 2 నెలల పాటు కొనసాగారు.
అయితే 1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు స్థాపించిన టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం మాధవరెడ్డి గారికి వచ్చిందని, కానీ అప్పటికే పంచాయతీ సమితి ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన, ఒక నాయకుడితో చేసుకున్న ఒప్పందం కారణంగా పోటీకి దిగకుండా, ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారని కొందరు చెప్తుంటారు. ఇక 1985 లో టీడీపీ అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గం అయిన భువనగిరి నుండి పోటీ చేసిన మాధవరెడ్డి గారు, 34,284 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇక అక్కడ నుండి ఆయన వెనక్కి త్రిగి చూసుకున్నది లేదు. కొన్ని రోజులకే ఒక సామాన్య నేతగా టీడీపీలోకి అడుగుపెట్టిన ఆయన, చంద్రబాబు తరువాత ఆ పార్టీకి రెండవ ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ గారిచే నియమించబడ్డారు. ఈ నియామకం వలన ఆయనకున్న సత్తా, ఆయన పై ఎన్టీఆర్ గారికి ఉన్న నమ్మకం, వాత్సల్యం ఎలాంటిదో అర్థమవుతుంది.
దాని తరువాత 1989 లో శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా, ఆయన మాత్రం తన నియోజకవర్గం నుండి 17 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. ఇక 1994 శాసనసభ ఎన్నికల్లో ఏకంగా 43,519 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అలానే ఎన్టీఆర్ కేబినెట్ లో 94 డిసెంబర్ నుండి 95 ఆగష్టు వరకు ఆరోగ్య, వైద్య విద్యా మంత్రిగా కొనసాగారు. అయితే, ఈయనకు ఆ మంత్రి పదవి రావడానికి కారణం చంద్రబాబు గారు అని కొందరు చెప్తూ ఉంటారు. దీనికంటూ ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఎన్టీఆర్ గారు, లక్ష్మి పార్వతి గారిని పెళ్లి చేసుకున్న తరువాత, ఆ కేబినెట్ లో ఆమెకు నచ్చిన వాళ్ళే మంత్రులుగా తీసుకోబడ్డారు అని అప్పట్లో వార్తల్లో నిలిచింది. అయితే కొన్ని రాజకీయ కారణాల చేత మాధవరెడ్డి గారు ఆమెను కిడ్నాప్ చేశారని, దాని వలన ఆమెకు అతనంటే ఇష్టం లేకపోవడంతో, అతనికి మంత్రి ఇవ్వడానికి ఆమె సుముఖంగా లేదని, అందుకే మాధవరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడానికి ముందు నిర్ణయం తీసుకోలేదని అప్పటి కాలం కొందరు నేతలు చెప్పుకొచ్చారు. కానీ, చంద్రబాబు గారు ఈ నిర్ణయంతో ఏకీభవించలేదని, మాధవరెడ్డిని మంత్రిమండలిలోకి తీయూకోవాల్సిందేనని, లేదంటే తాను ప్రమాణస్వీకారం చేయనని భీష్మించుకు కూర్చోవడంతో మాధవరెడ్డి గారికి ఆరోగ్య, వైద్య విద్యా మంత్రిగా బాధ్యతలు అప్పగించారని నాటి మాట. కానీ, ఈ కథ ఏమీ లేకుండా, యువనాయకుడు అయిన మాధవరెడ్డి తీరు చూసి ఎన్టీఆర్ ఆ పదవి ఇచ్చారని కొన్ని రికార్డ్స్ లో ఉంది.
ఇక ఎన్టీఆర్ గారిని దించేసి, చంద్రబాబు గారు సీఎం అవ్వగానే మాధవరెడ్డి గారు హోం, సినిమాటోగ్రఫీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హోంమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో పాత విధానాలకు చరమగీతం పాడి, నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. తన హయాంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, పోలీస్ శాఖలో ఎలాంటి రాజకీయ జోక్యాలు లేకుండా జాగ్రత్తలు వహించారు. ఆ సమయంలో రాష్ట్ర లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రులలో జలగం వెంగళరావు తరువాత అంతటి నిర్దిష్ట బాధ్యతను వహించిన వ్యక్తి మాధవరెడ్డి అని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తాయి. దీనికి ఒక ముఖ్య కారణం, నక్సలైట్ ల పై ఆయన ఉక్కుపాదం మోపడం. ఎంతోమంది నేతలతో పాటు, సామాన్య ప్రజానీకం కూడా నక్సలైట్ ల దాడుల్లో చనిపోతున్నారని, వారిని నివారించే దిశగా మాధవరెడ్డి పనిచేసేవారు. అలానే వారిని జనజీవన స్రవంతిలో కలిసిపోమని, ఉపాధి కలిపిస్తామని ఆయన నక్సలైట్ లను కోరారు. దాని వలన అప్పుడు కొంత నక్సలైట్ ల ప్రభావం తగ్గిందనే చెప్పాలి.ఇలా 1995 సెప్టెంబర్ నుండి 1999 సెప్టెంబర్ వరకు ఆ మంత్రి పదవిలో కొనసాగారు.
అలానే 1999 శాసనసభ ఎన్నికల్లో కూడా ఆయన భువనగిరి నుండి వరుసగా నాలుగవ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇన్ని సార్లు ఆ నియోజకవర్గం నుండి గెలిచిన నేతగా ఆయన రికార్డు సాధించారు. టీడీపీ కూడా ఆ ఎన్నికల్లో గెలవడంతో చంద్రబాబు ఈసారి దేవేందర్ గౌడ్ గారికి హోంమంత్రిగా, మాధవరెడ్డి గారికి ఆయనకు పట్టు ఉన్న పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖను అప్పగించారు. అయితే మాధవరెడ్డి గారికి నక్సలైట్ ల నుండి ప్రాణహాని ఉన్న కారణంగానే ఆయనకు ఆ దఫాలో హోంశాఖ ఇవ్వకపోవడం జరిగింది.
అయితే చెక్కుచెదరని రాజకీయ ప్రస్థానం కలిగి ఉండి, గొప్పనేతగా ప్రజలచే కీర్తించబడి, తెలంగాణ ముఖ్య నాయకుల్లో ఒకడిగా ప్రజలకు గుర్తిండిపోయిన మాధవరెడ్డి గారు, 2000వ సంవత్సరంలో మార్చ్ 7న బాంబు బ్లాస్ట్ లో ప్రాణాలు విడిచారు. అప్పుడు మున్సిపల్ ఎన్నికలు ప్రచారాలు జరుగుతున్న సమయంలో యాదగిరి నుండి హైదరాబాద్ వస్తున్న ఆయన పై నక్సలైట్ లు రెక్కీ వేసి, ఘట్కేసర్ ప్రాంతంలో ఒక చోట ల్యాండ్ మైన్ పెట్టి మాధవరెడ్డి గారిని చంపేశారు. ఆయన ఉన్న కారు 15 అడుగుల పైనే గాల్లోకి ఎగిరిందని ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసినవారు చెప్తారు.
ఆయన మరణాంతరం, ఆయన సతీమణి ఉమాదేవి గారు 2001 లో అదే నియోజకవర్గం నుండి బై ఎన్నికల్లో పోటీచేసి 46,488 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. కాగా, ఆమెకు చంద్రబాబు గారు గనులశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఆమె కూడా వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఒకటే నియోజకవర్గం నుండి భార్యాభర్తలు ఇద్దరూ హ్యాట్రిక్ విజయాలు సాధించడం ఒక రికార్డు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడంతో 2014 లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే కుమారుడు సందీప్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆమె, తన కొడుకుతో పాటు 2017 లో తెరాస పార్టీలో చేరారు. కానీ, చంద్రబాబు గారిని ఎప్పుడూ గౌరవిస్తానని, ఆయన కష్టసమయాల్లో సైతం తమ కుటుంబానికి అండగా ఉన్నారని ఆమె చెప్తూ ఉంటారు.
ఇక మాధవరెడ్డి గారి జీవితంలో వివాదాల విషయానికి వస్తే, ఆయన 1994 ఎన్నికలకి ముందు రాజకీయ కారణాల చేత ఎన్టీఆర్ గారి రెండవ భార్య లక్ష్మి పార్వతిని కిడ్నాప్ చేశారనే అభియోగం ఉంది. ఆమెను ఒక మిల్ లో దాచారని అంటూ ఉంటారు. అయితే అది నిజమని కూడా నేరుగా చెప్పిన అప్పటి నేతలు ఉన్నారు.
ఇక అప్పట్లో టీడీపీ నేత అయిన మోత్కుపల్లి నర్సింహులు గారి వర్గానికి చెందిన కొందరు మాధవరెడ్డి గారి మీద చెప్పులు విసిరారు. అయితే మొదట ఎంతో స్నేహంగా ఉండే మాధవరెడ్డి గారు, నర్సింహులు గారు 1994 లో టీడీపీలో మొదలైన చీలికలు మూలాన విడిపోవాల్సి వచ్చింది. మాధవరెడ్డి గారు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తే, నర్సింహులు గారు ఎన్టీఆర్ గారి గ్రూప్ లో ఉండేవారు. దీనితో వారిద్దరి మధ్య నెమ్మది నెమ్మదిగా దూరం పెరిగి వైరంగా మారింది.
ఇక మరో విషయం, మాధవరెడ్డి గారు చనిపోయిన తరువాత, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అతని సోదరుడు కృష్ణారెడ్డి తన సోదరుడి మృతిపై విచారం జరపాలని, తన సోదరుడిని చంద్రబాబే చంపించాడని ఆయన పలుమార్లు మీడియా ముందు చెప్పడం జరిగింది. దీనికి నేటి తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా మద్దతు పలికారు. అయితే, తన భర్త పేరు ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదు అని మాధవరెడ్డి గారి భార్య ఉమాదేవి గారు, కృష్ణారెడ్డి గారిని, కేసీఆర్ గారిని విమర్శించారు. అలానే కేసీఆరా గారికి ప్రత్యేక లేఖ కూడా రాసి, తన భర్త పేరు తీసుకురావద్దని కోరారు.
అయితే ఇక ఆయన చనిపోయిన 20 ఏళ్ళ తరువాత, ఇప్పుడు మాధవరెడ్డి గారు పేరు మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని తప్పుబడుతూ, మాధవరెడ్డి గారి పేరు తెస్తూ టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. దాని తరువాత అసెంబ్లీ సమావేశాల్లో అంబటి రాంబాబు గారు కూడా సభలో మాధవరెడ్డి గారి పేరు తీసుకురావడంతో చంద్రబాబు గారు, వారి ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు. ఆ వెంటనే మీడియా ముందుకి వచ్చిన చంద్రబాబు గారు, మీడియా ఎదుటే వెక్కి వెక్కి ఏడవడం అందరినీ కలిచివేసింది. నేతలు వ్యక్తిగత జీవితాలను దూషిస్తూ అబాండాలు మోపడం సరికాదని, మచ్చ లేని మాధవరెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం నీచమని, నేతల దిగజారుడు స్వభావాలు చూసి బాధపడే పరిస్థితి వచ్చిందని సీనియర్ నేతలు, ప్రజలు విమర్శిస్తున్నారు.
ఆయన మరణాంతరం, ఆయన పేరు మీద ఎన్నో భవనాలు నెలకొన్నాయి, విగ్రహ ప్రతిష్టలు కూడా జరిగాయి. 2004 లో నల్గొండ జిల్లాలో శ్రీశైలం నీటి పారుదల ప్రాజెక్ట్ కి గౌరవార్థం మాధవరెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా ఎలిమినేటి మాధవరెడ్డి గారి సేవలు చిరస్మరణీయం, ఆయన సేవాదృక్పథం, పనితీరు ఎందరికో ఆదర్శంగా నిలిచింది. భువనగిరి ప్రజలకు ఆయన ఎప్పుడూ మహానేతే.