వయసులో చిన్నవాడు, కానీ ప్రజల కోసం గళం వినిపించడంలో పెద్దవాడు. రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, ఆంధ్రప్రదేశ్ లోనే కాక, కేంద్ర స్థాయిలో సైతం తన ఉనికిని చాటుకున్న సిక్కోలు సింగం కింజరపు రామ్మోహన్ నాయుడు. తండ్రి ఆదర్శాలను పాటిస్తూ, అభివృద్ధి సాధిస్తూ, శ్రీకాకుళం ప్రజలు మా వాడని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన ఆ యువ నాయకుడి రాజకీయ జీవితం గురించిన ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ వీడియో ద్వారా మీతో పంచుకోబోతున్నాం.
కింజరపు రామ్మోహన్ నాయుడు 1987, డిసెంబర్ 18న శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో జన్మించారు. ఆయన తండ్రి గారి పేరు కింజరపు ఎర్రన్నాయుడు, తల్లి గారు విజయకుమారి. ఆయన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు గారు, టీడీపీలో ప్రధాన నాయకుడు. ఆయన హరిశ్చంద్రపురం శాసనసభ నియాజకవర్గం నుండి 4 సార్లు వరుసగా పోటీ చేసి గెలిచారు. అలానే శ్రీకాకుళం లోక్ సబ్ నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు ఎంపీగా గెలిచారు. 1996-98 మధ్య కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 2012, నవంబర్ లో ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఆయన మరణించారు. ఇక రామ్మోహన్ గారికి ఒక అక్క కూడా ఉన్నారు, ఆమె పేరు ఆదిరెడ్డి భవాని. ఆమె కూడా టీడీపీలో నాయకురాలు కాగా, రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి మొదటిసారి పోటీ చేసి 2019 లో ఎమ్మెల్యేగా గెలిచారు. రామ్మోహన్ నాయుడు గారు లోకల్ లోనే 1990 నుండి 96 వరకు గాయత్రి మోడల్ హై స్కూల్ లో, 96 నుండి 98 వరకు భారతీయ విద్యా భవన్ లో చదివారు. దాని తరువాత ఎర్రన్నాయుడు గారు ఢిల్లీలో ఉండవలసి రావడంతో 1998-2004 వరకు అంటే ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివారు. ఇక 2004-08 వరకు యూఎస్ లోని పర్డ్యూ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తిచేయగా, 2009-11 లో న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేశారు. దాని తరువాత ఒక ఏడాది పాటు సింగపూర్ లో కూడా జాబ్ చేశారు.
రామ్మోహన్ నాయుడు గారికి 2017, జూన్ 14న బండారు శ్రావ్య గారితో వివాహం జరిగింది. ఆమె మాజీ రాష్ట్ర మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కూతురు. ఇక ఈ దంపతులకు 2021, ఫిబ్రవరిలో ఒక పాప పుట్టగా, తన పేరు మిహిరా.
రామ్మోహన్ గారు వారి తండ్రి గారు చనిపోయిన తరువాతే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన 2013 నుండి టీడీపీ నుండి రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేయడం మొదలుపెట్టారు. 2013, అక్టోబర్ లో ఆంధ్రప్రదేశ్ విభజన మీద పోరాడటంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గారికి మద్దతు ఇస్తూ, ఢిల్లీలో నిరాహార దీక్షకు కూఆ కూర్చున్నారు. ఇక 2014 శ్రీకాకుళం లోక్ సబ్ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి 1,27,576 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రభంజనం సృష్టించారు. అంతేకాకుండా ఆ 16వ లోక్ సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ కి వెళ్లిన రెండవ అతి పిన్న వయస్కుడు రామ్మోహన్ గారు. అలానే, 16వ లోక్ సభలో ఆయన రైల్వే అండ్ హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీలోనూ, టూరిజం అండ్ కల్చర్ మంత్రిత్వశాఖ కన్సల్టేటివ్ కమిటీలోనూ, వెనుకబడిన ఇతర కులాల సంక్షేమం మరియు అధికారిక భాష డిపార్ట్మెంట్ లలోనూ ఆయన మెంబర్ గా ఉండేవారు. ఆ విధంగా కేంద్ర స్థాయిలో తనకి గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే విశాఖ హెడ్ క్వార్టర్స్ గా ఆంధ్రకు రైల్వే జోన్ కేటాయించేలా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్ ని కూడా ప్రవేశపెట్టారు, ఈ చర్యతో కేంద్రాన్ని ఈ విషయం గురించి చర్చించేలా కృషిచేశారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రులకు కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించగా, దాన్ని పట్టించుకోవడం లేదని, 2018, అక్టోబర్ లో ఆముదాలవలస రైల్వే స్టేషన్ లో రాత్రంతా ప్లాట్ఫారం మీద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అయితే దానికి ముందే 2108, ఫిబ్రవరిలో కేంద్రం ఏపీ రీ-ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అందించాల్సిన నిధులు ఇవ్వడం లేదని, ఢిల్లీలో పార్లమెంట్ వద్ద టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కే.శివప్రసాద్, టీజీ వెంకటేష్, కిస్టప్ప, నారాయణరావు, తదితరులు రామ్మోహన్ నాయకత్వంలోనే నిరసన వ్యక్తం చేశారు.
ఇక మళ్ళీ శ్రీకాకుళం నియోజకవర్గం నుండే 2109 లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి 6653 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి కేవలం ముగ్గురు ఎంపీలే గెలవగా, వారిలో రామ్మోహన్ గారు ఒకరు. ఇక 2019-20 ఏడాదిలో ఆయన పార్లమెంట్ హాజరు 90% కాగా, 69 ప్రశ్నలను అడగడం జరిగింది, 34 డిబేట్స్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఇవి పార్లమెంట్ ప్రశ్నలు, డిబేట్స్ యావరేజ్ నంబర్స్ కంటే పెద్దవి కావడం విశేషం. అలానే ఆయన మీద క్రిమినల్ కేసులు సున్నా అని పార్లమెంట్ లెక్కల్లో చెప్పింది. అయితే 2020 కి గాను ప్రతిష్టాత్మక సంసద్ రత్న అవార్డుకి రామ్మోహన్ ఎన్నికయ్యారు. ఆ ఏడాది విజేతలు అయిన శశిథరూర్, సుప్రియ సులే వంటి దిగ్గజాల మధ్య ఆయన పేరు కూడా పార్లమెంట్ లో వినబడింది. ఆయన యొక్క విలువైన పనితీరు, కృషికి గాను జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు ఆయనకు దక్కింది. విశేషం ఏంటంటే, ఈ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు ఎంపీగా చరిత్ర సృష్టించడమే కాక, అతి చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా కేంద్ర స్థాయిలో తన పేరు మీద చరిత్ర లిఖించారు.
అలానే రామ్మోహన్ గారు, 2017 లో జరిగిన 72వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో, నిరాయుధీకరణ మీద మొదటి కమిటీ యొక్క 22వ సమావేశంలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడారు. ఆయన ఆ స్పీచ్ లో, ఐక్యరాజ్యసమితి యొక్క నిబంధలనుసారమే ఇండియా నడుచుకుంటుంది, ఐక్యరాజ్యసమితి విధానాలను ఇండియా పరిరక్షిస్తుందని, మిత్ర దేశాలతో సామరస్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అలానే, న్యూక్లియర్ ఆయుధాలను వినియోగ నిర్మూలన వంటి విషయాలను ఇండియా తరఫున ఆ ఐక్యరాజ్యసమితిలో వినిపించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. ఇక యువతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని, యువతరం వలనే రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అభివృద్ధిరిత్యా నూతన పోకడలు వస్తాయని విశ్వసిస్తూ, ‘పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్’ అనే ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రాంని మొదలుపెట్టారు. అయితే దీనికి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలోని 130 కాలేజీలకి చెందిన 210 మంది విద్యార్థులు అప్లై చేయగా, 18 మందిని ఎంపిక చేసి అయన సొంత నియోజవర్గంలో సమస్యల మీద పనిచేసేలా 2 నెలల ఇంటర్న్షిప్ ప్రోగ్రాం రన్ చేసారు.
ఇక రామ్మోహన్ గారు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండగా, ప్రభుత్వం మీద వీలు దొరికినప్పుడల్లా మాటల యుద్ధం చేస్తూనే, నిరసనల రూపంలో కూడా తన వంతుగా శ్రమిస్తూ పార్టీ పెద్దల చేత, ప్రజల చేత కీర్తించబడుతున్నారు. అలా 2019, మే లో ఏపీలో జగన్ గారి ప్రభుత్వం రాగానే ఇసుక మీద కొత్త పాలసీ తెచ్చే వరకు ఇసుక రవాణాను నిలిపివేయగా, దాని మీద ‘ది న్యూస్ మినిట్’ లో రామ్మోహన్ గారు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, 2019, అక్టోబర్ లో ఆ ఇసుక మైనింగ్ పాలసీ గురించి ఆర్టికల్ రాసారు. ఆయన ఆ ఆర్టికల్ లో, “ఇసుక రవాణా లేక 3 నెలల పాటు ఇసుక కార్మికులు, వారి కుటుంబాలు విలవిలలాడాయి, రాష్ట్రంలో నిర్మాణాలు ఆగిపోయి, భవన నిర్మాణ రంగం 3 నెలల పాటు స్థంభించిపోయింది” అని రాశారు. అలానే, 2021, సెప్టెంబర్ లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, ఆముదాలవలసలో రామ్మోహన్ గారు, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భారీగా నిరసనకు దిగగా, ఆయన్ను, మరికొంతమంది నాయకులని పోలీసులు అరెస్ట్ చేశారు. అలానే, ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయడం పై కూడా అయన నిరసనలు చేయడం జరిగింది.
ఇక ఉత్తర కోస్తా, ముఖ్యంగా శ్రీకాకుళంలో తిత్లి తుఫాను కారణంగా ప్రజలకు ఎంతో నష్టం జరిగినప్పుడు కూడా ఎంపీగా, ఒక నాయకుడిగా వారికి అందుబాటులో ఉండి అందరినీ కలుస్తూ, వివిధ రాకలుగా ఫండ్స్ కలెక్ట్ చేసి వారికి సహాయం చేయడం జరిగింది. ఇదే కాక, పలు సందర్భాల్లో అయన తన బాధ్యతగా చేయవల్సిన ఎన్నో కార్యాలను బాధ్యతయుతంగా చేయడం జరిగింది, జరుగుతూ ఉంది. అలానే ఈ 9 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఆయన మాటలకి ముగ్ధులై చప్పట్లు కొట్టి, ఈలలు వేసిన వారే తప్ప ఎవరూ దూషించనదిలేదు, ఎలాంటి వివాదాల్లో ఆయన పేరు వినబడలేదు.
ఆ విధంగా వయసుకి చిన్నవాడే అయినా ప్రజలకు పెద్దగా నిలిచి, వారి కష్టాలను తీర్చే పదవిలో ఉంటూ తన కర్తవ్య దీక్షలో నిరంతరం శ్రమించే కింజరపు రామ్మోహన్ నాయుడు, భవిష్యత్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారే వ్యక్తి అని పలువురు ప్రశంసిస్తుంటారు. ఆయన ఇలానే ప్రజల మద్దతుతో మరిన్ని మంచి పనులు చేయాలని, ప్రజా నాయకుడిగా పేరొంది, మరిన్ని సత్కారాలను పొంది రాష్ట్రఖ్యాతిని పెంచాలని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.