కె.విశ్వనాథ్ బయోగ్రఫీ | Director K. Vishwanath Biography

108
0
కె.విశ్వనాథ్ బయోగ్రఫీ | Director K. Vishwanath Biography | K Vishwanath Life Story
కె.విశ్వనాథ్ బయోగ్రఫీ | Director K. Vishwanath Biography | K Vishwanath Life Story

తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుడు, భారతదేశ సినిమా స్థాయిని ఖండాలకు విస్తరించిన ఖ్యాతి; సమాజం, సంస్కృతి, కళా తేజస్సు ఉట్టిపడేలా సినిమా తీయడంలో సినీ శ్రేష్ఠుడు, అంటారానితనం, సమాజ అసమానతలు, వివిధ అక్రమ పోకడలను సున్నితంగానూ, ఘాటుగా ప్రశ్నించేలానూ సినిమాని మలచడంలో నేటికీ సాటిలేని దర్శక రత్నం, కళా తపస్వి కాశీనాధుని విశ్వనాథ్. ఆ మహోన్న వ్యక్తి సినీ ప్రస్థానంలో అందుకోని అవార్డు లేదు, ఎక్కని శిఖరం లేదు, చేరని గమ్యం లేదు. అలాంటి కే.విశ్వనాథ్ గారి సినీ జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు, ఔరా అనిపించే అద్భుత సినిమాలు గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం.

విశ్వనాథ్ గారు 1930, ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా, రేపల్లె మండలంలోని పెద్దపుల్లివర్రు అనే ప్రాంతంలో జన్మించారు. వారి తండ్రి గారి పేరు కే.సుబ్రహ్మణ్యం, తల్లి గారి పేరు సరస్వతి. విశ్వనాథ్ గారి బాల్యం, ప్రాథమిక విద్య పెద్దపుల్లివర్రు గ్రామంలోనే జరుగగా, తరువాత వారి కుటుంబం విజయవాడకు వెళ్లిపోవడంతో ఉన్నత విద్య విజయవాడలో ముగించారు. ఆ తరువాత ఇంటర్ గుంటూరులోని గుంటూరు హింద్ కాలేజీలో చేయగా, బీఎస్సీ డిగ్రీ గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలోనూ పూర్తిచేశారు. విశ్వనాథ్ గారి భార్య పేరు జయలక్ష్మి, ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా, వారి పేర్లు పద్మావతి దేవి, నాగేంద్రనాథ్, రవీంద్రనాథ్. అలానే ప్రముఖ నటుడు చంద్రమోహన్, ప్రముఖ గాయకుడు కీ.శే.బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకు దగ్గర బంధువులు.

తెలుగు సినీ చరిత్రలో మరుపురాని సినిమాలను చేర్చిన విశ్వనాథ్ గారి సినీ ప్రయాణం 1957 లో ఒక సాధారణ సౌండ్ రికార్డిస్ట్ గా మొదలయింది. వారి తండ్రి సుబ్రహ్మణ్యం గారు మద్రాస్ లో వాహిని స్టూడియోలో అసోసియేట్ గా పనిచేయగా, విశ్వనాథ్ గారి అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేశారు. అక్కడ ఆయన ఏ.కృష్ణన్ అనే సీనియర్ సౌండ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పనిచేసేవారు. ఆ సమయంలో వారిద్దరికీ మంచి స్నేహబంధం ఏర్పడి, సినిమాల గురించి ఎక్కువగా చర్చించుకునేవారు. అలా ఆయన 1957, 59 లలో నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా తోడికోడళ్లుకి, బండరాముడు సినిమాకు సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేశారు. ఆ తరువాత సినిమాల మీద ప్రేమతో 1961 లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వచ్చారు. అలా వచ్చి 1961 నుండి 64 వరకు అప్పటి ప్రసిద్ధ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర ఇద్దరు మిత్రులు, అవార్డు విన్నింగ్ ఫిలిమ్స్ మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. అయితే మధ్యలో 1963 లో ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా చేశారు.

కానీ, ఆయనకు దర్శకులు బాపు, బాలచందర్ గార్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని ఉండేదట. కమల్ హాసన్ గారి ‘ఉత్తమ విలన్’ సినిమా ఈవెంట్ లో కూడా, విశ్వనాథ్ గారు మాట్లాడుతూ, బాలచందర్ గారితో కలిసి పనిచేయాలని అనుకున్నాను, ఆఖరికి ఇప్పుడు కనీసం నటించే అవకాశం వచ్చిందని ఆనందంతో చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడిగా ఆయన ఎంట్రీ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా జరిగింది, విశ్వనాథ్ గారి మొదట అడుగుకి కారణమయ్యారు. డాక్టర్ చక్రవర్తి సినిమా సమయంలో విశ్వనాథ్ గారి సినిమా నైపుణ్యం గమనించి, నచ్చి నాగేశ్వరరావు గారు తన తరువాతి సినిమాలో దర్శకుడిగా అవకాశం ఇస్తాను అని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే, ఆయన సొంత బ్యానర్ అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించే సినిమాకు అవకాశం ఇవ్వగా, 1964 లో నాగేశ్వరరావు గారు హీరోగా  ‘ఆత్మ గౌరవం’ సినిమాకు విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు గారు, ప్రముఖ రచయిత్రి యుద్దనపూడి సులోచనారాణి గారు కథను ఇచ్చారు. ఆ విధంగా మొదటి సినిమా పూర్తయి, దానికి నంది అవార్డు కూడా లభించింది.

ఇక 1967 లో ప్రైవేట్ మాస్టర్ అనే సినిమాకి దర్శకుడిగా చేశారు, అయితే అదే ఏడాది ఆయన మళ్ళీ ‘సుడిగుండాలు’ అనే సినిమాకి రైటర్ గా పనిచేయగా, అది పెద్ద హిట్ అయ్యి ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాకు నేషనల్, స్టేట్ నంది, ఫిలింఫేర్ అవార్డులు లభించాయి, అంతేకాకుండా ఈ సినిమా తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్ కి కూడా సెలెక్ట్ అయ్యింది. దీని తరువాత విశ్వనాథ్ గారు పూర్తిగా దర్శకత్వంలోకి వచ్చేసారు. 1968 నుండి 1979 వరకు 10 ఏళ్లలో 20 సినిమాలు తీయగా, అందులో స్త్రీ పాత్ర ప్రధానంగా వచ్చిన చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కథ, జీవనజ్యోతి, సీతామహాలక్ష్మీ సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాక, నంది, నేషనల్ అంటూ అవార్డుల పంట పండించాయి. అంతేకాకుండా, కాలం మారింది అనే సినిమాతో కుల వివక్ష, అంటారనితనం మీద కొరడా జులిపించారు. అలానే సిరిసిరి మువ్వ సినిమాతో కళలను ఉద్దేశిస్తూ తీయగా, అందులో కళాత్మక దర్శకత్వాన్ని ప్రతిబింబించారు. ఆ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమయ్యింది.

ఇక 1979 లో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమా ఆయన జీవితాన్నే మార్చేసింది. పాశ్చాత్య సంగీతానికి అలవాటు పడుతున్న రోజుల్లో కర్నాటిక్ సంగీతం ప్రాముఖ్యత తెలుపుతూ, ఈ సినిమాతో శాస్త్రీయ సంగీతానికి కొత్త రెక్కలు తొడిగారనడంలో అతిశయోక్తి ఉండదేమో! ఆ సినిమా భారీ హిట్ గా నిలిచి, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, మాస్కో ఫిలిం ఫెస్టివల్, ఆసియా పసిఫిక్ ఫిలిం ఫెస్టివల్, తశ్కెంట్ ఫీల్ ఫెస్టివల్, అన్నపూర్ణ ఫిలిం అండ్ మీడియా ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. అలానే ‘బేసన్వికాన్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఫ్రాన్స్’ లో ‘ప్రైజ్ ఆఫ్ ది పబ్లిక్’ అవార్డుని గెలుచుకుంది. ఇక దక్షిణ భారతదేశం నుండి బెస్ట్ పాపులర్ ఫిలిం కేటగిరిలో నిలిచినా మొట్టమొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు 4 నేషనల్ అవార్డులు, 7 నంది అవార్డులు, ఒక ఫిలింఫేర్ అవార్డు లభించింది అంటే, ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉండి ఉండాలి! అలానే చాలా థియేటర్స్ లో ఖాళీగా మొదలైన షోలు, పోను పోను హౌస్ ఫుల్ గా మారి, సినిమా చాలా థియేటర్స్ లో వందల రోజులు ఆడి, ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినీ చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పవచ్చు, అలానే మాయాబజార్ తరువాత అంత గొప్పటి చిత్రం ఇదేనని కొందరు సినీ విశ్లేషకులు సైతం కితాబిచ్చారు. అన్నింటికీ మించి, శంకరాభరణం భారతీయ సినీ చరిత్రలో ఆల్ టైం టాప్ 100 సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ ఒక్క సినిమాతో విశ్వనాథ్ గారి కెరీర్ రెండుగా చీలి, శంకరాభరణం ముందు, వెనుక అన్నట్టు మారింది.

ఆ తరువాత ఆయన తీసిన చాలా సినిమాలు కళలతో ముడిపడి, మరింత కళాత్మకంగా మారాయి, అందుకే ఆయన కళాతపస్విగా పేరుగాంచారు. ఆ తరువాత వచ్చిన సప్తపది, శుభలేఖ, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వరణకమలం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం, స్వరాభిషేకం వంటి సినిమాలలో కొన్ని కళల గురించి, మరికొన్ని సమాజ స్థితిగతుల గురించి, మరికొన్ని మానిషి జీవనశైలికి అద్దం పట్టేవిగా ఉంటాయి. అయితే ఆయన సినిమాల్లో సగం సినిమాలకు పై వాటికి ఎన్నో రకాల అవార్డులు లభించాయి. ఆయన తీసిన సినిమాల్లో కొన్ని రష్యన్ బాషలోకి దుబ్ చేయడం జరిగింది, అలానే మాస్కో, ఇండియన్, ఆసియా అంటూ పలు ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడ్డాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా సాగర సంగమం. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనంగా మారింది. ఒక పూర్తి జీవితం ఇందులో కనబడుతుంది. అన్ని  సినిమాల్లానే ఎన్నో ప్రశంసలు, పలు సత్కారాలు అందుకున్న ‘సాగరసంగమం’, 59వ ఆస్కార్ అవార్డ్స్ కు బెస్ట్ ఫారెన్ సినిమా కేటగిరిలో ఇండియా నుండి అధికారికంగా ఎంపికయ్యి చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా, ఆల్ టైం ఇండియన్ టాప్ 100 మూవీస్ లో ఒకటిగా నిలిచింది. విశ్వనాథ్ గారు 1997 తరువాత 7 ఏళ్ళు గ్యాప్ తీసుకొని 2004 లో స్వరాభిషేకం సినిమా తీశారు, ఆ సినిమా కూడా నేషనల్ అవార్డు గెలుచుకుంది. దాని తరువాత మళ్ళీ 6 ఏళ్ళు గ్యాప్ తీసుకొని అల్లరి నరేష్ గారు హీరోగా శుభప్రదం సినిమా తీశారు, ప్రస్తుతానికి అదే ఆయన ఆఖరి సినిమా. ఆ విధంగా తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఆయన 51 సినిమాలను డైరెక్ట్ చేశారు.

ఇక 1979 లోనే ఆయన మొదటి హిందీ సినిమా తీశారు. ఆయన తీసిన సిరిసిరి మువ్వ సినిమానే హిందీలో రీమేక్ చేశారు. ఆ విధంగా హిందీలో కూడా వరుసగా సర్గన్, కామ్ చోర్, శుభ్ కామ్నా వంటి సినిమాలు చేశారు, పైగా అవన్నీ ఆయన తెలుగు తీసినవాటి రీమేక్స్. అయితే 1992 లో తీసిన సంగీత్, 1993 లో ధన్వాన్, 1993 లో ఔరత్ ఔరత్ ఔరత్ సినిమాలు నేరుగా హిందీలో తీసినవే. ఆ విధంగా ఆయన హిందీలో 10 సినిమాలు తీయడం జరిగింది.

అయితే విశ్వనాథ్ గారు దర్శకత్వంతోనే కాక, నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించారు. కలిసుందాం రా, నరసింహనాయుడు, సంతోషం, స్వరాభిషేఖం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలు ఆయన మార్క్ నటనతో అందరినీ అలరించారు. 1995 లో మొదటిసారి ‘శుభసంకల్పం’ సినిమాలో నటించగా, ఆఖరిగా 2018 లో సొల్లివిడవ అనే తమిళ్ సినిమాలో నటించారు. ఆ విధంగా అయన మొత్తం 29 సినిమాల్లో నటించారు.

ఇక ఆయన సినీ ప్రస్థానంలో ‘పూర్ణోదయా మూవీ క్రియేషన్స్’ ఆయనికి అనుబంధం ఎక్కువ. ఆ బ్యానర్ ఓనర్ ఏడిద నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారిని కళాత్మక సినిమాలు తీయడానికి ఎంతగానో ప్రోత్సహించారు. ట్రెండ్ కి తగ్గట్టుగా ఉండకపోయినా శంకరాభరణం సినిమాను నిర్మించడానికి ఒప్పుకొని సాహసం చేశారు, తరువాత ఆ కోవలో వచ్చిన స్వాతిముత్యం, సాగరసంగమం, సూత్రధారులు లాంటి సినిమాలను ఆ బ్యానర్ లో నిర్మించడం జరిగింది, అవి సూపర్ హిట్ అయ్యాయి కూడా. ఇక విశ్వనాథ్ గారికి హీరోలందరితోటి మంచి సాన్నిహిత్యం ఉంది. అన్ని దక్షిణలోని చిరంజీవి, మమ్ముట్టి, కమల్ హాసన్, వెంకటేష్, బాలకృష్ణ వంటి టాప్ హీరోలను ఆయన డైరెక్ట్ చేశారు. కమల్ హాసన్ గారితో మూడు సినిమాలు, వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశార. చిరంజీవి గారితో ఆయన శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు సినిమాలు చేయగా, వారి ఇద్దరి మధ్య గురుశిష్యుల సంబంధం ఎక్కువ. చిరంజీవి గారు ఆయన్ను గాడ్ ఫాదర్ గా భావిస్తారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా విశ్వనాథ్ గారి గురించి మాట్లాడుతూ, ఆయన మళ్ళీ దర్శకత్వం వహిస్తే తాను సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు అన్నారు. విశ్వనాథ్ గారికి మోకాలి ఆపరేషన్ చేసుకునే అవసరం ఉన్నా, తనకి హాస్పిటల్ అంటే పడదు అని, అందుకే ఆయన సినిమాల్లో హాస్పిటల్ సీన్స్ కూడా ఎక్కువగా ఉండవని అంటారు.

విశ్వనాథ్ గారి జీవితంలో ఎలాంటి వివాదాలు లేవు గానీ, ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా ప్రమోషన్స్ సమయంలో కులం గురించి మాట్లాడేటప్పుడు రాంగోపాల్ వర్మ గారు, విశ్వనాథ్ గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజం, కుల వివక్ష లాంటి సామజిక అసమానతల పై సినిమాలు తీసే విశ్వనాథ్ గారు కూడా పక్కన వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి, షర్ట్ లోపల జంధ్యం ఉందొ లేదో చూస్తారని, ఆయనకు అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉందని ఒకరు తనకి చెప్పారని రాంగోపాల్ వర్మ అన్నారు. అలానే, శ్రీరెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కే.విశ్వనాథ్ గారు ఉన్నప్పుడు బ్రాహ్మణ ఫీలింగ్ ఏ విధంగా ఉండేదో కథలుకథలుగా చెప్తారని ఆమె సంచలనం వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఇక ఆయనకు దక్కిన పురస్కారాల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. 1992 లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతోనూ, 2017 లో సినిమా రంగంలో ప్రతిష్టాత్మక అవార్డు అయిన దాదాసాహెబ్ ఫాల్కేతోనూ గౌరవించింది. 1992 లో ఆంధ్ర ప్రభుత్వం తెలుగు సినిమాలో ప్రతిష్టాత్మకమైనదైన రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. 1981 లో బేసన్కాన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఫ్రాన్స్ లో ప్రైజ్ ఆఫ్ ది పబ్లిక్ దక్కింది. 1982-87 వరకు ఆయన సినిమాలు మాస్కో ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శించబడగా, ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇక సినీ జీవితంలో కళలకు ఆయన సేవలకు గాను, 2012 లో చిత్తూర్ వి.నాగయ్య, 2017 లో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్-హైదరాబాద్, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్, 1994 లో ఫిలింఫేర్, 2008 లో సినీ-మా అవార్డ్స్, 2021 లో సైమా అవార్డ్స్ నుండి జీవిత సాఫల్య పురస్కారాలు లభించాయి. ఇక 2017 లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆత్మీయ సన్మానం చేసింది. 2012 లో ఆయనకు విశ్వవిఖ్యాత దర్శక సార్వభౌమ బిరుదు కూడా ఒక సన్మానంలో ఇచ్చారు. అలానే పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆయన్ను గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.

ఆయనకు 1988 లో స్వర్ణకమలం సినిమాకు గాను, బెస్ట్ డైరెక్టర్ గా సినిమా ఎక్సప్రెస్ లభించింది. 1989 లో ఈశ్వర్ అనే హిందీ సినిమాకు ఫిలింఫేర్ బెస్ట్ స్టోరీ అవార్డు దక్కింది. ఇక బెస్ట్ డైరెక్టర్ గా, 1974 లో ఓ సీత కథ, 75 లో జీవనజ్యోతి, 82 లో శుభలేఖ, 83 లో సాగరసంగమం, 86 లో స్వాతిముత్యం, 87 లో శ్రుతిలయలు, 92 లో ఆపద్బాంధవుడు, 95 లో శుభసంకల్పం సినిమాలకు గాను ఫిలింఫేర్ సౌత్ అవార్డులు అందుకున్నారు. అలానే, బెస్ట్ స్టోరీ రైటర్ గా, 1980 లో శంకరాభరణం, 82 లో శుభలేఖ సినిమాలకు, 81 లో స్క్రీన్ ప్లే రైటర్ గా సప్తపది సినిమాకు, బెస్ట్ డైరెక్టర్ గా 86 లో స్వాతిముత్యం, 87 లో శ్రుతిలయలు సినిమాలకు, ని తనకు గాను 95 లో శుభసంకల్పం, 2000 లో కలిసుందాంరా సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు. ఇక ఆయన తీసిన శంకరాభరణంకు 1980 బెస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా నేషనల్ అవార్డు రాగా, సప్తపదికి 82 లో నేషనల్ ఇంటిగ్రేషన్ మీద బెస్ట్ ఫిలింగా నర్గిస్ దత్త్ అవార్డు దక్కాయి. అలానే, 1987 లో స్వాతిముత్యం, 90 లో సూత్రధారులు, 2005 లో స్వరాభిషేఖం సినిమాలకు బెస్ట్ ఫిలిం ఇన్ తెలుగు కేటగిరీలో నేషనల్ అవార్డ్స్ లభించాయి.

ఈ రకంగా కాశీనాధుని విశ్వనాథ్ గారు కళల పట్ల ఇష్టంతో, మనకి ఎప్పటికీ గుర్తిండిపోయే, చరిత్రలో నిలిచిపోయే సినిమాలను అందించారు. అయితే కళాత్మక సినిమా నిర్మించడంలో ఆయన స్థాయి అందుకోవడం అసాధ్యమనే అనాలి. అలా ఎందరో దర్శకులకు ఆదర్శంగా నిలిచిన ఆయన, ఎప్పటిలానే ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు.

Leave your vote

More

Previous articleMP రామ్మోహన్ నాయుడు బయోగ్రఫీ | MP Rammohan Naidu Biography
Next articleవల్లభనేని వంశీ బయోగ్రఫీ | Vallabhaneni Vamsi Biography in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here