Gautam Shantilal Adani is an Indian billionaire businessman, who is the chairman and founder of the Adani Group, an
గౌతమ్ అదానీ బయోగ్రఫీ
గౌతమ్ అదానీ.. గడచిన ఆరు ఏడు ఏళ్లుగా ఈ పేరు ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మారు మ్రోగి పోతుంది. కేవలం ఎనిమిది అంటే ఎనిమిది ఏళ్లలో అదానీ గ్రూప్ ఆదాయం దాదాపుగా ఆరు లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది.. అంతే కాకుండా అత్యంత స్పీడ్ గా ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అదానీ పేరు సంపాదించాడు. ప్రపంచంలో ఏ ఒక్క వ్యాపారవేత్త కూడా ఇంత ఓవర్ నైట్ లో లక్షల కోట్లు సంపాదించలేదని.. అదానీకే ఎలా సాధ్యం అయ్యిందని కొందరు ప్రశ్నిస్తే మరి కొందరు మాత్రం ఆయన పట్టుదల.. విజన్.. ఎందులో వ్యాపారం చేస్తే లాభాలు దక్కించుకోవచ్చు అనే విషయాలను తెలిసిన వ్యక్తి కనుక గౌతమ్ అదానీ ఈ రోజును ఆసియా ఖండంలోనే అత్యధిక సంపాదన ఉన్న రెండవ బిలియనీర్ గా పేరు దక్కించుకున్నాడని అంటూ ఉంటారు. మరి కొందరు మాత్రం వడ్డించే వాడు మనవాడు అయితే ఇస్తరి ఖాళీగా ఎందుకు ఉంటుంది అన్నట్లుగా దేశ ప్రధాని మోడీ ఆయన స్నేహితుడు అయినప్పుడు ఈ లక్షల కోట్ల ఆదాయం దక్కడం పెద్ద చోద్యం కాదు అనేది మరి కొందరి వాదన. ఎవరు ఏం అన్నా కూడా అదానీ ఇప్పుడు కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించారు.. పరోక్షంగా కోట్ల మందికి ఉపాదిని కల్పిస్తున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అదానీ గ్రూప్ కార్యకళాపాలు ఉన్నాయి అంటే ఆయన అకుంటిత దీక్ష మరియు పట్టుదలకు నిదర్శణం అనడంలో సందేహం లేదు. అదానీ సంపాదన కేవలం మోడీ వల్లే అంటూ కొందరు విమర్శించినా, రెండు సార్లు చావును దగ్గర నుండి చూసి, వ్యాపారంలో నష్టాలు చవి చూసి, లక్షన్నర కోట్ల అప్పు చేసి, గాలి నిప్పు నీరు ఆకాశం భూమి ఇలా పంచభూతాలతో వ్యాపారం చేస్తున్న అదానీ గురించిన మరిన్ని విషయాలను ఈ వీడియో లో చూద్దాం.
అదానీ పూర్తి పేరు గౌతమ్ శాంతీలాల్ అదానీ. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అదానీ 1962 జూన్ 24న శాంతిలాల్ మరియు శాంతి లకు జన్మించారు. అదానీకి ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు. అదానీ తండరి గారు శాంతిలాల్ అహ్మదాబాద్ లో చిన్న బట్టల వ్యాపారిగా జీవనం సాగించే వారు. శాంతిలాల్ కుటుంబం ఒక మద్య తరగతి కుటుంబంగా జీవనం సాగించేది. 1980 వరకు కూడా అదానీ కుటుంబం మద్యతరగతి జీవనాన్నే సాగించడం అందరికి తెల్సిందే. అదానీ కామర్స్ లో డిగ్రీ చదవడం కోసం గుజరాత్ యూనివర్శిటీలో అప్పట్లో చేరాడు. కాని చదువు తలకు ఎక్కక పోవడంతో రెండవ ఏడాది డిగ్రీ లోనే కాలేజ్ మానేశాడు. కాలేజీ మానేసిన సమయంలో ఏదో ఒక ఉద్యోగం కాని.. ఏదో చిన్న తండ్రి చేసే తరహా వ్యాపారం చేయాలని అదానీ భావించలేదు. అప్పుడప్పుడే భారత దేశ ఆర్థిక రాజధానిగా ముంబయి విస్తరిస్తుంది. ఆ సమయంలో అదానీ వంద రూపాయలు చేతిలో పట్టుకుని ముంబయి వెళ్లి పోయాడు. అక్కడ మహీంద్ర బ్రదర్స్ అనే కంపెనీ నిర్వహించే డైమండ్ వ్యాపారంలో ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు, రెండు మూడు సంవత్సరాలు డైమండ్ బిజినెస్ లో మెలకులవలు నేర్చుకుని సొంతంగా డైమండ్ బ్రోకరేసి సంస్థను ఓపెన్ చేసి భారీ మొత్తంలో డబ్బును సంపాదించాడు. ఆ సమయంలోనే తిరిగి అహ్మదాబాద్ కు చేరుకున్నాడు.
అన్నయ్య ప్రారంభించిన ప్లాస్టిక్ యూనిట్ బిజినెస్ వ్యవహారంలో అదానీ తనవంతు సాయం చేయడం మొదలు పెట్టాడు. అలా అహ్మదాబాద్ లో ప్లాస్టిక్ వ్యాపారంగా అదానీ వ్యాపార సామ్రాజ్యం మొదలు అయ్యింది. అదానీ మరియు ఆయన అన్నయ్య చేస్తున్న ప్లాస్టిక్ వ్యాపారం కోసం ప్రతి నెల కూడా 20 టన్నుల పాలి వినైల్ అవసరం అయ్యేది. మొదట్లో దాన్ని ఇండియాలో తయారు చేసే ఏకైక సంస్థ అయిన ఐపీసీఎల్ సంస్థ నుండి కొనుగోలు చేయడం జరిగేది. అయితే ఆ సంస్థ కావాల్సిన మొత్తంను కావాల్సిన సమయంకు సరఫరా చేయలేక పోవడంతో తాను స్వయంగా పాలి వినైల్ ను ఇంపోర్ట్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అప్పుడే అదానీ ఇంపోర్ట్ బిజినెస్ గురించి తెలుసుకున్నాడు. ఇంపోర్ట్ మరియు ఎక్స్ పోర్ట్ లో ఉండే లాభాలను గురించి ఆయన ఆ సమయంలో తెలుసుకుని ఆ రంగంలో దృష్టి పెట్టాడు. 1988 లో అదానీ ఎక్స్ పోర్ట్స్ పేరుతో బిజినెస్ ను మొదలు పెట్టి తక్కువ సమయంలోనే భారీగా లాభాలను దక్కించుకున్నారు. అదానీ ఎక్స్ పోర్ట్స్ కంపెనీని అదానీ ఎంటర్ ప్రైజెస్ గా మార్చి ఎక్స్ పోర్ట్ మరియు ఇంపోర్ట్ బిజినెస్ ను జోరుగా సాగించాడు. విదేశాల నుండి పెట్రోలియం మరియు కెమికల్స్ ను ఇంపోర్ట్ చేయడం మొదలు పెట్టడంతో ఇండియాలోనే అతి పెద్ద ఎక్స్ పోర్ట్ మరియు ఇంపోర్ట్ కంపెనీగా అదానీ ఎంటర్ ప్రైజెస్ నిలిచింది.
ఒక వైపు అదానీ ఎంటర్ ప్రైజెస్ పెద్ద ఎత్తున లాభాలను దక్కించుకుంటున్న సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు 1991 లో సరికొత్త ఆర్థిక విధానాలకు తెర తీశారు. దాంతో ఇండియాలో వ్యాపార రూపు రేఖలు మారిపోయాయి. ఆ సమయాన్ని చాలా మంది వ్యాపారవేత్తలతో పాటు అదానీ కూడా బాగా వినియోగించుకున్నారు. ఆ సమయంలో తన వ్యాపార సామ్రాజ్యంను డబుల్ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు. 1993 లో గుజరాత్ ప్రభుత్వం కచ్ లో ఉన్న ముంద్ర పోర్ట్ ను నడపడం కోసం ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యం కోరింది. గుజరాత్ లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో ముంద్ర పోర్టు ప్రైవేట్ నిర్వహణ కాంట్రాక్ట్ ను గౌతమ్ అదానీ సంస్థ దక్కించుకుంది. అక్కడ అసలైన వ్యాపార విస్తరణ గౌతమ్ అదానీ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇండియాలో అన్నింటి కంటే పెద్ద పోర్టు ఏదీ అంటే ముంద్ర నే పేరు వినిపిస్తుంది. ఇప్పుడు ఆ పోర్ట్ పూర్తిగా అదానీ గ్రూప్ కు చెందిన పోర్ట్. ముంద్ర పోర్ట్ వల్లే గౌతమ్ అదానీ దేశ స్థాయిలో వ్యాపార వేత్తగా గుర్తింపు దక్కించుకున్నారు అంటారు. కొందరు మోడీ వల్లే అదానీకి ఈ పరిస్థితి అని.. మోడీ వల్లే ఆయన వ్యాపార సామ్రాజ్యం పెరిగిందని అంటూ ఉంటారు. కాని ఆశ్చర్యకర విషయం ఏంటీ అంటే అదానీ దక్కించుకున్న అది పెద్ద ప్రాజెక్ట్ ముంద్ర పోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చింది. అందులో మోడీ ప్రమోయం కాని మోడీ సాయం కాని ఏమీ లేదు. మోడీ తో స్నేహం అదానీకి సుదీర్ఘ కాలంగానే ఉంది.
మోడీ గుజరాత్ కు మొదటి సారి సీఎం అయిన సమయంలో అదానీ సంస్థ ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ఖర్చు చేశారనే వాదన ఉంది. అందుకు తగ్గట్లుగానే మోడీ పలు కాంట్రాక్ట్ లను అదానీ గ్రూప్ కు కట్టబెట్టారు. ముఖ్యంగా గుజరాత్ లో మత సంఘర్షణ లు జరిగిన సమయంలో వ్యాపార సామ్రాజ్య అధినేతలు అంతా కూడా మోడీకి వ్యతిరేకం అయ్యారు. కాని అదానీ ఒక్కడో మోడీ వెంట నిలిచాడు. ఆ ఒక్క సమయంలోనే కాకుండా మోడీ ప్రతి అడుగులో కూడా అదానీ నిలిచారు. గుజరాత్ ను వదిలి ఢిల్లీ బాట పట్టి ప్రధానిగా పోటీలో నిలిచిన సమయంలో కూడా మోడీని వెన్నంటి ఉండి ఆయన రాజకీయ ఎదుగుదలో.. ప్రధానిగా అవ్వడంలో అదానీ కీలక భూమిక పోషించారు అనడంలో సందేహం లేదు. అంత చేసిన అదానీకి మోడీ ఏం చేయకుంటా ఉంటాడా.. కావాల్సింది తీసుకో మిత్రమా అంటూ ఎన్నో దారాదత్తం చేశారు. కొన్ని వేల ఎకరాల భూములను పరిశ్రమల నిర్మాణం కోసం ఉచితంగా ఇవ్వడంతో పాటు నిబంధనలకు ఎన్నో చోట్ల పాతర వేసి కొత్త నిబంధనలు సృష్టించి మరీ మిత్రుడు అదానీకి ప్రధాని సాయంగా నిలిచారు అనేది కొందరి చేసే విమర్శ. అదానీ గ్రూప్ షేర్ హోల్డర్స్ ఆదాయం అయిదు సంవత్సరాల్లో 1500 రెట్లు పెరిగింది. ప్రపంచంలో అంత తక్కువ సమంయంలో అంత ఎక్కువగా ఆదాయం పెరగడం ఎక్కడ జరగలేదు.
ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నంత కాలం మాత్రమే కాకుండా తర్వాత కూడా తన ప్రభావం ఉండాలనే ఉద్దేశ్యంతో అదానీ సంస్థ పక్కాగా ఒప్పందాలు ఒకటి కాదు పది కాదు ఏకంగా యాబై ఏళ్లకు చేయించుకుంది. మరో ప్రభుత్వం మారినా.. మరే ప్రధాని వచ్చినా కూడా అదానీ గ్రూప్ కు కట్టబెట్టిన కాంట్రాక్ట్ లను కదిలించలేని పరిస్థితిలో అదానీ నిలిచారు. సోషల్ మీడియాలో ఉన్న ఒక టాక్ ప్రకారం మోడీ ప్రధానిగా రెండవ సారి టర్మ్ పూర్తి అయ్యేప్పటికి అదానీ ఖచ్చితంగా ముఖేష్ అంబానీ ని మించి ఇండియాలో.. ఆసియాలో నెం.1 కుభేరుడిగా నిలుస్తాడు.. ప్రధానిగా మోడీ మూడవ సారి అధికారం దక్కించుకుంటే ఆ అయిదు ఏళ్లలో అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నెం.1 గా నిలుస్తాడు అని టాక్ ఉంది. నిజంగానే మోడీ మరోసారి ప్రధాని అయితే ఖచ్చితంగా అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నెం.1 స్థానంలో ఉండటం ఖాయం కావచ్చు అంటున్నారు. అదానీ వ్యాపార సామ్రాజ్యంను ఎలా విస్తరించారు.. ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు… ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు అనేది పక్కన పెడితే ఆయన ప్రపంచంలోనే గొప్ప వ్యాపారవేత్త అంటారు. ఆయనకు అదృష్టం అలా కలిసి వస్తుంది. అదానీ వ్యాపారంలో అభివృద్ది చెందుతున్న సమయంలో కొందరు దుండగులు ఆయన్ను పట్టుకుని కిడ్నాప్ చేశారు.
డబ్బు డిమాండ్ చేసిన వారు మనసు మార్చుకుని డబ్బు తీసుకోకుండానే వదిలి వేశారు. ఆ తర్వాత ఉగ్రవాదులు తాజ్ పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన సమయంలో అదానీ అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో బతుకు పై అతడు పూర్తిగా ఆశను వదులుకున్నాడట. అలాంటి పరిస్థితి నుండి తిరిగి ఉన్నత శిఖరం మాదిరిగా నిలిచిన వ్యక్తి అదానీ. దేశంలోనే సహజ వనరులను నాశనం చేస్తున్నాడని అదానీపై కొన్ని వేల మంది ప్రతి రోజు రోడ్ల మీద వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అయినా కూడా అవేమి పట్టించుకోకుండా అదానీ తన వ్యాపారాన్ని వారంకు ఒక కొస్త సంస్థ చొప్పున పెంచుకుంటూ పోతున్నాడు. అదానీకి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వారు అదానీ గ్రూప్ లో కొత్త బిజినెస్ లను నిర్వహించే విభాగంలో పని చేస్తున్నారు. దేశంలోని కొన్ని వేల మంది స్టార్టప్ కంపెనీలకు అదానీ ఛారిటీ సంస్థ సాయంగా నిలుస్తుంది. ఇక దేశంలో వేలాది మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తుంది. అలాగే కరోనా సమయంలో అంతకు ముందు ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో అదానీ వందలు వేల కోట్ల రూపాయలను ఛారిటీగా ఇవ్వడం జరిగింది. అదానీ దేశం నుండి దోచుకున్న లక్ష రూపాయలో పది రూపాయలు సాయం చేసి గొప్పగా చెప్పుకుంటున్నాడని విమర్శలు ఉన్నా కూడా ఆయన దేశానికి ఆదర్శం అంటూ ఆయన అభిమానులు చాటి చెప్తూనే ఉంటారు.