కాకినాడలో ఆయన పేరు తెలియనివారు లేరు, రాజకీయాల్లో చలాకీ స్వభావంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రస్తుత నాయకుల్లో తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకున్న వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ధైర్యంగా మాట్లాడే తత్వం గల చంద్రశేఖర్ రెడ్డి జీవితంలో ఆసక్తికర విషయాలు, ఆయన రాజకీయ చరిత్ర గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 1967 లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భాస్కర్ రెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించారు. ఆయనకు వీరభద్రారెడ్డి అనే తమ్ముడు కూడా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారి భార్య పేరు మహాలక్ష్మి, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్ గారు కాకినాడలోని ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో ఇంటర్మీడియట్, తరువాత బీకామ్ పూర్తి చేశారు. ఆయన రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టక ముందు కొన్ని వ్యాపారాలు కూడా చేశారు.
ఇక చంద్రశేఖర్ గారి రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే, ఆయన కాలేజీ రోజుల నుండే ప్రజాసేవ పైన, రాజకీయ విషయాల పైన ఆసక్తి ఉండేది. తనకున్న ఆసక్తితో 1982-83 లో తాను చదువుకున్న ఐడియల్ కాలేజీలో స్టూడెంట్ యూనియన్ జాయింట్ సెక్రటరీగా, అలానే 83-84 లో అదే స్టూడెంట్ యూనియన్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యి, అప్పటి నుండే నాయకత్వ లక్షణాలను కనబరిచేవారు. ఆ తరువాత రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1988 లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు స్టేట్ యూత్ కాంగ్రెస్ కి జాయింట్ సెక్రెటరీగా బాధ్యతలు అప్పగించింది, దానితో పార్టీలో ఆయనకంటూ ఒక గుర్తింపు లభించింది. ఆ విధంగా ఆయన, కాంగ్రెస్ పార్టీతోనే కలిసి పనిచేశారు. పార్టీ వ్యవహారాల్లో ఆయన చురుకుదనం, ఆయన చేసిన వివిధ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర కాంగ్రెస్ ఆయన్ను 2005 లో ఏపీ హోసింగ్ బోర్డు డైరెక్టర్ గా నియమించింది. అదేవిధంగా 2000-2006 వరకు కాకినాడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఇక అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారి పనితీరును, కాకినాడ ప్రజల్లో ఆయనకి ఉన్న మద్దతును గమనించి, చంద్రశేఖర్ గారికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ, మొదటిసారి శాసనసభ సభ్యుడిగా తన సొంత నియోజవర్గంలోనే విజయం సాధించారు. అయితే ఆ తరువాత రాజశేఖర్ రెడ్డిగారి మీద అభిమానం, జగన్ మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక 2014 శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకినాడ సిటీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కానీ మళ్ళీ 2019 శాసనసభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి 14 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఇక వివాదాల విషయానికి వస్తే, 2009 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిటీలోని సోమయాజులు వీధిలో అప్పట్లో తను నిర్మిస్తున్న ఒక కమర్షియల్ బిల్డింగ్ కి ఎదురుగా పార్కింగ్ సౌలభ్యం కోసం, సిటీ కార్పొరేషన్ నిధులు ఖర్చుపెట్టి, అప్పటికే ఉన్న సిమెంట్ రోడ్ ను విస్తరించే పనులు చేపట్టారని, కాకినాడలో విస్తరించాల్సిన రోడ్లు ఎన్నో ఉన్నా, ఇలా తన సొంత ప్రయోజనాల కోసం నిధులు వృథా చేస్తున్నారని అప్పట్లో కొందరు ఆయన్ను విమర్శించడం జరిగింది.
ఈ విధంగానే ఆయన కుటుంబం అనపర్తిలో దొంగనోట్ల ముద్రించేదని, కాకినాడలో పలు అసాంఘిక చర్యల కోసం రౌడీ మూకను పెంచి పోషిస్తున్నారని, భాస్కర్ బిల్డింగ్ కంప్లెక్స్ లో పేకాట క్లబ్ నడుపుతూ యువతను చెడకొడుతున్నారని, ఒక మంత్రి మీద గన్ పెట్టి బెదిరించారని, ప్రభుత్వ ఉద్యోగులను కిడ్నప్ చేసిన తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకోవడం లాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారని ఏడాది క్రితం టీడీపీ నాయకురాలు అనురాధ ఒక మీడియా మీట్ లో చంద్రశేఖర్ రెడ్డి నేర చరిత్ర అని చెప్పుకొచ్చారు.
అలానే టీడీపీకి చెందిన కాకినాడ మేయర్ పావని గారు తనకి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నుండి ప్రాణహాని ఉందని, భయంకరమైన వాతావరణంలో ఉన్నామని, రక్షణ కల్పించాలని కాకినాడ ఎస్పీకి నెల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది, ఇది అప్పుడు కొంత వార్తల్లో నిలిచింది.
ఇక ఇటీవల ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, టీడీపీ నేతలను కొన్ని అసభ్యకర మాటలు మాట్లాడటంతో మీడియాలో నిలిచారు. అదేవిధంగా, టీడీపీ నేత పట్టాభి గారిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చంపే ప్రయత్నం చేస్తున్నారని, ఆ హత్యను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద మోపేందుకు కుట్ర పన్నుతున్నారని, పట్టాభి గారిని, అతని కుటుంబాన్ని జాగ్రత్తగా ఉండమని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అలానే చంద్రబాబు గారు ఇటీవల మీడియా ముందు ఏడవడంతో, తల్లిదండ్రులు, మామ చనిపోయినప్పుడు ఏడవని వ్యక్తి ఇప్పుడు ఏడవడం సానుభూతి చర్య అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా మీడియాలో హల్చల్ చేశాయి.
అయితే రెండోసారి కాకినాడగా గెలిచిన చంద్రశేఖర్ గారు, రాజకీయాలే కాకుండా సేవా సంస్థల పేరు మీద, వివిధ మార్గాల్లో పేదవారికి, పిల్లల చదువులకు సహాయాన్ని అందిస్తూ, పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు.
ఆ విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి జీవితంలో గెలుపోటములు ఉన్నాయి, ప్రశంసలు, విమర్శలు కూడా ఉన్నాయి, ఆయన్ను ద్వేషించేవారు ఉన్నారు, అలానే మిన్నగా ప్రేమించే అభిమానులూ ఉన్నారు.