బింబిసార… ఇటీవల నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ ఉత్తర భారతదేశ రాజు చరిత్రకి సంబంధించిన కథాంశంతో ‘బింబిసార’ అనే సినిమాతో వస్తున్నారు. దీనితో అసలు ఈ బింబిసార అనే అతను ఎవరు, ఎక్కడి రాజు, అతని మీద సినిమా తీసేటంత గొప్ప చక్రవర్తా, లేక దుర్మార్గుడా ఏంటి అన్నది చాలా మందికి తలెత్తిన సందేహం. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ, ఈ వీడియోలో మనం ఆ రాజుకి సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకోబోతున్నాం. రెడీ విత్ హై వాల్యూం.
బింబిసార గురించి చెప్పుకునే ముందు మనం కొంత ఉత్తర భారతదేశ చరిత్ర, రాజ్యాల గురించి తెలుసుకోవడం అవసరం. జనపద, ఈ పదం మనకి కొత్త కావొచ్చు గానీ, దేశ రాచరిక చరిత్ర మొదలయింది ఇక్కడే. జన అంటే జనులు అంటే ప్రజలు, పాద అంటే పాదం, మొత్తంగా జనం పాదం మోపడం, అంటే అందరూ ఒక చోటుకి చేరడం అని నాటి అర్థం. అయితే దేశం కాంస్య యుగం నుండి లోయయుగంకి మారుతున్న సమయం అంటే 1100 బీసీఈ తరువాత ఈ జనపాదాస్ ఏర్పడ్డాయి. అవి అంచలంచెలుగా నాగరీకత మెరుగుపడుతూ ఉత్తర భారతదేశంలోని 22 జానపాదాస్, 16 మహాజనపాదాస్ గా అభివృద్ధి చెందాయి. ఆ మహాజనపాదాస్ లో 2 గణతంత్య్ర రాజ్యాలుగా, మిగిలినవి రాచరిక రాజ్యాలుగా ఉండేవి. ఆ పదహారే, అంగ, అస్సక, అవంతి, చెడి, గాంధార, కశి, కాంబోజ, కోసల, కురు, మగధ, మల్ల, మత్స్య, పాంచాల, సురసేన, వ్రిజ్జి, వత్సా రాజ్యాలు.
ఇందులో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మగధ రాజ్యం గురించి. అన్ని విషయాల్లోనూ అత్యంత అభివృద్ధి చెందిన రాజ్యాలలో మొదటి వరుసలో ఉండే అర్హత గలది. అయితే ఇక్కడ మరో విషయం మొదటగా మన అర్థం చేసుకోవాలి. రాజ్యానికి, సామ్రాజ్యానికి తేడా ఉంది. రాజ్యం అంటే కేవలం ఒక ప్రాంతం, సామ్రాజ్యం అంటే వివిధ రాజ్యాల సమూహం. ఇక మగధ రాజ్యాన్ని మొదటగా స్థాపించినది బ్రిహదత్త, అతని పేరు మీదే బ్రిహదత్త వంశం జనించింది, ఆ వంశం వారు 1700 బీసీ నుండి 682 బీసీ వరకు మగధను పాలించారు. వారిలో చివరి రాజును మట్టుపెట్టి, ప్రద్యోత అనే రాజు ప్రద్యోత వంశాన్ని స్థాపించగా, వారు మగధ రాజ్యాన్ని 682 నుండి 544 వరకు పాలించారు. వారి తరువాత హార్యంక వంశం పాలనలోకి వచ్చింది, దీనిని స్థాపించింది బింబిసార. బింబిసార మగధ రాజ్యాన్ని మగధ సామ్రాజ్యంగా విస్తరించి, మగధ సామ్రాజ్య స్థాపకుడిగా చరిత్రలో నిలబడ్డాడు. అతను స్థాపించిన హార్యంక వంశం వారు మగధను 544 బీసీ నుండి 413 బీసీ వరకు పరిపాలించారు. ఆ తరువాత శైసుంగ వంశం 413 నుండి 345 వరకు పాలించగా, 345 నుండి 322 వరకు నంద, 322 నుండి 185 వరకు మౌర్యులు, వారి తరువాత గుప్తులు 6వ శతాబ్దం వరకు, పాల వంశీయులు 12వ శతాబ్దం వరకు మగధ సామ్రాజ్యాన్ని పాలించడం జరిగింది.
ఇక మగధ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన బింబిసార దగ్గరికి వద్దాం. బింబిసార 558 బీసీలో జన్మించారు. ఆయన చిన్న వయసులోనే అన్ని అన్ని రకాల విద్యలలోనూ ఆరితేరి, యుద్ధ నైపుణ్యాలను అలవర్చుకున్నాడు. బింబిసార తండ్రి పేరు భట్టియ, తల్లి పేరు బింబి. భట్టియ తండ్రి పేరు హార్యంక కాగా, ఆ పేరు మీదే బింబిసార వంశానికి ఆ పేరు పెట్టాడు. ఇక తండ్రి భట్టియ ఒక ప్రాంతానికి పెద్దగా ఉన్నప్పుడు, అంగ రాజ్యానికి రాజు అయిన బ్రహ్మదత్త మీదకి యుద్ధానికి వెళ్లి ఓడాడు. దానితో 15 ఏళ్లకే రాజు అయిన బింబిసార, తన తండ్రికి జరిగిన దానికి బ్రహ్మదత్త మీద పాగా తీర్చుకోవాలని అనుకున్నాడు, అలానే తన బంగాళాఖాతానికి ఆనుకున్న అనగా రాజ్యం మీద కన్నేయడం కూడా ఒక కారణమా. తనకి ఉన్న బలంతో, బాలగంతో బింబిసార, బ్రహ్మదత్తను సులభంగా ఓడించి, అంగ రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ అంగ రాజ్యానికి తన కొడుకు అజాతశత్రుని గవర్నర్ గా నియమించాడు. ఆ విధంగా మగధ సామ్రాజ్య విస్తారం మొదలుపెట్టాడు. అయన గిరివ్రజ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పారిపాలన చేసేవాడు, ఆ ప్రాంతమే ఇప్పటి బీహార్ లోని రాజగిర్. ఆయన సామ్రాజ్యం కింద బీహార్, జార్ఖండ్, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. ఇక అక్కడ నుండి పశ్చిమ భారతదేశం నుండి మధ్య భాగంగా తూర్పు భారతదేశంగా ఉన్న మిగతా రాజ్యాలు అవంతి, కోసల, వత్స్య లాంటి రాజ్యాలను వాసం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే తను గొప్ప సైన్యం కలిగి, సమర్థవంతమైన రాజు అయినప్పటికీ రాజ్యాల విస్తరణ అస్ధ్యం అని గుర్తించి, బంధాల ద్వారా చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగానే. కోసల రాజ్యాధిపతి ప్రసంగిత యొక్క సోదరి కోసల దేవిని పెళ్లి చేసుకున్నాడు, కట్నంగా ఆధ్యాత్మిక ప్రాంతమైన కాశీ ప్రాంతాన్ని పొందాడు. అలానే వ్రిజ్జి రాజ్య రోజుల్లో ఒకరైన జైన రాజు అయిన చేతకుని కూతురు, లచ్ఛవి యువరాణి చెల్లనను పెళ్లి చేసుకున్నాడు. అదేవిధంగా మధ్య పంజాబ్ కి చెందిన మద్రి యువరాణి క్షేమను పరిణయమాడాడు. అయితే కాలక్రమేణా బుద్ధునికి తొలి మహిళా శిష్యురాళ్ళైన ఇద్దరిలో క్షేమ ఒకరు, ఉప్పలవన్న మరొకరు. ఆ విధంగా బింబిసారకు ముఖ్యంగా కోసల దేవి, చెల్లన, ధరిణీ, క్షేమ, నంద, అమ్రపాలి అనే ఆరుగురు భార్యలు కాగా, బౌద్ధ గ్రంథమైన మహావగ్గ ప్రకారం, బింబిసారకు 500 మంది భార్యలు అని తెలుస్తుంది.
వీరిలో ఆమ్రపాలి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈమె కథ చెబితే మీకు ఒక సినిమా కూడా గుర్తుకురావచ్చు. బింబిసార జీవితంలోని ప్రేమకథ కూడా ఈమెదే. వైశాలి ప్రాంతానికి చెందిన ఆమ్రపాలి అనే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఎన్నో కళలో సిద్ధురాలు. అక్కడి మగవాళ్ళు ఆమెను స్నేహం కోసం పరితపించేవాళ్ళు. ఐతే ఆ వైశాలి రాజు అయిన మనుదేవ్, ఒకరోజు ఆ నగరంలో ఆమె నృత్యం చేయడం చూసి ఆకర్షితుడయ్యాడు, ఆమెను సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఫలితంగా ఆమె ప్రేమించిన, కాబోయే భర్త అయిన పుష్పక కుమార్ ని వారి పెళ్లిరోజే చంపేసి, ఆమెను వైశాలి యొక్క నగరవధు అంటే అధికారక నర్తకిగా ప్రకటించాడు. కొంచెం ‘చంద్రముఖి’ ఛాయలు ఉన్నాయి కదూ! అయితే ఆమె నాట్యం, కళలను చూడడం మామూలువారికి సాధ్యం కాదు, ఆ కళలను చూడడం కోసం ఒక రాత్రికి యాభై కార్షాపణాస్ చెల్లించాలి. దానితో ఆమె ఖజానా కొంతమంది రాజుల ఖజానా కంటే ఎక్కువగా మారింది. ఇదిలా ఉండగా, ఈ విషయాలన్నీ బింబిసారకు తెలిసాయి. అతను వెంటనే వైశాలి మీద యుద్ధం మొదలుపెట్టాడు, ఆమ్రపాలి ఇంట్లో ఆశ్రయం పొందగా, అతను ఎవరో ఆమె గుర్తుపట్టింది. ట్విస్ట్ ఏంటంటే, బింబిసార మంచి సంగీత విద్వాంసుడు కాగా, వీరు గతంలోనే ప్రేమికులు. ఇక దానితో ఆమె వైశాలి మీద యుద్ధం ఆపేయమని కోరితే, అతను అలానే చేసాడు. కాగా, వారికి విమల కొండన్న అనే కొడుకు పుట్టాడు. అయితే బింబిసార మొదటి కొడుకు అజాతశత్రు, బౌద్ధ గ్రంథాల ప్రకారం కోసల దేవి కొడుకు అని, జైనుల ప్రకారం చెల్లన కొడుకు అని తెలుస్తుంది.
ఆ విధంగా పెళ్లిళ్లు చేసుకొని, బంధాల ద్వారా కొన్ని రాజ్యాలను సంపాదించుకున్నాడు, కానీ ఉజ్జయిని రాజధానిగా కలిగిన అవంతి రాజ్యాన్ని మాత్రం చేజిక్కించుకోవడం కష్టమైంది. దాని రాజు ప్రద్యోతతో చాలా కాలం పాటు యుద్ధం జరిగినా ఇద్దరిలో ఎవరికీ విజయం దక్కలేదు. అయితే ఒకసారి ఆ ప్రద్యోత పచ్చకామెర్ల బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు. బింబిసార తన రాజ్య వైద్యుడు జీవకను పంపి వైద్యసేవ అందేలా చేసాడు. దీనితో ప్రద్యోతతో స్నేహసంబంధం కుదిరింది.
ఇక బింబిసార పాలన విషయం గురించి వస్తే, ఆయన ఆ విషయంలో చాలా ప్రతిభావంతుడు, జ్ఞాని. ఎంతో కుదురైన ప్రణాళిక రచించాడు, పాలనా విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చాడు. ఆయన తరువాత మగధను పారాలించిన రాజులు కూడా అయన పాలనా విధానాన్ని అనుసరించారంటే ఆయన నేర్పు ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన సామ్రాజ్యం కింద ఉన్న 80,000 గ్రామాలకు, ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారిని పెట్టాడు, వారి నుండి ప్రజల నుండి పన్నులు వసూలు చేయించేవాడు, అంతే కాకుండా ఆ గ్రామాల మంచిచెడ్డు, పాలనా బాధ్యతను వారికే అప్పజెప్పేవాడు. ఎవరైనా బద్ధకించినట్టు తెలిసినా, సరిగ్గా పనిచేయకపోయినా వెంటనే వారి స్థానాల్లో కొత్తవారిని నియమించేవాడు. ఆయా విషయాల్లో తన మంత్రుల మాటలను ఎక్కువగా వినేవాడు. ఆయన ఆస్థానంలో ముఖ్యంగా సోనా కోలవిస అనే వ్యక్తి, పూలు సేకరించే సుమన, మంత్రి కొలియా, కోశాధికారి ఖుంభాగోశక, వైద్యుడు జీవక ఉండేవారు.
బింబిసారుడిని జైనుల గ్రంథంలో శ్రేణిక అని సంభోదించేవారు, అంటే ఎప్పుడు యుద్ధం వచ్చినా సిద్ధంగా ఉండే సేన కలవాడు అని అర్థం. అంత సమర్థవంతంగా ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేసి, నిర్వహించేవాడు. బింబిసార సైన్యం నాలుగు భాగాలుగా విభజించబడింది, ఒకటి పదాతి దళం, అంటే నేలపై ఉండి యుద్ధం చేసేవారు, రెండు అశ్విక దళం, గుర్రాల పై ఉండే సేన, మూడు రథ దళం, రథాలు ఉపయోగించేవారు, నాలుగు గజదళం, ఏనుగుల పై ఉంది యుద్ధం చేసేవారు.
ఇక తన మగధ సామ్రాజ్యం స్వతహాగానే జార్ఖండ్, బీహార్ లాంటి ప్రాంతాల్లో ఉండటం చేతన ఇనప ఖనిజాలు ఎక్కువగా లభించేవి, అలానే అడవుల ఎక్కువ కావడం వలన కలప దొరికేది, ఈ విధంగా ఆయుధ సామాగ్రీలో ధనవంతులుగా మారారు. అంగ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో బంగాళాఖాతం తీరం నీటి రవాణా, ఇతర సంపాదనలకు ఖజానాగా మారింది. అంతేకాకుండా సామ్రాజ్యం దేశ మధ్య భాగంలో ఉండడటం చేత రవాణా వలన ఇతర రాజ్యాల నుండి ఆదాయం లభించేది. ఈ విధంగా సంపూర్ణ సామ్రాజ్యంగా మగధను బింబిసార నిలబెట్టాడు. ఫలితంగా, భవిష్యత్తు రాజులకు మగధ అభివృద్ధి సులువు అయిందనే చెప్పవచ్చు.
బింబిసార మహారాజుగా ఉన్న కాలంలోనే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతం స్థాపన చేసి బోధనలు చేయడం, అలానే మహావీర్ అదే వర్ధమానుడు జైన మత స్థాపన చేసి బోధనలు చేయడం జరిగేది. దానితో బింబిసార మీద హిందూ మతంతో పాటు వీటి ప్రభావం కూడా ఉండేది. ఆయన తమ మతస్థుడు అని రెండు మతాలు చెప్పుకుంటాయి, ఆ విషయంలో ఆయన ఏ మతం అన్నది ఎక్కడా కూడా సాక్ష్యాలు లేవు. కానీ, బింబిసార మాత్రం తన సామ్రాజ్యానికి వచ్చే బుద్ధుడు, మహావీర్ తో సహా అందరు సాధువులను శ్రేష్ఠంగా సేవించి, గౌరవించేవాడు.
అయితే ఇంతటి మహా చరిత్ర కలిగిన బింబిసారుడిని తన కొడుకు అజాతశత్రు జైల్లో బంధించడం జరిగింది. బుద్ధుడి దుష్ట బంధువైన దేవదత్త మాటలకు లోబడి అజాతశత్రు, రాజ్యాధికారం మీద మొహంతో తన తండ్రిని జైల్లో వేయడం జరిగింది. అయితే బౌద్ధ గ్రంథాల ప్రకారం, అజాతశత్రు తన తండ్రి బింబిసారుడిని చంపేశాడని తెలుస్తుంది, కానీ జైనుల చరిత్రల ప్రకారం జైల్లో ఉండగా, అవమానంతో అతనే స్వయంగా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. ఆ విధంగా బింబిసార 544 బీసీ నుండి 492 బీసీ వరకు మగధ సామ్రాజ్యాన్ని 52 ఏళ్ళు పాలించి, 492 బీసీలోనే మరణించాడు.
మరి ఇక రాబోయే ‘బింబిసార’ సినిమాలో ఏం కథ చెప్తారో, ఎంతవరకు చెప్తారో, ఎలా చెప్తారో చూడాల్సి ఉంది. ఏదైనా సినిమా మంచి హిట్ అయ్యి ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుందాం. సెలవు.
GIPHY App Key not set. Please check settings