నందమూరి ఇంటి ఆడపడుచు, నారా వారి కోడలు, చిన్నతనం నుండి అటు సినిమా, ఇటు రాజకీయ రంగాలను దగ్గర నుండి చూసినా, ఆ రెండిటినీ కాకుండా వ్యాపారంలో తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకున్న తెలివైన, సమర్థవంతురాలైన నారీమణి నారా బ్రాహ్మణి. ఆమె కుటుంబ నేపథ్యం గురించి అందరికీ తెలిసిందే, అయితే ఆమె చదువు, వ్యాపారం, సాధించిన విజయాలు, కొన్ని ఆసక్తికర విషయాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం.
నారా బ్రాహ్మణి గారు 1988, డిసెంబర్ 21న నందమూరి బాలకృష్ణ, వసుంధర గార్ల దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. ఆమె తాత గారు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారితో ఆమెకు చిన్నప్పుడు మంచి బంధం ఉండేది, ఆయన వల్లనే అంకు చికెన్ తినడం కూడా అలవాటు అయ్యిందట. ఆమెకు ఒక చెల్లి తేజస్విని, తమ్ముడు మోక్షజ్ఞ తేజ ఉన్నారు. ఇక పెద్దనాన్నల పిల్లలు, అన్నయ్యలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న గురించి అందరికీ తెలిసిందే. 2018 లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల తండ్రి హరికృష్ణ గారు తరువాత, ఒక ప్రత్యేక సమయంలో అన్నయ్య ఎన్టీఆర్ గారికి ఆమె హరికృష్ణ గారి ఫోటోస్ ని గిఫ్ట్ ఇవ్వడం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది.
బ్రాహ్మణి గారి స్కూలింగ్ అంతా హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జరిగింది, ఆమె ఇంటర్ శ్రీ చైతన్యలో, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ హైదరాబాద్ సీబీఐటీలో పూర్తిచేశారు. ఇక 2007 నుండి 09 వరకు కాలిఫోర్నియాలోని శాంటా క్లారా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో ఎంఎస్ చేశారు. ఆ యూనివర్సిటీలో ఆమెకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అత్యధిక జీపీఏ రావడంతో అకాడమిక్ అచీవ్మెంట్ అవార్డు కూడా దక్కింది. ఆ తరువాత 2011 నుండి 2013 వరకు స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తిచేశారు. ఇక వ్యాపారంలో ఉపయోగపడేలా 2020 లో కూడా కొన్ని నెలల పాటు మోడరన్ మార్కెటింగ్ ప్రాసెస్, కంటెంట్ స్ట్రాటజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన విషయాల మీద పట్టు కోసం లోగ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా నేర్చుకున్నారు.
బ్రాహ్మణి గారు అంత పెద్ద కుటుంబాలకి చెందినవారైనా కూడా తన సొంతగా తన కాళ్ళ మీద తను నిలబడడం కోసం, వృత్రిపరమైన జ్ఙానం కోసం సింగపూర్ లోని వెర్టెక్స్ వెంచర్ మానేజ్మెంట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ గా 2009 నుండి 2011 మధ్య 20 నెలలు పనిచేశారు. ఆమె ఆ సమయంలో ఆఫీస్ కి వెళ్లి రావడానికి సాధారణ యువతిలానే మెట్రో ట్రైన్ సర్వీస్ నే ఉపయోగించేవారట. ఆ తరువాత 2011 మే నుండి సెప్టెంబర్ వరకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీకి బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. మళ్ళీ స్వతహాగా 2012 లో ఆగష్టు నుండి సెప్టెంబర్ వరకు పారిస్ లోని డనోన్ అనే కంపెనీలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్ కిడ్స్ ఇంటర్న్ గా పనిచేశారు. ఇక దాని తరువాత 2013 లో హెరిటేజ్ ఫుడ్స్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి, ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ అభివృద్ధికి పనిచేస్తున్నారు.
ఆమె కంట్రోల్ తీసుకున్న తరువాత హెరిటేజ్ కంపెనీకి చాలా లాభాలు వచ్చాయి. దీనికి పాద్దన ఉదాహరణ ఆమె 2016 లో చేసిన ఒక డీల్. అదేంటంటే, దేశీయ, విదేశీయ కంపెనీల పోటీ కారణంగా హెరిటేజ్ రిటైల్ విభాగం అంత గొప్పగా నడిచేది కాదు. దీనితో ఆమె తమ అత్తమామలను, కంపెనీ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ను ఒప్పించి, హెరిటేజ్ రిటైల్ విభాగాన్ని కిషోర్ బియానికి యొక్క ఫ్యూచర్ గ్రూప్ కి 2016 నవంబర్ లో అమ్మేశారు. అయితే అందులో కేవలం రూ.295 కోట్ల విలువ చేసే 3.65 శాతం షేర్స్ మాత్రం నామమాత్రంగా హెరిటేజ్ ఉంచుకుంది. అయితే ఒకానొక సమయంలో అనూహ్యంగా అమెజాన్, రిలయన్స్ లాంటి కంపెనీలు ఫ్యూచర్ గ్రూప్ షేర్స్ కొనడానికి సిద్ధం కావడంతో ఫ్యూచర్ గ్రూప్ షేర్స్ అమాంతంగా పెరిగిపోయాయి. దీనితో అందులో 3.65 శాతం షేర్స్ కలిగిన హెరిటేజ్ సంస్థ యొక్క ఆస్తి రూ.300 కోట్ల నుండి ఐదింతలు పెరిగి రూ.1500 కోట్లకు పెరిగింది. ఈ ఒక్క విషయంతో ఆమె ఆలోచన సామర్థ్యం ఏంటో అర్థమవుతుంది. అంతేకాకుండా అప్పటి నుండి హెరిటేజ్ ఫుడ్స్ ని బాగా డెవలప్ చేస్తూ, ఈ మధ్య కాలంలో 90 రోజుల పాటు నిల్వ ఉండే పాలను కూడా హెరిటేజ్ ఉత్పత్తి చేయడంలో విజయం సాధించారు.
నారా బ్రాహ్మణి గారికి 19 ఏళ్ళ వయసులోనే, అంటే 2007 ఆగష్టు 26న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, భువనేశ్వరిల కుమారుడు నారా లోకేష్ తో వివాహం జరిగింది. ఒకసారి సోషల్ మీడియా వేదికగా లోకేష్ గారు ఆమెను తమ ఇంటికి లభించిన బహుమతి అని కూడా అభివర్ణించారు. నిజమే మరి! ఇక ఆ దంపతులకు 2015, మార్చ్ 21న ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు దేవాన్ష్.
ఇక ఆమె సేవల విషయానికి వస్తే, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో భాగంగా ఆమె టీడీపీ పార్టీలోని పేద కార్యకర్తలకు, హెరిటేజ్ సంస్థలోని పేద కార్మికుల పిల్లలకు విద్య, వైద్యం అందించేందుకు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టి తగిన శిక్షణ అందేలా చూస్తున్నారు. 2015 డిసెంబర్ లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఉచితంగా పోటీపరీక్షలకు శిక్షణ ఇప్పించగా, అక్కడ శిక్షణ పొందిన 900 మందిలో 130 మంది లెవల్-2 ఎగ్జామ్ ని క్లియర్ చేశారు.
నారా బ్రాహ్మణి గారు రాజకీయాలలో పెద్ద చురుకుగా ఉండకపోయినా, 2019 లో భర్త లోకేష్ పొతే చేసిన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించి, ప్రచారం చేశారు. పార్టీ శ్రేణుల్లో కూడా ఆమె సమర్థవంతురాలని, తెలివైన వ్యక్తి అని ఎంతోమందికి నమ్మకం ఉంది.
ఆ విధంగా నారా బ్రాహ్మణి అటు నందమూరి ఆడపిల్లగా పుట్టింటి ఖ్యాతిని కాపాడుతూ, ఇటు నారా వారి కోడలుగా మెట్టినింటి గౌరవాన్ని రెట్టింపు చేసేలా కృషిచేస్తూ అందరి నుండి ప్రశంసలు పొందుతున్నారు. ఆమె ఇలానే భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి, ఎంతో అభివృద్ధిని గడించాలని, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.