ఉపాసన కామినేని బయోగ్రఫీ | Upasana Kamineni Biography

111
0
ఉపాసన కామినేని బయోగ్రఫీ | Upasana Kamineni Biography | Upasana Kamineni Life Story
ఉపాసన కామినేని బయోగ్రఫీ | Upasana Kamineni Biography | Upasana Kamineni Life Story

మెగాస్టార్ కోడలుగా కాదు, మెగా పవర్ స్టార్ భార్యగా కాదు, దేశ ప్రఖ్యాతి గాంచిన వ్యాపారవేత్త మనవరాలిగా కాదు, సమాజానికి మంచి చేయాలి, ఆరోగ్య పరమైన విషయాలు నిత్యం సామాన్య ప్రజానీకం కూడా తెలుసుకోవాలి, శారీరక, మానసిక ఆరోగ్యం మీద మనకి సరైన అవగాహన అవసరం అని పనిచేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, ఎంతోమంది అభిమానాన్ని చోరగొని, అందరితో గౌరవింబడుతున్న మహిళా ఉపాసన కామినేని కొణిదెల. తన పేరు వెనుక తన ఉనికిని చాటిన పుట్టింటి పేరు, మెట్టినింటి పేరును పెట్టుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఉపాసన గారి గురించిన కుటుంబ నేపథ్యం, సాధించిన విజయాలు, ఆమె జీవితానికి వివిధ ఆసక్తికర విషయాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం.

కామినేని ఉమాసన గారు 1989, జూలై 20న అనిల్, శోభన దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. ఆమె తండ్రి అనిల్ కామినేని గారు కేఈఐ గ్రూప్ ఫౌండర్ కాగా, ఆమె తల్లి శోభన గారు అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్పర్సన్. అంతేకాకుండా శోభన గారు 2017 నుండి 2018 వరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. అలానే శోభన గారిని హెల్త్ కేర్, ఫార్మాసిటికల్స్ రంగంలో చేసిన కృషికి గాను అమెరికాలోని బ్రయంట్ యూనివర్సిటీ డాక్టరేట్ తో సత్కరించింది. ఇక ఉపాసన గారికి పువాన్ష్ అనే సోదరుడు, అనుష్పాల అనే సోదరి ఉన్నారు. ఉపాసన గారి తాతగారు, ఇండియాలో మొట్టమొదటి కార్పొరేట్ హెల్త్ కేర్ అయినా అపోలో హాస్పిటల్స్ ని స్థాపించిన పద్మవిభూషణ్, పద్మభూషణ్ ప్రతాప్ సి రెడ్డి గారు. ఆయన ఆమె తల్లి గారి యొక్క తండ్రి.

ఉపాసన గారికి 2012, జూన్ 14న చెన్నైలోని టెంపుల్ ట్రీస్ ఫామ్ హౌస్ లో మెగాస్టార్, పద్మభూషణ్ చిరంజీవి, సురేఖ గార్ల ఏకైక తనయుడు, నటుడు రామ్ చరణ్ తో వివాహం జరిగింది. అయితే వీరిది ప్రేమ వివాహం కాగా, ఉపాసన గారు లండన్ లో చదువుకునే రోజుల్లోనే తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా రాంచరణ్ తేజ్ గారితో పరిచయం ఏర్పడింది, తద్వారా వారు ప్రేమలో పడటం, తరువాత పెద్దలకు చెప్పి, వారై సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె చరణ్ గారిని ‘మిస్టర్.సి’ అని సంబోధిస్తూ ఉంటారు. అయితే వారి పెళ్ళైన కొత్తల్లో ఆమె లుక్స్ మీద కొందరు కామెంట్ చేసినా, తన నడవడిక, సేవా కార్యక్రమాలతో వారి చేతే అభిమానం పొందే స్థాయికి ఎదిగారు.

ఉపాసన గారు తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రాజస్థాన్ లోని అజ్మర్ ప్రాంతంలో గల మాయో కాలేజ్ గర్ల్స్ బోర్డింగ్ స్కూల్ లో పూర్తి చేశారు. ఇక ఇంటర్ హైదరాబాద్ లోని విల్లా మేరీ కాలేజ్ లో చదివారు. అయితే తను చదువులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని, కానీ ఈవెంట్ మానేజ్మెంట్, ఎక్స్ట్రా కర్కులర్ యాక్టవిటీస్ లో చురుకుగా ఉండేదాన్ని అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దానికి గాను ఆమెకు ఇంటర్ కాలేజ్ లో ఆ ఏడాది బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు కూడా లభించింది. ఇక అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ పెన్నిస్లేవేనియా’లో బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, రేజంట్స్ యూనివర్సిటీ లండన్ లో గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ పూర్తి చేశారు. అంతేకాకుండా 2020 లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో వైపీఓ హార్వర్డ్ 2020 ప్రెసిడెంట్స్ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు.

ఇక ఆమె వృత్తిపరమైన విషయానికి వస్తే, ఆమె చిన్నప్పుడు అపోలో హాస్పిటల్స్ లో పనిచేయాలని అనుకున్నారట, మధ్య వయసులో మళ్ళీ ఫ్యాషన్ డిజైనర్ కావాలని అనుకున్నారట, కానీ, ఆఖరికి తనకి సరిపడే ఫ్యామిలీ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు. 2008 జూలై నుండి అపోలో లైఫ్ అనగా ఫిట్నెస్, వెల్నెస్, ఆరోగ్యం గురించి తెలియజేసే సైట్ అయిన లైఫ్ టైం వెల్నెస్ ఆర్ఎక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కి మేనేజింగ్ డైరెక్టర్ గాను, అదే 2008 జూలై నుండి సీఎస్ఆర్ అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ గాను కొనసాగుతున్నారు. అలానే 2016 నవంబర్ నుండి యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ లో మెంబెర్ గా, తెలంగాణ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మెంబెర్ గా, 2019 అక్టోబర్ నుండి ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టీపీఏ లిమిటెడ్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు.  అలానే ఉపాసన గారు, ఇండో-అమెరికన్ రచయిత, మెడికల్ అడ్వకెట్ అయినా దీపక్ చోప్రాతో కలిసి ‘జియో యాప్’ని లాంఛ్ చేశారు. ఈ యాప్ వాడే వ్యక్తి యొక్క ఒత్తిడి, ఆరోగ్య స్థితిని ట్రాక్ చేసి, ‘వెల్నెస్ ప్రిస్క్రిప్షన్’ పంపిస్తుంది.

అలానే ఆమె ఆరోగ్య సంబంధిత విషయాలు, ఫిట్నెస్ గురించి అవగాహన పెంచే విషయాలను చర్చించే ‘బీ-పాజిటివ్’ అనే హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ని స్థాపించి, దానికి చీఫ్ ఎడిటర్ గా ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన అనుమానాలను, అసత్యాలను తెలియజేసి, సరైన విషయ పరిజ్ఞానాన్ని అందజేసే ‘యూఆర్ లైఫ్.కో.ఇన్’ కూడా స్థాపించారు, అంతేకాకుండా దాని ద్వారానే 2021 లో కోవిడ్ తరువాత శారీరకంగా, మానసికంగా కొంత అసహనానికి గురైన వారి కోసం ‘పోస్ట్ కోవిడ్19 కేర్ రీహేబిలిటేషన్ ప్రోగ్రాం’ని లాంచ్ చేసి, శారీరక, మానసిక ఒత్తిళ్ల నుండి బయటపడడం కోసం, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం తగిన సాధనలు, ఉత్తమ పద్దతులను గురించి న్యూట్రిషన్, ఫీజియోథెరపీ, సైకోలాజిలో నిష్ణాతులైన వారిచే సెషన్స్ రన్ చేస్తున్నారు.

ఉపాసన గారికి చిన్నప్పటి నుండే సేవాభావంతో ఉండేవారు. ఆమె విద్యార్ధి దశలో ఉన్నప్పుడు ‘యూ ఎక్స్చేంజ్’ అనే ఉద్యమం మొదలుపెట్టి, పాత టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ సేకరించి, నక్సల్ ఏరియాలలో ఉండే పిల్లలకు అందించేవారు. ఆమె 2019 అక్టోబర్ నుండి డబ్ల్యుడబ్ల్యుఎఫ్-ఇండియా అనగా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ ఇండియా అనే స్వచ్ఛంద సేవా సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఫిలాంత్రోపి అంబాసడర్ గా ఉంటున్నారు. ఆమె ఇటీవల హిజ్రాలను గౌరవిస్తూ, వారిని తన సోదరి పెళ్ళికి ఆహ్వానించి, వారిని ఈ సమాజంలో గౌరవించాల్సిన బాధ్యత ఉందని చాటారు.

ఉపాసన గారు ఇప్పటి వరకు పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 2017 లో హెల్త్ కేర్ విభాగంలో ఆమె సేవలకు గాను ఫెమినా అవార్డును అందుకున్నారు. 2018 లో ఫోర్బ్స్ సంస్థ ఆమెను ‘టైకూన్స్ ఆఫ్ టుమారో’ గా గుర్తించి సత్కరించింది. 2019 లో ఆమె చేస్తున్న సేవా కార్యక్రామాలకు గాను ‘ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2019’ అని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించబడ్డారు. అలానే 2019 లో ‘లీడర్షిప్ ఇన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ-2019’కి గాను మహాత్మ గాంధీ అవార్డు అందుకున్నారు.

ఉపాసన గారు చదువుకునే కాలంలో కొంత లావుగా ఉండేవారని, తగ్గడం కోసం ఎంతగానో ప్రయత్నించానని, నిత్య సాధనతో ప్రస్తుతం ఫిట్ గా ఉన్నానని చెప్తూ ఉంటారు. అలానే ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, ఇతర ఆరోగ్యపరమైన రోజువారీ కృత్యాల గురించి అందరికీ అవగాహన కలిగించేలా సోషల్ మీడియా వేదికగా తరచూ ఉత్తమమైన పద్ధతుల గురించి వివరిస్తూ, విశ్లేషిస్తూ జాగ్రత్తలు చెప్తారు. ఈ విధంగా ఆమె ఎంతోమందికి సహాయం చేస్తూ, ఎందరికో ఆదర్శంగా నిలిచి, తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు.

ఆ విధంగా పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవం తెస్తూ, అటు వ్యాపారంలోనూ, ఇటు సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. ఉపాసన గారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని, మరెంతోమందికి సహాయం అందించే శక్తి ఆమెకు చేకూరాలని, భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని కోరుకుంటూ సెలవు.

Leave your vote

More

Previous articleనారా బ్రాహ్మణి బయోగ్రఫీ | Nara Brahmani Biography
Next articleMiss Universe 2021: Harnaaz Kaur Sandhu Biography in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here