6 అడుగుల అందగాడు. 90ల మధ్యలో ఆయనకి ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగే వేరు. అందరూ ఆయనను ‘న్యూ ఏజ్ శోభన్ బాబు’ అనేవారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని, ఏ వివాదాలు లేకుండా సినీ ప్రయాణంలో అంచలంచెలుగా ఎదిగిన నటుడు శ్రీకాంత్. ఈ వీడియోలో మనం శ్రీకాంత్ గారి ఫ్యామిలీ, సినీ జీవితం గురించి తెలుసుకుందాం.
శ్రీకాంత్ గారు 1968, మార్చ్ 23న కర్ణాటకలోని గంగవతి అనే ప్రాంతంలో పుట్టారు. ఆయన తల్లి గారి పేరు ఝాన్సీ లక్ష్మి, తండ్రి గారి పేరు పరమేశ్వరరావు. శ్రీకాంత్ గారి తండ్రి పరమేశ్వరరావు గారు భూసామి కాగా, వారు కృష్ణాజిల్లాలోని మేకవారిపాలెం నుండి గంగవతి ప్రాంతానికి వలస వెళ్లిపోయారు. శ్రీకాంత్ గారికి నిర్మల అనే అక్క, అనిల్ అనే తమ్ముడు ఉన్నారు. అనిల్ కూడా రెండు సినిమాలు చేయగా, ‘ప్రేమించేది ఎందుకమ్మా’ అనే సినిమాలో హీరోగా నటించారు. శ్రీకాంత్ గారు కర్ణాటక యూనివర్సిటీలో బీకామ్ చేశారు. ఆ తరువాత ఆయన నటన మీద ఆసక్తితో చెన్నై వచ్చేసారు.
శ్రీకాంత్ గారి దాంపత్య జీవితానికొస్తే, 1997, జనవరి 20న సినీ నటి ఊహ గారిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వారికి రోషన్, రోహన్ అనే ఇద్దరు కొడుకులు, మేధ అనే కూతురు ఉన్నారు. రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్ళిసందడి’ సినిమాల్లో హీరోగా నటించాడు.
ఇక శ్రీకాంత్ గారి నట ప్రస్థానం చూస్తే, అతను సులువుగా హీరో కాలేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చ, హీరోగా ఎదిగిన నటుడు శ్రీకాంత్. ఆయన 1990 లో మధు ఫిల్మ్ & టీవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్టింగ్‌లో ఒక ఏడాది యాక్టింగ్ కోర్స్‌లో జాయిన్ అయ్యారు. ఆయనకి మొదటిసారి 1991 లో రిలీజ్ అయిన ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ సినిమా ద్వారా వెండి తెర మీద కనబడే అవకాశం దక్కింది. అక్కడ నుండి పలు సినిమాల్లో సహాయక పాత్రలు, చిన్న విలన్ రోల్స్‌లో నటిస్తూ వచ్చారు. అలా 1993 ఒక్క ఏడాదిలోనే 13 సినిమాలలో నటించారు. ఆ ప్రయాణంలోనే ఆయన ఒక కన్నడ సినిమా చేసారు.
ఇక 1993 లో హీరోగా అవకాశం దక్కింది, ‘వన్ బై టూ’ సినిమాలో శ్రీకాంత్ గారు, జె.డి.చక్రవర్తి గారు కలిసి నటించారు. అయితే 1995లో రిలీజ్ అయిన ‘తాజ్‌మహల్’ సినిమాతో సోలో హీరోగా మొదటి హిట్ కొట్టారు. ఇక అక్కడ నుండి వివిధ హిట్ సినిమాలతో మొత్తంగా 130 పైనే సినిమాలు తీసిన శ్రీకాంత్ గారు, హీరోగా 100 సినిమాలు పూర్తి చేసారు. అయితే ఒక్క 1998లో హీరోగా 10 సినిమాలు చేసారు. ఇక ప్రస్తుతం ఒకవైపు హీరోగా సినిమాలు తీస్తూనే, మరో వైపు సహాయ నటుడిగా కూడా చేస్తున్నారు. అదేవిధంగా, ‘చంద్రగ్రహణం’, ‘షూట్ అవుట్’ వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు. ఆయన ఇతర భాషల్లో కన్నడలో 3, మళయాళంలో 1 సినిమా చేసారు.
ఆయన నటించిన ‘స్వరాభిషేకం’ సినిమాకు 2004లో బెస్ట్ తెలుగు సినిమాగా నేషనల్ అవార్డు దక్కింది. అదేవిధంగా, ఆయన నటించి 2011 లో రిలీజ్ అయిన ‘విరోధి’ సినిమా ఇండియన్ పానోరమా సెక్షన్‌లో, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2011 లో ప్రీమియర్‌కి సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాను ఆయన తమ్ముడు అనిల్ ప్రొడ్యూస్ చేసారు. అదే ఏడాది ఆయన లక్మణుడి పాత్రలో నటించిన ‘ శ్రీరామరాజ్యం’ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా- 2011లో స్పెషల్ స్క్రీనింగ్ కి సెలెక్ట్ అయింది.
ఇక ఆయనకు వ్యక్తిగతంగా, ఆయన 100వ సినిమా ‘మహాత్మ’కి గాను నంది అవార్డు లభించింది. అలానే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా 2004 లో ‘శంకర్ దాదా MBBS’ సినిమాకి ఫిలింఫేర్, 2016 లో సరైనోడు సినిమాకి సైమా అవార్డులు లభించాయి.
ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సినిమా ఇండస్ట్రీ తరఫున జరిగిన ప్రతీ క్రికెట్ ఈవెంట్‌లోనూ ఆయన పాల్గొన్నారు. అలానే, సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్‌కి వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నారు.
శ్రీకాంత్ గారు రాష్ట్రంలో గానీ, ఇతర రాష్ట్రాల్లో గానీ విపత్తులు సంభవించినప్పుడు ఎప్పుడూ ముందుండి, తనవంతు సహాయాన్ని అందిస్తూ ఉంటారు.
శ్రీకాంత్ గారి జీవితంలో ఎటువంటి వివాదాలు లేవు కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విషయంలో మాత్రం కొన్ని గొడవలు జరిగాయి. అప్పుడు కూడా ఆయన్ని ఎవరూ వ్యక్తిగతంగా దూషించింది లేదు.
శ్రీకాంత్ గారు ఆ విధంగా ఎంతో కష్టపడి, హీరో అయ్యి, ఈ స్థానంలో ఉన్నారు. ఆయన ఏ పాత్రలో నటించినా, ఆ పాత్రకే అందాన్ని తీసుకొస్తారు. ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆయన ఏ పాత్రలో చూసినా ఆనందంగానే ఫీల్ అవుతారు. శ్రీకాంత్ గారు అటు సీనియర్ హీరోలతోనూ, ఇటు ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు అందరితో కూడా స్నేహంగా ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఆయన అందరిబంధువు, అజాతశత్రువు. శ్రీకాంత్ గారు ఇలానే మరో వంద సినిమాల పైనే చేయాలని, మనందరినీ అలరించాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.