తెలుగు వారందరికీ బాగా తెలిసిన పేరు, నోటి మాట చాలా పెద్దది, ఎంతమంది ఉన్నా తన వాక్ చాతుర్యంతో తన వైపు తిప్పుకోగల సామర్థ్యం ఉన్న వ్యక్తి, కులాలకు వ్యతిరేకి, ఆత్మస్థైర్యం గల నాయకుడు, ఆయనే అంబటి రాంబాబు. ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి, వాటి గురించి ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాము.
అంబటి రాంబాబు గారు 1959 లో ఏవీఎస్సార్ ఆంజనేయులు, వెంకట సుబ్బమ్మ గార్ల దంపతులకు గుంటూరు జిల్లాలోని రేపల్లె ప్రాంతంలో జన్మించారు. వాళ్ళ నాన్న గారు వృత్తిరీత్యా కాగా, ఆయన కూడా రాజకీయాల్లో ఆసక్తి కలిగి ఉండేవారు. అప్పటి సీఎంలు చెన్నారెడ్డి, అంజయ్య గార్లతో కూడా ఆయనకు పరిచయం ఉండేది. అప్పటి ప్రభుత్వాల సమయంలో ఆయన ఏపీడీడీఎస్సి డైరెక్టర్ గాను, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గాను కూడా బాధ్యతలు నిర్వహించారు.అలానే పీసీసీ సభ్యుడిగా కూడా ఉండేవారు. ఇక రాంబాబు గారి బాల్యం అంతా వారి తాతగారి ఊరైన బందలాయి చెరువు అనే గ్రామంలో గడిచింది. ఆయన స్కూలింగ్ ఆ ఊరిలోనూ, అవనిగడ్డలోనూ జరిగింది. దాని తరువాత ఆయన మళ్ళీ రేపల్లె వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోగా, రేపల్లెలోనే ఇంటర్ చదివారు, ఇంజనీరింగ్ చదువుదామన్న కొన్ని చేత కుదరక, డిగ్రీ అక్కడే ఏబీఆర్ కాలేజీలో పూర్తిచేశారు, ఇక డిగ్రీ తరువాత విశాఖపట్నంలో న్యాయ విద్యా పరిషత్ లా కాలేజీలో లా చేశారు. దాని తరువాత ఆయన 3 ఏళ్ళ పాటు లాయరుగా పనిచేసారు. అప్పుడు కూడా ఆయన కోర్టులో వాదించే తీరుకు అందరూ ఆయన్ను మెచ్చుకునేవారు.
ఇక రాంబాబు గారికి 1987 లో విజయలక్ష్మి గారితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ముగ్గురూ డాక్టర్లే. అయితే రాజశేఖర్ గారి వలనే తన కూతర్లు డాక్టర్ పూర్తిచేయగలిగారని రాంబాబు గారు అంటూ ఉంటారు. ఇక పెద్ద కూతురు ప్రేమను అంగీకరించి, కులాంతర వివాహం కూడా చేశారు. దీని బట్టి కులాల పట్ల ఆయన స్వభావం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా కొంకులాంతర వివాహాలను ప్రోత్సహించి ఎంతోమందికి ఆయన ఆదర్శంగా నిలిచారు.
ఇక రాంబాబు గారి రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే, ఆయన చిన్నతనం నుండే మాట్లాడుకోవాలి. ప్రత్యేకంగా రాజకీయాల మీద ఆసక్తి కాదు గానీ, 9వ తరగతిలో ఉన్నప్పుడే అవనిగడ్డ ప్రాంతంలో ఆయనకు గుర్తింపు లభించింది. కారణం ఏంటంటే, ఆయన 9వ తరగతి చదువుతున్నప్పుడు 1972 లో జై ఆంధ్ర ఉద్యమం జరిగింది, ఆ సమయంలో రాంబాబు గారు కొంతమంది మిత్రులతో కలిసి ఆ ఉద్యమంలో పాల్గొనగా, వారి మీద కేసులు కూడా పెట్టారు. ఆ విధంగా సమస్యల పోరాటాలు, ఉద్యమాలలో చిన్నతనం నుండే చురుకుగా ఉండేవారు. ఇక ఇంటర్, డిగ్రీ, లా కాలేజీల్లో కూడా స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన స్టూడెంట్ యూనియన్ పార్టీల తరఫున కాకుండా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి, ఇంటర్, డిగ్రీ, లా కాలేజీల్లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక మూడేళ్లు లాయరుగా పనిచేసిన తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
రాంబాబు గారు వ్యక్తిగతంగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కువగా అభిమానించేవారు. ఆయన కూడానే ఎప్పుడూ తిరుగుతూ ఉండేవారు. అయితే రాయపాటి సాంబశివ రావు గారి సిఫార్సుతో 1989 శాసనసభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ లభించగా, ఆయన సొంత నియోజకవర్గమైన రేపల్లె నుండి పోటీ చేసి 3338 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలా 31 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యి, అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన జాబితాలో ఆయన పేరు కూడా చరిత్రలో నిలిచింది. అయితే అప్పుడు టీడీపీ అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షం నుండి శాసనసభలో ఎక్కువగా వినిపించే గొంతుక అంబటి రాంబాబు గారిది అయ్యింది. అప్పట్లో కొంతమంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎత్తివేయడంతో ఆయన వాటి గురించి సభలో అధికార పక్షాన్ని ధైర్యంగా ప్రశ్నించారు. ఆ ధైర్యం, సభ పిక్కటిల్లే పలికిన మాటలు పార్టీలో అందరినీ ఆకర్షించాయి. ఆ విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.
అయితే 1994, 1999 శాసనసభ ఎన్నికల్లో రేపల్లె నియోజవర్గం నుండి పోటీ చేసిన రాంబాబు గారు పరాజయం పాలయ్యారు. ఆ సమయంలో ఒక కేబుల్ టీవీని కూడా రన్ చేశారు, కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాన్ని కూడా అమ్మేశారు. ఇక 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో తనకి పార్టీ టికెట్ లభించే అవకాశం ఉన్నా కూడా ఆయన గత రెండు సార్లు ఓడిపోయినందుకు బాధ్యత వహిస్తూ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇది ఆయన ఆత్మాభిమానానికి, బాధ్యతాయుత ప్రవృత్తికి సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే స్వతహాగా వైఎస్సార్ గారిని అభిమానించే రాంబాబు గారు, 2004 ఎన్నికల కంటే ముందు వైఎస్సార్ గారు చేసిన పాదయాత్రలో ఆయన కూడానే తిరిగారు. ఇక 2004 లో ఘనవిజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, వైఎస్సార్ గారు రాంబాబు గారికి ఏపీఐఐసి ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీగా, పీసీసి మెంబర్ గా కూడా కొనసాగారు.
అయితే వైఎస్సార్ గారి మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ జగన్ కి మద్దతు ఇస్తున్నారనే నెపంతో రాంబాబు గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయితే పార్టీ సస్పెండ్ చేసినా, జగన్ గారి దగ్గర ఏమీ లేకపోయినా కూడా తను నమ్మిన సిద్ధాంతం, వైఎస్సార్, జగన్ గార్ల మీద అభిమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ మొదటి వ్యక్తి అంబటి రాంబాబు. అలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014 శాసనసభ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజవర్గం నుండి పోటీ చేసి 924 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే అదే చోట మళ్ళీ 2019 ఎన్నికల్లో పోటీ చేసి తను ఓడిపోయిన టీడిపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ గారి మీదే 20,876 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచి ప్రభంజనం సృష్టించారు.
ఇక రాంబాబు గారి జీవితంలో వివాదాల విషయానికి వస్తే, ఆయన 2004 లో ఏపీఐఐసి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్లకే పరిశ్రమల స్థాపన విషయంలో జరిగిన అవకతవకల పై అధికారులు విచారణ జరపగా, మేనేజింగ్ డైరెక్టర్ ని అరెస్ట్ చేసారు. కానీ ఆ విచారణలో రాంబాబు గారు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని తేలింది. ఆ విధంగా ఆయన నిజాయితీ ఏంటో తెలిసింది. ఇక 2011 లో ఒక మహిళతో ఫోన్ లో వివాహేతర సంబంధంతో మాట్లాడినట్టు ఏబీఎన్ ఛానల్ లో అంబటి రాసలీలలు పేరిట, కాల్ రికార్డింగ్స్ తో ఒక కథనం రాగా, అది సంచలనం అయింది. అయితే రాంబాబు గారు దాని మీద ఫైట్ చేసి, ఎవరితో అయితే మాట్లాడాడు అని అన్నారో ఆమె మీడియా ముందుకి వచ్చి, అంబటి రాంబాబు ఎవరో తనకి అసలు తెలియదు అనడంతో అది ఒక నిందగా నిరూపితమైంది. మళ్ళీ అలాంటిదే 2021 లోనే ఇటీవల మరో కాల్ రికార్డింగ్ బయటికి రాగా, అన్ని మీడియాలలోనూ వైరల్ గా మారింది. అయితే అది కూడా ఒట్టి బూటకమే అని, అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆయన ఒక వీడియో ద్వారా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు విన్నవించారు. అంతేకాకుండా, ఈ మధ్య ఆయన శాసనసభలో మాట్లాడుతూ, ఎలిమినేటి మాధవరెడ్డి గురించి మాట్లాడాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యల కారణంగానే టీడిపీ నేతలు సభ నుండి వాకౌట్ చేయడం, చంద్రబాబు గారు మీడియా ముందుకి వచ్చి ఏడవడం జరిగింది.
ఈ విధంగా అంబటి రాంబాబు గారు తనదైన మాటల శైలితో, కంచు కంఠంతో ఎక్కువగా మీడియాలో కనిపిస్తూ ఉండడం జరుగుతుంది. ప్రత్యర్థుల మీద ఆయన విరుచుకుపడే తీరును సొంత పార్టీ కార్యకర్తలు తెగ ఎంజాయ్ చేస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అలా తన రాజకీయ జీవితంలో కొన్ని విషయాల్లో చురుకుగా ఉండి ప్రశంసింపబడడం, కొన్ని విషయాల్లో వివాదాల పాలవుతూ విమర్శలు కూడా ఎదుర్కొకోవడం జరుగుతుంది. అంబటి రాంబాబు గారు ప్రజల పక్షాన ఉంటూ, ప్రజల అవసరాల దృష్ట్యా పనిచేసి నాయకుడిగా ఎప్పుడూ ఆనందగా ఉండాలని కోరుకుంటూ సెలవు.