ఎమ్మెల్యే సీతక్క బయోగ్రఫీ
ఒక చిన్న గ్రామానికి సర్పంచ్ గా గెలిస్తేనే ఈమద్య రాజకీయ నాయకులు ఆడంబరాలకు పోతున్నారు.. చిన్న చిన్న నాయకులు కూడా పెద్ద ఎత్తున రాజకీయాలు చేస్తూ కార్లలో తిరుగుతూ ఉన్నారు. కాని సీతక్క ఎమ్మెల్యే అయినా కూడా చాలా సింపుల్ గా ఉంటారు.. ఆమె ఎలాంటి ఆడంబరాలకు వెళ్లకుండా నలుగురిలో కలిసి పోయి తన జీవనంను సాగిస్తూ ఉంటారు. సీతక్క అంటే కరోనా ముందు వరకు ఒక మాజీ నక్సలైట్.. ఒక ఎమ్మెల్యే మాత్రమే. కాని కరోనా లాక్ డౌన్ సమయంలో ఆమె తన నియోజకవర్గ గిరిజన ప్రాంత ప్రజలకు చేసిన సేవతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. అటవి ప్రాంతంలో కనీసం టూ వీలర్ కూడా వెళ్లలేని మార్గంలో సీతక్క ప్రజలకు నిత్యావసర వస్తువులు ఆహారం ఇవ్వడం కోసం నడుచుకుంటూ వెళ్లింది. ప్రభుత్వ అధికారులను వెంట బెట్టుకుని ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టేందుకు అడవి బాట పట్టారు. కరోనా సమయంలో గిరిజనులకు పట్టెడు అన్నం పెట్టి వారితో కలిసి భోజనం చేసిన ఏకైక ఎమ్మెల్యే అంటే సీతక్క అనడంలో సందేహం లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీ లో ప్రభుత్వంను నిలదీస్తూ తన నియోజక వర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలోని ఇతర బడుగు బలహీన వర్గాల వారికి కూడా అండగా ఉంటూ సీతక్క పోరాటం చేస్తూ వస్తున్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచి పోయేలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యే సీతక్క గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1971, జులై 9న సమ్మక్క సమయ్య దంపతులకు వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్న పేట గ్రామంలో జన్మించారు దనసారి అనసూయ అలియాస్ సీతక్క. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. సీతక్క అన్నయ్య పీపుల్స్ వార్ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించే వారు. ఒక పోలీసు ఎన్ కౌంటర్ లో అతడు చిన్న వయసులోనే మృతి చెందాడు. సీతక్క ఏడు సంవత్సరాల వయసులో విద్యాభ్యాసం మొదలు పెట్టారు. 7వ తరగతి నుండి ప్రభుత్వ బాలిక హాస్టల్ లో సీతక్క ఉండి చదువుకున్నారు. హాస్టల్ లో భోజనం సరిగా ఉండక పోవడంతో పాటు నెల నెల ఇచ్చే ఉపకార వేతనం అయిన పది రూపాయలను ఇవ్వకుండా వార్డెన్ తన వద్దే ఉంచుకునే వారు. అమ్మాయిలకు డ్రస్ లతో పాటు అన్ని విషయాల్లో కూడా అవినీతికి పాల్పడేవాడు. పురుగుల అన్నం పెడుతూ అమ్మాయిల ఆరోగ్యంతో ఆడుకుంటున్న వార్డెన్ కు బుద్ది చెప్పాలనే ఉద్దేశ్యంతో సీతక్క ఆందోళన మొదలు పెట్టింది. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ పై స్నేహితురాళ్లతో కలిసి తిరగబడింది.
సీతక్క అన్నయ్య మరియు బావ లు పీపుల్స్ వార్ లో ఉండే వారు. హాస్టల్ లో జరుగుతున్న ఆందోళన గురించి వారికి తెలిసి హాస్టల్ వార్డెన్ ను వారు హెచ్చరించారు. అప్పటి ఆ ఒక్క హాస్టల్ లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ లో కూడా సరైన ఆహారం మరియు ఇతర వసతులు కల్పించే వారు. అలా సీతక్క మొదటి ఉద్యమం విజయం సాధించి తన తోటి అమ్మాయిలకు మంచి జరిగింది. పదవ తరగతి చదువుతున్న సమయంలో కూడా పలు ఆందోళన కార్యక్రమాల్లో సీతక్క పాల్గొనేవారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సీతక్క హిందీ పరీక్ష లో ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత ఆమె నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితులు అయ్యారు. 1988 జూన్ లో సీతక్క అడవి బాట పట్టారు. నక్సల్స్ ఉద్యమంలో సీతక్క అడుగు పెట్టడంకు మరో ప్రథాన కారణం ఆమె మేన బావ రాము. అతడు ముందు నుండే ప్రజా ఉద్యమంలో ఉండటం… అతడి భావాల పట్ల ఆకర్షితురాలు అయ్యి.. అతడంటే ఇష్టం పెరిగి ప్రేమగా మారడంతో రాము కోసం కూడా సీతక్క అడవుల బాట పట్టారు.
మేన బావ పేరు రాము అవ్వడం.. అతడితో పెళ్లి నేపథ్యంలో అనసూయ పేరును అన్నలు సీతక్కగా మార్చారు. ప్రజా ఉద్యమంలో ఉన్న సమయంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలు మరియు అక్రమాలపై ఉద్యమాలు చేసింది. బడుగు బలహీన వర్గాల వారిపై కొందరు పెత్తాందారుల అణచివేతపై సీతక్క ఎన్నో ఆందోళనలు చేసింది. నక్సల్స్ ఉద్యమంలో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు దక్కించుకుంది. పలు ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన సీతక్క పలు సార్లు పోలీసుల ఎన్ కౌంటర్ నుండి బయట పడింది. ఉద్యమంలో చేరిన ఏడాదికే ఒక కూంబింగ్ ఆపరేషన్ లో పోలీసుల చేతికి సీతక్క మరియు కొందరు ఉద్యమకారులు పట్టుబడ్డారు. ప్రజా ఉద్యమంలో భాగం పలు నేరాలకు పాల్పడ్డ ఆరోపణలతో సీతక్క కొన్నాళ్లు జైలు జీవితంను గడిపారు. ఆ సమయంలోనే ఫెయిల్ అయిన 10వ తరగతి హిందీ పరీక్షను సప్లమెంటరీ ద్వారా రాసి పాస్ అయ్యారు. అలా జైల్లో ఉన్న సమయంలో పదవ తరగతి పూర్తి చేశారు. జైలు నుండి విడుదల అయిన తర్వాత మళ్లీ ప్రజా ఉద్యమం వైపే వెళ్లారు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత సీతక్క మరింత రాటుతేలినట్లుగా ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. తక్కువ సమయంలోనే దళంలో కీలక సభ్యురాలిగా మరియు కమాండర్ గా కూడా బాధ్యతలను సీతక్క నిర్వహించినట్లుగా చెబుతూ ఉంటారు. సీతక్క జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మేనబావ రాముతో దళ సభ్యులు వివాహం చేశారు. కొన్నాళ్లకు వీరికి ఒక బాబు జన్మించాడు. ఆ బాబుకు ప్రతిఘటన అనే పేరు పెట్టారు. అడవిలో బాబు పెంపకం ఇబ్బంది అవుతున్న కారణంగా బాబును బయటి వారికి ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత బాబుకు పెంపుడు తల్లిదండ్రులు సూర్య అనే పేరు పెట్టారు. రెండు నెలల వయసు ఉన్న కొడుకును వదిలి సీతక్క ఉద్యమంలో నిలిచారు. కన్నడ కొడుకు ను బయటి వారికి ఇవ్వాల్సి వచ్చిందనే బాధ ఆమెకు ఎప్పుడు ఉండేదట.
ఉద్యమంలో పలు విభాగాల్లో పని చేసి ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించిన సీతక్క కొన్నాళ్లకు భర్త రాముతో విభేదాల కారణంగా విడి పోయారు. భర్త తో విడిపోయిన సీతక్క కొన్నాళ్లకే అంటే 1996 లో సీతక్క ప్రజా ఉద్యమం నుండి బయటకు వచ్చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిన సీతక్కకు మొదట అవమానాలు ఎదురయ్యాయి. పోలీసులకు లొంగి పోయిన సీతక్క సాదారణ జీవితంను గడిపేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఏజెన్సీ అనే స్వచ్చంద సంస్థలో ఉద్యోగంలో చేరింది. అక్కడ ఆమెకు నెలకు 3500 రూపాయల జీతం ఇచ్చే వారు. ఆ సమయంలో అప్పటి ఆంద్ర ప్రదేశ్ మొత్తం తిరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనుల సమస్యలను ఆమె తెలుసుకున్నారు. ఆ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించే వారు. ఆ స్వచ్చంద సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఇంటర్ మరియు డిగ్రీని పూర్తి చేసిన సీతక్క లా కోర్సును కూడా ముగించింది. వరంగల్ లో లాయర్ గా కూడా సీతక్క కొన్నాళ్లు ప్రాక్టీస్ ను నిర్వహించారు. ఒక వైపు లాయర్ గా విధులు నిర్వహిస్తూనే మరో వైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గిరిజనుల సమస్యలను సీతక్క గుర్తించారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లు అవుతున్నా కూడా ఇంకా గిరిజనులు పడుతున్న ఇబ్బందులు ఆమెకు తీవ్ర మానసిక ఆవేదనకు గురి చేశాయి. దాంతో వారికి మరింతగా ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావించారు. ఆ సమయంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గిరిజనుల కోసం తీసుకు వచ్చిన పథకాలు మరియు చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు నచ్చి సీతక్క ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ప్రకటించారు. దాంతో ములుగు నియోజక వర్గం నుండి 1999 లో తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసింది. కాని అప్పుడే పార్టీలో జాయిన్ అవ్వడంతో పాటు ప్రజల్లో ఆమెకు ఇంకా గుర్తింపు లేక పోవడంతో పార్టీ అధినాయకత్వం ఆమెకు సీటు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయినా కూడా తెలుగు దేశం పార్టీలోనే పని చేస్తూ వచ్చింది సీతక్క. పార్టీ కోసం సీతక్క పాటు పడుతున్న విధానం.. అలాగే ములుగులో ఆమెకు ఉన్న పేరు ప్రతిష్టల నేపథ్యంలో 2004 లో ఎమ్మెల్యే సీటును చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనం కొనసాగింది. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య గెలుపొందాడు. ములుగులో సీతక్కకు మంచి పేరు ఉన్నా కూడా ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రచారంలో సీతక్క వెనుక పడటంతో పాటు తెలుగు దేశం పార్టీ పాలన మార్పును అప్పటి ఓటర్లు కోరుకున్నారు. సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూడాలనే ఉద్దేశ్యంతో ములుగులో కూడా సీతక్కను చూడకుండా రాజశేఖర్ రెడ్డి కోసం కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. దాంతో మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు సీతక్క. మొదటి ఓటమితో కృంగి పోయిన సీతక్కను చంద్రబాబు నాయుడు పిలిపించుకుని మాట్లాడారు. ఓడిపోయినా కూడా జనాల్లోనే ఉంటూ జనాల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారికి అండగా ఉండాలని సూచించాడు. దాంతో సీతక్క ములుగు లోనే ఉంటూ ప్రతి ఒక్క వర్గం ప్రజలతో మమేకం అయ్యేవారు. ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే వద్దకు తీసుకు వెళ్లి పరిష్కారం కోరే వారు. అలా అయిదు ఏళ్లలో సీతక్క పై అక్కడి జనాల్లో బాగా పెరిగింది.
2009 లో మహా కూటమి తరపున ములుగు నియోజక వర్గంలో సీతక్క పోటీ చేసింది. ఆ సమయంలో భారీ మెజార్టీతో సీతక్క విజయం ను సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న ఆ సమయంలో సీతక్క మొదటి సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే రాజశేఖర్ రెడ్డి మృతి చెందడటంతో రాష్ట్రంలో రాజకీయం మారిపోయింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి సీతక్క సన్నిహితురాలిగా మారిపోయింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంను ఉదృతం చేసి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను జనాల్లో రగిల్చాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం సీతక్క కూడా పట్టుబట్టారు. అలా 2014 లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. కొత్త రాష్ట్రంలో వచ్చిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ములుగు నుండి మళ్లీ పోటీ చేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గాలి బలంగా వీచింది. దాంతో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి చేతిలో సీతక్క ఓడిపోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణలో తెలుగు దేశం పార్టీ భవిష్యత్తు లేకుండా పోయింది. మెల్ల మెల్లగా తెలుగు దేశం పార్టీ నాయకులు అధికార టీఆర్‌ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న సమయంలో సీతక్క మాత్రం చాలా కాలం పాటు తెలుగు దేశం పార్టీలోకే కొనసాగుతూ వచ్చారు. కాని భవిష్యత్తు లేని తెలుగు దేశం పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేయడం ఎలా అనుకుని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయిన సమయంలో ఆయన దారిలోనే సీతక్క కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ టీమ్ లో జాయిన్ అయ్యారు. 2018 లో కాంగ్రెస్ తరుపున ములుగు నియోజక వర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందింది. టీఆర్‌ఎస్ ధాటికి రేవంత్ రెడ్డి వంటి హేమా హేమీలు కూడా ఓడి పోయిన సమయంలో సీతక్క మాత్రం గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. సీతక్కను టీఆర్‌ఎస్ వైపు లాగేందుకు అధికార పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు అనే వాదన ఉంది. కాని తాను నమ్మిన పార్టీ సిద్దాంతంతో ముందుకు వెళ్తూ ఉంది.
రాజకీయాల్లో ఉన్నా కూడా ప్రజా ఉద్యమంలో ఉన్నప్పుడు ఎలాంటి పంథాను అనుసరించేదో అలాంటి పనితీరునే సీతక్క ఎప్పుడు కనబర్చుతూ వచ్చారు. పదిహేనేళ్ల వయసులో ప్రజా ఉద్యమం వైపు ఆకర్షితురాలు అయ్యి చిన్న వయసులోనే నక్సల్ గా మారి పదేళ్ల పాటు అడవిలో ఆకులు తింటూ అడవి జంతువులతో సహవాసం చేస్తూ గిరిజన బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం పోరాటం సాగించి.. వారిపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వచ్చింది. ఉద్యమం గతి తప్పుతోంది.. దారి తప్పుతోందని గ్రహించిన సీతక్క సరైన సమయంలో ప్రజా ఉద్యమాన్ని వదిలేసి ప్రజాస్వామ్య యుతంగా జనాలకు సేవ చేయాలనుకుని జనజీవన స్రవంతిలో కలిసి పోయింది. ఎన్నో ఆటు పోట్లు ఎన్నో మలుపులు ఎన్నో కుదుపులు సీతక్క జీవితంలో ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఒంటరి మహిళగా జీవితాన్ని గడుపుతున్నా కూడా తన ప్రజల కోసం ఎప్పుడు అండగా ఉంటూ వస్తున్నారు. తన నియోజక వర్గమే ఇల్లుగా.. అందులోని ప్రజలే కుటుంబ సభ్యులుగా జీవితంను సాగిస్తున్న దనసారి అనసూయ అలియాస్ సీతక్క కొన్ని లక్షల మంది అమ్మాయిలకు ఆదర్శం. కడు పేద కుటుంబం నుండి వచ్చిన సీతక్క కొన్ని లక్షల మంది బలహీన వర్గాల వారి కోసం సాగించిన పోరాటం రాబోయే శతాబ్దకాలం కూడా గుర్తుండి పోతుంది. తెలుగు రాజకీయాల చరిత్రలో సీతక్క పేరు సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చు
GIPHY App Key not set. Please check settings