సుదీప్ సంజీవ్ అనే పేరుతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, నటనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, కన్నడ సినిమా ఇండస్ట్రీ గర్వించే నటుడిగా ఎదిగి, కోట్ల మంది అభిమానులను సంపాదించుకొని, అన్ని భాషల్లోనూ తనదైన నటనా శైలితో సినీ ప్రేక్షకులను ముగ్ధుల్ని చేస్తున్నారు. ఆయనే ‘కింగ్ ఆఫ్ కన్నడ సినిమా’గా పిలవబడే కిచ్చా సుదీప్. 25 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఎన్నో అనుభవాలు, ప్రేక్షకులకు ఇచ్చిన మరెన్నో జ్ఞాపకాలు, వాటన్నింటి గురించి, సాధించిన విజయాల గురించి, ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం.
సుదీప్ గారు 1973లో సెప్టెంబర్ 2న, కర్ణాటకలోని శివమొగ్గ అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన తల్లి పేరు సరోజ, తండ్రి పేరు సరోవర్ సంజీవ్ మనజప్ప, ఆయనొక వ్యాపారవేత్త. సుదీప్ కి ఒక అక్క ఉన్నారు, ఆమె పేరు సుజాత. సుదీప్ బెంగళూరులోని దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ‘ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్’ చదివారు.
ఇక ఆయన ప్రేమ, పెళ్లి విషయానికొస్తే, ఆయన 2000 సంవత్సరంలో సినిమాల కోసం ట్రై చేస్తూ, ఇంకా బాగా నటించడం కోసం ఒక డ్రామా కంపెనీలో చేరారు. అక్కడే మొదటి సారి ఆయన, ప్రియని చూసారు. ఆమెను ఇంప్రెస్స్ చేయడానికి సుదీప్ గిటార్ కూడా ప్లే చేసేవారట. అలా అక్కడ పరిచయమై, తరువాత ప్రేమికులైన వారిద్దరూ 2001 లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారికి 2004 లో ఒక అమ్మాయి పుట్టింది, తన పేరు శాన్వి సుదీప్.
ప్రియ గారు మొదట ఎయిర్ లైన్ కంపెనీలోనో, తరువాత బ్యాంకు లోనూ పనిచేసేవారు. అయితే 2004 లో ఆయన నిర్మాతగా మారి తీసిన ‘నల్ల’ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువై ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు, ఆమె జీతం డబ్బు ఇచ్చి అండగా ఉండగా, ఆయన అక్క సుజాత కూడా ఆమె బంగారం అమ్మి సహాయం చేశారు. ఇక 2013 లో సుదీప్ గారు స్టార్ట్ చేసిన ‘స్టేజ్ 360 డిగ్రీస్’ అనే ఈవెంట్ మానెజ్మెంట్ కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతలు ఆయన భార్య ప్రియ గారే చూసుకునేవారు. అయితే 2015 లో సుదీప్ దంపతులు కొన్ని వ్యక్తిగత కారణం చేత విడిపోవడానికి సిద్ధపడి, ఫామిలీ కోర్టులో డివోర్స్ కి అప్లై చేశారు. అప్పటి నుండి రెండేళ్ల పాటు వాళ్లిద్దరూ విడివిడిగా ఉన్నారు. అయితే 2017 లో తమ కూతురు బర్త్ డే పార్టీలో కలిసిన వాళ్లిద్దరూ, తమ కూతురి కోసం మళ్ళీ కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫామిలీ కోర్టులో వేసిన డివోర్స్ పిటిషన్ ని కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఆ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకొని, 14 ఏళ్ళ తరువాత విడిపోయి, రెండేళ్లకే మళ్ళీ కలిసిపోయి ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు.
ఇక సుదీప్ గారి యాక్టింగ్ కెరీర్ కి వస్తే, మొదట్లో ఆయన తనకున్న సిగ్గు, బిడియం పోగొట్టుకోవడానికి ముంబైలోని రోషన్ తానేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్ లో చేరారు. ఆయనకి మొట్టమొదటగా 1996 లో ‘ప్రేమదా కాదంబరి’ అనే సీరియల్ లో నటించే అవకాశం దక్కింది. దాని తరువాత 1997 లో మొదటి సినిమా అవకాశం ‘తయవ్వ’ అనే సినిమా ద్వారా వచ్చింది. ఒక రెండు సినిమాలలో నలుగురిలో ఒకడిగా నటించిన ఆయనకు, 2000 లో ‘స్పర్శ’ సినిమాలో సోలో హీరోగా ఛాన్స్ లభించింది. అయితే ఆ తరువాత ఏడాదే 2001 లో ‘హుచ్చా’లో హీరోగా నటించి, తన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను సైతం మెప్పించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ‘కిచ్చా’ అనే పాత్ర పోషించగా, అదే ఆయన స్క్రీన్ టైటిల్ గా మారింది. ఇక అక్కడ నుండి అయన వెనక్కి తిరిగి చూసుకోలేదు, వరుస హిట్స్ తో దూసుకుపోయారు.
సుదీప్ గారు ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 53 సినిమాల్లో నటించగా, 54వ సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగా, మరో సినిమా నిర్మాణ దశలో ఉంది. అంతేకాకుండా అన్ని భాషల్లో కలిపి 14 సినిమాల్లో కేమియో అపియరెన్స్ కూడా ఇచ్చారు. అయితే ఆయన నటించడమే కాకుండా తన మిగతా టాలెంట్స్ కూడా తరచూ కనబరుస్తుంటారు. ఆయన ఇప్పటి వరకు 19 పాటలు పాడారు; డైరెక్టర్ & రైటర్ గా 6 సినిమాలు చేశారు, అందులో 4 సినిమాలను ‘కిచ్చా క్రియేషన్స్’ బ్యానర్ పై ఆయనే ప్రొడ్యూసర్ గా నిర్మించారు. అలానే ఒక షార్ట్ ఫిలింకి, 9 సినిమాలకు నరేటర్ గా వాయిస్ ఓవర్ అందించారు. ఆయన మొట్టమొదటి హిందీ సినిమా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలోని ‘ఫూన్క్’. దాని తరువాత ఆయన దర్శకత్వంలోనే ‘రణ్’, ‘ఫూన్క్-2’ లో నటించి, ‘రక్తచరిత్ర’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తరువాత ‘ఈగ’ సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యారు. ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళ్ భాషల్లో తీయడంతో అదే ఆయన మొదటి తమిళ్ సినిమా కూడా అయ్యింది.
అదేవిధంగా టీవీ తెర మీద కూడా ఆయన ముద్ర వేశారు. ‘ప్యాటే హుడ్గిర్ హల్లి లైఫు’ సీజన్-1 లో మెంటర్ గా వ్యవహరించారు. అలానే బిగ్ బాస్ కన్నడ వెర్షన్ కి 8 సీజన్స్ కు కాంట్రాక్టు రాసుకోగా, 2013 నుండి బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక ఆయన నటనకు దక్కిన సత్కారాల విషయానికొస్తే, 2001 లో ‘హుచ్చా’, 2002 లో ‘నాంది’, 2003 లో ‘స్వాతి ముత్తు’ సినిమాలకు గాను, వరుసగా మూడేళ్లపాటు కన్నడంలో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అలానే ‘నాంది’ సినిమాకి కర్ణాటక స్టేట్ అవార్డు లభించింది. 2012 లో ‘ఈగ’ సినిమాకి గాను ఉత్తమ విలన్ గా ఫిలింఫేర్ అవార్డు, టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిలిం ఫెస్టివల్ లో మరో అవార్డు దక్కించుకున్నారు.
సుదీప్ గారు బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 2012, 2014, 2015 లలో మొదటి స్థానంలో, 2013 లో 2వ స్థానంలోనూ నిలిచారు. దాని తరువాత ‘ఫరెవర్ డిజైరబుల్’ గా నిలిచినా మొదటి కన్నడ హీరోగా నిలిచారు. దాని కారణంగా 2016 నుండి ఆయన్ని లిస్ట్ లో పెట్టరు. 2012 లో ‘కర్ణాటక రక్షణ వేదికే’ ఆయనకు ‘అభినయ చక్రవర్తి’ అనే టైటిల్ ఇచ్చారు. 2013 లో ఫోర్బ్స్ ఇండియా మాగజైన్ లో ‘టాప్ 100 సెలెబ్రెటీస్ ఆఫ్ ఇండియా’ లిస్ట్ లో ఆయన 22వ స్థానంలో నిలబడ్డారు. 2016 లో అవుట్ లుక్ సోషల్ మీడియా అవార్డ్స్ లో ‘మూవ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచారు.
ఆయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన కాలేజ్ డేస్ లో కూడా అండర్-17 క్రికెట్ ఆడేవారు. అదేవిధంగా వివిధ ఇండస్ట్రీస్ తలబడే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఆయన ‘కర్ణాటక బుల్డోజర్స్’కి కెప్టెన్ గా వ్యవహరించారు, 2014 లో సీసీఎల్ ట్రోఫీ కూడా గెలిచారు.
సుదీప్ గారు ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. 2012 లో జాయాలుక్కాస్ కి బ్రాండ్ అంబాసడర్ గా, 2014 లో ఇంటెక్స్ టెక్నాలజీస్ మొబైల్స్ ఇండియాకి బ్రాండ్ అంబాసడర్ గా, పారాగన్ ఫుట్ వేర్ కి బ్రాండ్ అంబాసడర్ గా, 2015 లో కన్నడ భాషలో ఓఎల్ఎక్స్ యాడ్స్ కి సైన్ చేశారు. 2013 లో బెంగళూరు టాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించారు. అదే 2013 లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన ‘టీచ్ ఎయిడ్స్’ ఇంటరాక్టీవ్ సాఫ్ట్వేర్ కి కొంతంది ఇతర నటులతో కలిసి వాయిస్ ఓవర్ కూడా అందించారు.
ఆయన జీవితంలో జరిగిన వివాదాలు జరుగగా, వాటి విషయానికొస్తే, కన్నడ ఇండస్ట్రీలో సుదీప్, దర్శన్ హీరోలే కాకుండా మంచి స్నేహితులని పేరు. అయితే ఒక ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ, తనకి వచ్చిన ఒక సినిమా ఆఫర్ ని తాను చేసే పరిస్థితి లేక, దర్శన్ ని సజెస్ట్ చేసినట్టు చెప్పారు. అయితే అప్పట్లో ఆ సినిమాతోనే దర్శన్ కి ఫాలోయింగ్ రాగా, సుదీప్ వలన తనకి ఆ ఆఫర్ రాలేదని, అబద్ధాలు ఎందుకు చెప్పడమంటూ 2017 లో ట్విట్టర్ వేదికగా దర్శన్ గారు ప్రశ్నించారు. తాము ఇక ఫ్రెండ్స్ కాదు అని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. సుదీప్ గారు దీనికి సమాధానం చెప్పలేదు గానీ, అప్పట్లో ఇది కొంత దుమారం లేపింది.
అలానే 2021 లో చెస్ డాట్ కామ్ ‘చెక్ మేట్ కోవిడ్’ కాంపెయిన్ రన్ చేయగా, అనేక మంది వ్యాపారవేత్తలు, సెలెబ్రిటీలు, ప్రసిద్ధ చెస్ ప్లేయర్స్ ఇందులో పాల్గొన్నారు. అయితే సుదీప్ గేమ్ ఆడుతూ, చెస్ ఇంజిన్స్ వాడి చీటింగ్ కి పాలపడ్డారని, ఫెయిర్ ప్లే పాలిసీని మీరారని చెస్ డాట్ కామ్ ఆయన్ని బ్యాన్ చేసింది. ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా బ్యాన్ అయ్యారు.
ఆ చిన్న వివాదాలు పక్క న పెడితే 25 ఏళ్ల ప్రస్థానంలో ఆయన మచ్చ లేని మనిషి. కర్ణాటకలో ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ దత్తత తీసుకున్నారు, ఎన్నో సార్లు సామాజిక శ్రేయస్సు కోసం విరాళాలు అందించారు, అలానే సుదీప్ చారిటబుల్ ట్రస్ట్ ని కూడా స్థాపించి ఎందరికో అండగా నిలుస్తున్నారు, ఎందరికో ఆదర్శంగా మారారు.
అంతటి అభిమాన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కిచ్చా సుదీప్ అనే హీరో, కన్నడ సినిమా చరిత్రలో అద్భుతమైన నటులలో ఒకడిగా నిలిచిపోతారని కన్నడ వర్గాలు అంటూ ఉంటాయి. అదేవిధంగా కన్నడతో పాటు, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించి ఆయన దేశమంతటా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ గారు ఇలానే సినిమాలతో అందరినీ అలరిస్తూ, మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని, ఆరోగ్యాంగా ఉండాలని ఆశిస్తూ సెలవు.